సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు
రూ.550 కోట్లతో ప్రీ ఆర్మీ ట్రైనింగ్
Published Sat, Sep 3 2016 10:47 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
పాత శ్రీకాకుళం: నిరుద్యోగ యువతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శనివారం తండ్యాం వలసలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో యువజన సర్వీసు శాఖ ద్వారా జిల్లాలోని 300 మంది నిరుద్యోగ యువతకు ప్రీ ఆర్మీ ట్రైనింగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో 300 మంది నిరుద్యోగ యువతకు నెల రోజులపాటు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉన్నత విద్య చదువుకున్న యువత కూడా రూ.5 వేల కనీస వేతనం కోసం నానా పాట్లు పడుతున్నారని మంత్రి తెలిపారు.
రూ.5 కోట్లతో యువజన సర్వీసుల శిక్షణ కేంద్రం
ప్రీ ఆర్మీ శిక్షణ కోసం ప్రభుత్వం రూ.550 కోట్లు కేటాయించిందని చెప్పారు. మొదటి విడతగా రాయలసీమ, కోస్తా జిల్లాల్లో 4 వేల మందికి రక్షణ, పోలీసు రంగాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. శిక్షణకు హాజరయ్యే ఒక్కో అభ్యర్థికి ప్రభుత్వం రూ.10,500 ఖర్చు చేస్తుందని చెప్పారు. జిల్లాలో రూ.5 కోట్లతో యువజన సర్వీసుల శిక్షణ కేంద్రాన్ని నిర్మిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం పోలీసు శిక్షణ కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. జిల్లా ఎస్పీ జె.బ్రహ్మరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, డీఎస్పీ భార్గవరావునాయుడు, జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి, పోలీసు అధికారులు, ఐతమ్, వెంకటేశ్వర, సిస్టమ్ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.
Advertisement