6,000 పోస్టులతో మరో డీఎస్సీ: భట్టి విక్రమార్క | Bhatti Vikramarka says Another DSC with 6000 posts | Sakshi
Sakshi News home page

6,000 పోస్టులతో మరో డీఎస్సీ: భట్టి విక్రమార్క

Published Fri, Sep 6 2024 5:09 AM | Last Updated on Fri, Sep 6 2024 5:10 AM

Bhatti Vikramarka says Another DSC with 6000 posts

పది రోజుల్లో డీఎస్సీ ఫలితాలు 

ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్‌ 

గురుపూజోత్సవ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 

150 మంది టీచర్లకు పురస్కారం

సాక్షి, హైదరాబాద్‌: మరో ఆరు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ వేయబోతున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 17,862 ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ను అందించేందుకు జీవో జారీ చేసినట్టు వెల్లడించారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని గురువారం రవీంద్రభారతిలో గురుపూజ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భట్టి మాట్లాడుతూ, ప్రగతిశీల సమాజ నిర్మాణంలో టీచర్లది కీలకపాత్ర అని కొనియాడారు. 2007లో ఆంగ్ల మాధ్యమ బోధనపై విమర్శలు వచ్చినా, టీచర్లు సహకరించారని భట్టి గుర్తు చేశారు. ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. విద్యారంగానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. 11,062 టీచర్‌ పోస్టుల భర్తీ కోసం ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలను మరో పదిరోజుల్లో వెల్లడించనున్నట్టు తెలిపారు. 

రూ.667 కోట్లతో ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, వాటి నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించామణి చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించడానికి నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని, 63 ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని భట్టి తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.300 కోట్లు వెచ్చించామని, ఉస్మానియా వర్సిటీకి రూ.వంద కోట్లు కేటాయించామని వివరించారు. విద్యారంగంలో సమూల మార్పుకే విద్యా కమిషన్‌ ఏర్పాటు చేశామన్నారు.  
ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు పూర్తి రీయింబర్స్‌మెంట్‌.. 
ప్రభుత్వ స్కూళ్లలో చదివిన విద్యార్థులకు విదేశీ విద్య, ఉన్నత విద్యకు సంబంధించి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, టీచర్లు కూడా స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు కృషిచేయాలని సూచించారు. అలాగే విద్యారంగంలో తీసుకు వస్తున్న సంస్కరణలకు సహకారం అందించాలని కోరారు. 

ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ, అణగారిన వర్గాల కొత్తతరం ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లకు వస్తోందని, వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత టీచర్లపై ఉందని అన్నారు. మారుతున్న కాలంతో పాటు ఉపాధ్యాయులూ ఆప్‌గ్రేడ్‌ కావాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి సూచించారు. 

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్య కమిషనర్‌ దేవసేన, పాఠశాల విద్య డైరెక్టర్‌ నర్సింహారెడ్డి, ఇంటర్‌బోర్డ్‌ కార్యదర్శి శృతి ఓజా, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎస్‌కే మహమూద్, ప్రొఫెసర్‌ వెంకటరమణ, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఎమ్మెల్సీలు కూర రఘోత్తమ్‌రెడ్డి, ఎ.నర్సిరెడ్డి, ఎ.వెంకటనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందించిన 150 మంది అధ్యాపకులను మంత్రి పొన్నం ప్రభాకర్‌ సత్కరించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement