సాక్షి, అమరావతి : టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ–2018లో పోస్టుల కేటాయింపు రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను పూర్తిగా దెబ్బతీసింది. నోటిఫికేషన్ అనంతరం జిల్లాల వారీగా టీచర్ పోస్టుల రోస్టర్ పాయింట్ల జాబితా వారిని ఒక్కసారిగా నిరాశ, నిస్పృహల్లోకి నెట్టేసింది. టీచర్ పోస్టుల కోసం నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు భర్తీ చేయబోయే పోస్టులు, రోస్టర్ వారీగా కేటాయింపులు చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను పూర్తిగా దగా చేసిందని మండిపడుతున్నారు. ఖాళీ పోస్టులు వేలాదిగా ఉన్నా అరకొర మాత్రమే భర్తీకి నిర్ణయించి తమను తీవ్రంగా నష్ట పరిచిందంటున్నారు. 23 వేల నుంచి 30 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అటు విద్యా శాఖ, ఇటు సర్వశిక్ష అభియాన్ నివేదికలు చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం కేవలం 7,729 పోస్టులు మాత్రమే భర్తీ చేసేలా డీఎస్సీని కుదించింది.
సీఎం జిల్లా చిత్తూరులో ఎస్జీటీ పోస్టులు రెండే
ప్రభుత్వం గత నెల 26వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో పాఠశాల విద్యా శాఖలో 4,341 (4,334 ప్లస్ స్పెషల్ పోస్టులు 7), మున్సిపల్‌లో 1,100, గిరిజన గురుకులాల్లో 500, ఆశ్రమ స్కూళ్లలో 300, మోడల్ స్కూళ్లలో 909, రెసిడెన్షియల్ స్కూళ్లలో 175, బీసీ గురుకులాల్లో 404 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు జిల్లాల వారీ రోస్టర్ పాయింట్లతో జాబితాను గత నెలాఖరున ప్రకటించింది. పలు సబ్జెక్టుల పోస్టులు కొన్ని జిల్లాలకు అసలు కేటాయించకపోగా, మరికొన్నిటికి నామమాత్రంగానే ఉన్నాయి. ఉదాహరణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సొంత జిల్లా చిత్తూరులో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని స్కూళ్లకు ప్రభుత్వం ఇచ్చిన ఎస్జీటీ పోస్టులు కేవలం రెండు మాత్రమే. ఆ రెండింటిలో ఒకటి అంధ, బధిర దివ్యాంగ కోటాకు సంబంధించినది. అలాగే వేలాది మంది శిక్షణ తీసుకుని ఎదురు చూస్తున్న గుంటూరులో 19, నెల్లూరులో 16, కడపలో 36, కృష్ణాలో 43, విజయనగరంలో 58 మాత్రమే ఇచ్చారు.
అన్ని జిల్లాల్లోనూ ఎస్జీటీ పోస్టులకు దాదాపు 5 లక్షల మంది పోటీపడుతున్నారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల కోసం దాదాపు 20 వేల మందికి పైగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. కొన్ని నెలలుగా డీఎస్సీ కోసం శిక్షణ తీసుకుంటున్న జిల్లాల్లోని వేలాది మంది అభ్యర్థులు ఈ రోస్టర్ జాబితాను చూసి ఒక్కసారిగా షాక్‌తిన్నారు. మున్సిపల్ సహా ఇతర విభాగాల స్కూళ్లలోని పోస్టుల్లో కూడా ఇదే పరిస్థితి. ఈసారి ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులతో పాటు బీఈడీ వారు కూడా అర్హులేనని పేర్కొనడంతో ఒక్కో జిల్లాలో ఈ పోస్టుల కోసం లక్షలాదిగా పోటీ పడుతున్నారు. స్కూల్ అసిస్టెంటు, భాషా పండితులు, పీఈటీ, మ్యూజిక్ పోస్టులకూ పోటీపడుతున్న వారు వేలాదిగా ఉండగా పోస్టులు మాత్రం అరకొరే. అవి రోస్టర్ జాబితాలో ప్రత్యేక కేటగిరీల్లో ఉండడం, ఆయా కేటగిరీలకు చెందిన వారు అందుబాటులో లేని తరుణంలో అవన్నీ మిగిలిపోతాయే తప్ప తమకు ప్రయోజనం ఉండదని ఇతర కేటగిరీల వారు వాపోతున్నారు. మున్సిపల్, వివిధ సంక్షేమ శాఖలు, మోడల్ స్కూళ్ల పోస్టుల రోస్టర్ పాయింట్ల జాబితా కూడా నిరాశకు గురి చేసింది.
మంత్రి గంటా ప్రకటనలతో మోసపోయిన అభ్యర్థులు
డీఎస్సీని 2014లో ప్రకటించారు. ఆ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు పలుమార్లు ప్రకటించారు. గత రెండేళ్లలో అయితే ఏకంగా షెడ్యూళ్లు కూడా ప్రకటించి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒకసారి 22 వేల పోస్టులని, మరోసారి 14,300 అని, మరోసారి 10,351 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి ప్రకటన చేసిన ప్రతిసారీ అభ్యర్థులు ప్రిపరేషన్ కోసం కోచింగ్ సెంటర్లకు పరుగులు తీశారు. ఒకొక్కరు కోచింగ్ ఫీజు, అక్కడ హాస్టల్, ఇతర ఖర్చుల కోసం మొత్తంగా లక్షల్లో వెచ్చించాల్సి వచ్చింది. ఇలా రెండేళ్లుగా లక్షలాది మంది అవనిగడ్డ, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లోని కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందారు. ప్రభుత్వ టీచర్ పోస్టు వస్తే భవిష్యత్తు సాఫీగా సాగుతుందన్న ఆశతో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటున్న పలువురు వాటిని వదులుకుని అప్పులు చేసి ఆయా కోచింగ్ సెంటర్లలో చేరారు. రెండేళ్లుగా వీరంతా ఒకొక్కరు కనీసం రూ.50 వేలకు తక్కువ కాకుండా చెల్లించిన సొమ్ము రూ.కోట్లలోనే బడా కోచింగ్ సెంటర్లకు చేరింది. వీరికి మేలు జరిగేందుకే మంత్రి పలుమార్లు ప్రకటనలు చేశారని, దీనివెనుక పెద్ద ఎత్తున ముడుపుల బాగోతం ఉందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దరఖాస్తు చేయడం వృథా అనిపిస్తోంది
నేను 2008లో హిందీ పండిట్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఇప్పటి వరకు అవకాశం రాలేదు. 2014లో కూడా పోస్టులు చాలా స్వల్పం. ఈసారి జెడ్పీ, ఎంపీపీల్లో పోస్టులు లేనేలేవు. మున్సిపాల్టీలో ఒకే ఒక్క పోస్టు వేశారు. ఒక్క పోస్టుకు 5 వేలకుపైగా అభ్యర్థులు పోటీ పడాల్సిన పరిస్థితి. దరఖాస్తు చేయడం కూడా వృధా అనిపిస్తోంది.
– మహలక్ష్మి, విజయనగరం
పోస్టే లేదు.. ఏం చేయాలి?
ఎనిమిదేళ్లుగా స్కూల్ అసిస్టెంటు పోస్టు (బీఈడీ సోషల్) కోసం ఎదురు చూస్తున్నాను. ఒకసారి డీఎస్సీ వేసినా మా పోస్టులు వేయలేదు. ఈ డీఎస్సీలోనైనా అవకాశం వస్తుందనుకుంటే మా కేటగిరీలో ఒక్క పోస్టూ ఇవ్వలేదు. మూడు సార్లు టెట్ రాశాను. ఏం లాభం?
– శాంతి శ్రీ, శ్రీకాకుళం
ఒకే ఒక్క పోస్టు.. ఏం చేసేది?
నేను 2014 డీఎస్సీలో 0.1 మార్కు తేడాతో స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) పోస్టు అవకాశం కోల్పోయాను. డీఎస్సీ అని ప్రకటిస్తుండటంతో రెండేళ్లుగా అదే పనిగా కోచింగ్ తీసుకున్నాను. ఈసారి మాకు ఒకే ఒక్క పోస్టు ఇచ్చారు. అభ్యర్థులు వేలల్లో ఉన్నారు. ఖాళీ పోస్టులున్నా చూపించడం లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.
– శిరీష, రాజాం
ఫీజు కట్టినా దరఖాస్తుకు అవకాశం లేదు
మూడేళ్లుగా టీచర్ పోస్టు కోసం ఎదురు చూస్తున్నా డీఎస్సీని ప్రకటించలేదు. బీటెక్ పూర్తిచేసి ఆపై బీఈడీ చేశా. ఇప్పుడు ఎస్‌ఏ మేథ్స్ పోస్టుకు దరఖాస్తుకు ఆన్‌లైన్లో ఫీజు కడితే స్వీకరించారు. తీరా ఆన్‌లైన్ దరఖాస్తు చేస్తే బీఏ, బీఎస్సీ ఆప్షన్లు మాత్రమే చూపిస్తున్నారు తప్ప బీటెక్ వారికి అవకాశం ఇవ్వడం లేదు. ఫీజు కట్టించుకొని దరఖాస్తుకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయం. నాలుగేళ్లు బీఈడీ చేసి, టెట్‌లు రాసి లక్షలు ఖర్చు చేస్తే దరఖాస్తుకు అవకాశం లేకుండా చేశారు.
– యమున, తిరుపతి, – రవీంద్ర, కడప
మెగా డీఎస్సీ ప్రకటించాలి
టెట్‌లో నాకు 143 మార్కులు వచ్చాయి. 23 వేల పోస్టులు ఖాళీలున్నాయని, కనీసం 12 వేలు భర్తీచేస్తారని పోస్టు గ్యారంటీ అనుకున్నాను. ఇప్పుడు ఎస్జీటీ పోస్టులు కుదించారు. బీఈడీ చేసిన వారికి కూడా అవకాశం ఇవ్వడంతో పోటీ ఎక్కువైంది. బీఈడీ వారికి అవకాశం ఇచ్చినందున మెగా డీఎస్సీ వేస్తే మాకు న్యాయం జరుగుతుంది.
– తాళాడ సుకన్య, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment