ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/కాశీబుగ్గ: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట వందలాది నిరుద్యోగుల నుంచి సుమారు రూ.75 కోట్లు వసూలు చేసి.. నకిలీ అపాయింట్‌మెంట్ లేఖలిచ్చి మోసగిస్తున్న సుధాకర్ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్మార్ట్ విలేజ్, రూర్బన్ పేరుతో ఎటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, ఎవరికీ ఎటువంటి ప్రాజెక్టు ఇవ్వలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. సుధాకర్ మాత్రం దర్జా వెలగబోస్తున్నాడు. అపాయింట్‌మెంట్ లేఖలు తీసుకున్న వారెవరూ ఆందోళన చెందొద్దని, ఉద్యోగం విషయమై నెలాఖరులోగా స్పష్టత ఇస్తానని డబ్బులు కట్టిన నిరుద్యోగ యువతను జూమ్ సమావేశాల ద్వారా మభ్యపెడుతున్నాడు. ఐదు జిల్లాల్లో సాగుతున్న ఈ నకిలీ బాగోతాన్ని బయటపెట్టిన ‘సాక్షి’ విలేకరులతోపాటు అతడి గుట్టురట్టు చేస్తున్న వారిని చంపుతానంటూ సుధాకర్ బెదిరింపులకు దిగుతున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులతో మాట్లాడించిన వీడియోలు విడుదల చేయగా.. దీనిపై సోమవారం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్‌కు ‘సాక్షి’ విలేకరులు ఫిర్యాదు చేశారు. వాస్తవాలు నిగ్గు తేల్చాలని కోరారు.
కూర్చుంటే జీతమిస్తానంటూ..
సుధాకర్ ప్రతి మండలంలో చిన్న గదిని అద్దెకు తీసుకుని, తనకు డబ్బులిచ్చిన నిరుద్యోగులను అందులో ఉంచుతున్నాడు. వారెవరికీ ఎలాంటి విధులు అప్పగించలేదు. ‘ఆఫీసుకు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లిపోతే చాలు. కొన్నాళ్ల దాటాక బాధ్యతలు అప్పగిస్తాను. అప్పటివరకు మీకు జీతం ఇచ్చేస్తా’ అంటూ నమ్మబలుకుతున్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం అవుతుండటంతో అతడికి డబ్బు చెల్లించిన వారు ‘సాక్షి’ ప్రతినిధికి ఫోన్ చేసి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. సాక్షి కథనాలపై సుధాకర్‌ను ఫోన్‌లో సంప్రదిస్తుంటే.. ‘కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండండి. నెలాఖరులోగా క్లారిటీ ఇస్తాను. మీరిచ్చిన డబ్బుకు ఢోకా లేదు’ అని చెప్పుకొస్తున్నాడని కొందరు నిరుద్యోగులు ‘సాక్షి’కి చెప్పారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
బాధితులూ.. ఫిర్యాదు చేయండి
నిరుద్యోగులెవరూ ఎవరికీ డబ్బులు కట్టి మోసపోవద్దని కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి యువతకు హితవు పలికారు. సోమవారం కాశీబుగ్గలో విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యోగాల పేరిట మోసపోయిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
పోస్టుకు రూ.5 లక్షలు
గ్రామీణ ప్రాంతాలోని ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు స్మార్ట్ విలేజ్, రూర్బన్ మిషన్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అందులో ఎగ్జిక్యూటివ్, క్లస్టర్ అసిస్టెంట్ ఉద్యోగాలిప్పిస్తానంటూ సుధాకర్ తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన సుమారు 1,500 మంది నిరుద్యోగుల నుంచి రూ.5 లక్షల చొప్పున రూ.75 కోట్లు వసూలు చేశాడు. వారందరికీ స్మార్ట్ విలేజ్, రూర్బన్ పేరిట నకిలీ అపాయింట్‌మెంట్లు ఇచ్చి మోసగించాడు. నిజానికి రాష్ట్రంలో ఎక్కడా స్మార్ట్ విలేజ్, రూర్బన్ మిషన్ పేరిట అటు కేంద్ర ప్రభుత్వం గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎటువంటి నియామకాలు చేపట్టలేదు. వాటికింద ఏ సంస్థకూ ఎలాంటి ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు. కానీ.. ఆ పేరుతో సుధాకర్ అనే వ్యక్తి ఇంకా నకిలీ అపాయింట్‌మెంట్లు జారీ చేస్తూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment