Teacher Posts Replacement
-
6,000 పోస్టులతో మరో డీఎస్సీ: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: మరో ఆరు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ వేయబోతున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 17,862 ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ను అందించేందుకు జీవో జారీ చేసినట్టు వెల్లడించారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని గురువారం రవీంద్రభారతిలో గురుపూజ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భట్టి మాట్లాడుతూ, ప్రగతిశీల సమాజ నిర్మాణంలో టీచర్లది కీలకపాత్ర అని కొనియాడారు. 2007లో ఆంగ్ల మాధ్యమ బోధనపై విమర్శలు వచ్చినా, టీచర్లు సహకరించారని భట్టి గుర్తు చేశారు. ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. విద్యారంగానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలను మరో పదిరోజుల్లో వెల్లడించనున్నట్టు తెలిపారు. రూ.667 కోట్లతో ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, వాటి నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించామణి చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించడానికి నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని, 63 ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని భట్టి తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.300 కోట్లు వెచ్చించామని, ఉస్మానియా వర్సిటీకి రూ.వంద కోట్లు కేటాయించామని వివరించారు. విద్యారంగంలో సమూల మార్పుకే విద్యా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు పూర్తి రీయింబర్స్మెంట్.. ప్రభుత్వ స్కూళ్లలో చదివిన విద్యార్థులకు విదేశీ విద్య, ఉన్నత విద్యకు సంబంధించి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, టీచర్లు కూడా స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు కృషిచేయాలని సూచించారు. అలాగే విద్యారంగంలో తీసుకు వస్తున్న సంస్కరణలకు సహకారం అందించాలని కోరారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, అణగారిన వర్గాల కొత్తతరం ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లకు వస్తోందని, వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత టీచర్లపై ఉందని అన్నారు. మారుతున్న కాలంతో పాటు ఉపాధ్యాయులూ ఆప్‌గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, పాఠశాల విద్య డైరెక్టర్ నర్సింహారెడ్డి, ఇంటర్‌బోర్డ్ కార్యదర్శి శృతి ఓజా, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఎమ్మెల్సీలు కూర రఘోత్తమ్‌రెడ్డి, ఎ.నర్సిరెడ్డి, ఎ.వెంకటనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందించిన 150 మంది అధ్యాపకులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు. -
ఒక్కో పోస్టుకు 61 మంది..
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రకటన నిరుద్యోగుల్లో ఆశలు రేపింది. ప్రభుత్వ టీచర్ పోస్టు దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మొత్తం 6612 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల మంది ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పాసయిన వాళ్ళున్నారు. డీఎస్సీలో టెట్ అర్హులకు వెయిటేజ్ ఉంటుంది. ఇక కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. మొత్తంగా భర్తీ చేసే 6,612 పోస్టులకు దాదాపు 4 లక్షలకుపైగా పోటీ పడే పరిస్థితి కన్పిస్తోంది. ఈ లెక్కన ఒక్కో పోస్టుకూ 61 మంది పోటీ పడే వీలుందని అంచనా వేస్తున్నారు. మళ్లీ కోచింగ్ హడావుడి.. డీఎస్సీ పరీక్షకు సంబంధించి విధివిధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పోటీ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రశ్నావళి రూపకల్పనలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిలబస్ ఏ విధంగా ఉండాలి? ఏ స్థాయిలో పరీక్ష విధానం ఉండాలనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఈ వ్యవహారం ఇలా ఉంటే... ఇప్పటికే పుట్టగొడుగుల్లా కోచింగ్ కేంద్రాలు వెలుస్తున్నాయి. డీఎస్సీకి ప్రిపేరయ్యే అభ్యర్థులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు తక్కువ సమయంలో డీఎస్సీ పరీక్షకు శిక్షణ ఇవ్వగల అధ్యాపకులను అన్వేషిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో డీఎస్సీ పరీక్ష కోసమే ప్రత్యేక శిక్షణ కేంద్రాలు, వాటికి అనుబంధంగా హాస్టళ్ళూ వెలుస్తున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమం ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. స్వల్పకాలిక శిక్షణ కోసం రూ.25వేల నుంచి 1.50 లక్షల వరకూ ఫీజులు వసూలు చేస్తున్నాయి. కేవలం డీఎస్సీ కోసమే నిర్వహించే హాస్టళ్ళు కూడా నెలకు రూ.15వేల నుంచి రూ.30 వేల వరకూ తీసుకుంటున్నాయి. టీచర్ పోస్టుల భర్తీ ప్రకటన తర్వాత హైదరాబాద్‌లోనే కొత్తగా 178 కోచింగ్ కేంద్రాలు వెలిశాయని టీచర్ పరీక్షల తర్ఫీదు ఇచ్చే అధ్యాపకుడు కృపాకర్ తెలిపారు. నెల రోజుల బోధనకు రూ.2 లక్షల వరకూ టీచర్లకు ఇచ్చేందుకు కోచింగ్ కేంద్రాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. పెద్ద ఎత్తున స్టడీ మెటీరియల్స్ నియామక పరీక్ష విధానం రూపురేఖలు తెలియకపోయినా స్టడీ మెటీరియల్ మాత్రం సిద్ధమవుతున్నాయి. గతంలో జరిగిన పరీక్షలను కొలమానంగా తీసుకుని స్టడీ మెటీరియల్ రూపొందిస్తున్నారు. ప్రచురణా సంస్థలు ఏకంగా అధ్యాపకులను నియమించుకుని మెటీరియల్స్ రూపొందిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన వివిధ పరీక్షలు, బోధన విధానాలు, సైకాలజీతో పాటు సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్స్ రూపొందిస్తున్నారు. విద్యార్థుల డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మెటీరియల్ ధరలు కూడా ఈసారి ఎక్కువగానే ఉండే వీలుందని నిపుణులు చెబుతున్నారు. 2017లో ఇదే తరహాలో స్టడీ మెటీరియల్స్ వచ్చినా, చాలా వరకూ నాణ్యత లోపం కన్పించిందని సైన్స్ అధ్యాపకుడు నవీన్ చంద్ర తెలిపారు. సీబీఎస్ఈ పుస్తకాలను 1–10 వరకూ క్షుణ్ణంగా చదివితే మంచి మార్కులు సాధించే వీలుందని, అనవరసంగా స్టడీ మెటీరియల్స్‌పై నమ్మకం పెట్టుకోవద్దని సూచించారు. ప్రైవేటు స్కూళ్ళల్లో టీచర్ల కొరత ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించాలని యువత లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రైవేటు స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్లు ప్రత్యేక శిక్షణపై దృష్టి పెట్టారు. దీంతో స్కూళ్ళకు దీర్ఘకాలిక సెలవులు పెడుతున్నారు. ఇది తమకు మంచి అవకాశమని, సెలవు ఇవ్వకపోతే రాజీనామాకు సిద్ధమని యాజమాన్యాలకు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ప్రైవేటు టీచర్లకు వేతనాలు కూడా అరకొరగా ఉంటున్నాయి. ఈ కారణంగా ఉన్నపళంగా ప్రైవేటు టీచర్లు వెళ్ళిపోతున్నారు. దీంతో ప్రైవేటు స్కూళ్ళల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతోంది. ఇక హైదరాబాద్ సహా ఇతర ముఖ్యమైన పట్టణ ప్రాంతాల్లో ఉన్న కార్పొరేట్ స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్లకు యాజమాన్యాలు కొన్ని క్లాసులు తగ్గించి, పరీక్షకు సన్నద్ధమయ్యే అవకాశం కల్పిస్తున్నాయి. -
AP: ఆగస్టులో ‘టెట్’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ టీచర్ పోస్టుల భర్తీకి కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ 2022) ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. పేపర్లవారీగా పరీక్షల తేదీలు, ఇతర సమాచారంతో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. టెట్ రాసేందుకు అభ్యర్ధులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాల్సినా గత సర్కారు పట్టించుకోలేదు. అధికారంలో ఉండగా టెట్, డీఎస్సీ కలిపి టీచర్ ఎలిజిబులిటీ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టెట్ కమ్ టెర్ట్) పేరుతో నిర్వహించినా క్వాలిఫైడ్ అభ్యర్థుల ధ్రువపత్రాలను ఏడేళ్లుగా కాకుండా ఆ పరీక్ష వరకు మాత్రమే పరిమితం చేసింది. ఇలా రెండు పరీక్షలు కలిపి నిర్వహించడంతో అభ్యర్ధులు నష్టపోయారు. 2018లో టెట్ నిర్వహించాల్సి ఉన్నా ఎన్నికలు రావడంతో నిలిచిపోయింది. డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ దీర్ఘకాలంగా టెట్ నిర్వహించకపోవడంతో లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. టెట్ మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో వెయిటేజీ కల్పించడంతోపాటు బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులను ఎస్ఏ పోస్టులకు కూడా అర్హులుగా ప్రకటించడంతో గతంలో క్వాలిఫై అయిన వారు సైతం మరోసారి రాసేందుకు సిద్ధమవుతున్నారు. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం మేర వెయిటేజీ ఉన్నందున వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండగా గతేడాది ఎన్సీటీఈ దీన్ని సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది. వెబ్సైట్లో ప్యాట్రన్, సిలబస్ టెట్ 2021 విధివిధానాలు, సిలబస్‌ను పాఠశాల విద్యాశాఖ గతంలో విడుదల చేసింది. సిలబస్‌ను https://aptet.apcfss.in వెబ్సైట్లో పొందుపరిచింది. టెట్‌లో రెండు పేపర్లు (పేపర్ 1, పేపర్ 2) ఉంటాయి. వీటిని 1 ఏ, 1 బీ, 2 ఏ, 2 బీ అని నిర్వహిస్తారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎన్సీటీఈ మార్పులు చేయడంతో ప్రభుత్వం ఆ మేరకు సవరణలు చేసింది. గతంలో టెట్‌కు సంబంధించి జారీ చేసిన జీవో 23కు సవరణలు చేస్తూ జీవో 27 విడుదల చేసింది. దీని ప్రకారం అభ్యర్ధులకు మేలు చేకూరేలా టెట్ నోటిఫికేషన్లో పొందుపర్చనున్నారు. ఎవరెవరు ఏ పరీక్ష రాయాలంటే.. ► రెగ్యులర్ స్కూళ్లలో 1 – 5 తరగతుల్లో టీచర్ పోస్టులకు పేపర్ 1ఏలో అర్హత సాధించాలి. ► దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్ స్కూళ్లలో 1 – 5 తరగతులు బోధించాలంటే పేపర్ 1బీలో అర్హత తప్పనిసరి. ► రెగ్యులర్ స్కూళ్లలో 6 – 8, ఆ పై తరగతులు బోధించాలంటే పేపర్ 2ఏలో అర్హత సాధించాలి. అలాగే స్పెషల్ స్కూళ్లలో ఇవే తరగతులకు పేపర్ 2బీలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ► టెట్‌లో అర్హత మార్కులు గతంలో మాదిరిగానే ఉండనున్నాయి. జనరల్ అభ్యర్ధులకు 60 శాతం, బీసీ అభ్యర్ధులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. టెట్ తరువాత డీఎస్సీపై దృష్టి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం టెట్ నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. అయితే వెను వెంటనే కరోనా రావడంతో రెండేళ్లుగా టెట్ నిర్వహణ సాధ్యం కాలేదు. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తొలుత టెట్ నిర్వహించి అనంతరం టీచర్ పోస్టుల భర్తీపై దృష్టి సారించేందుకు సన్నద్ధమవుతోంది. -
విద్యార్థులుంటేనే భర్తీ.. పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులున్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులనే భర్తీ చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల్లేని పాఠశాలల్లో ఖాళీగా ఉన్నవాటిని భర్తీ చేయకూడదని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలిసింది. వీటిని ప్రభుత్వం అంగీకరిస్తే, ప్రస్తుతమున్న ఖాళీల్లో సుమారు 2 వేల టీచర్ పోస్టులు భర్తీకి నోచుకునే అవకాశాల్లేవు. విద్యార్థుల్లేని పాఠశాలల్లోని ఖాళీల భర్తీ ద్వారా ప్రయోజనం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థుల్లేని పాఠశాలల్లోని ఖాళీ పోస్టులను, విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలల్లోని ఖాళీ పోస్టులను వేర్వేరుగా గుర్తించి ప్రతిపాదనలను పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనికనుగుణంగా పాఠశాల వి ద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. దీని ప్రకారం విద్యార్థుల్లేని పాఠశాల ల్లో 2వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నీ ఎక్కువగా ప్రైమరీ స్థాయి లోనే ఉన్నట్టు తేలింది. ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గురువారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో 12 వేల ఉ పాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు నిర్ధా రణకు వచ్చారు. సాధారణంగా ఒక్కో టీచరుకు ప్రాథమిక పాఠశాల స్థాయిలో 20 మం ది, హైస్కూలు స్థాయిలో 50 మంది విద్యార్థులుండాలి. అలా లేకుంటే వాటిని మూసేసి సమీప స్కూళ్లకు అనుసంధానిస్తారు. అలాగే జీరో అడ్మిషన్ల స్కూళ్ల సంఖ్యా పెరుగుతోంది. బదిలీలపై కసరత్తు రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, హేతుబద్ధీకరణపై పాఠశాల విద్యాశాఖ దృష్టిసారించింది. రెండు ప్రక్రియలు ఒకేసారి నిర్వహించనున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక హేతుబద్ధీకరణ జరగలేదు. కాబట్టి తొలిసారిగా ప్రభుత్వం దీనిపై దృష్టిసారించింది. హేతుబద్ధీకరణలో భాగంగా విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్ పోస్టులను అటుఇటు మార్చనున్నారు. దీనిద్వారా ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలకు ఎక్కువ మంది టీచర్లను పంపించడానికి, తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలల్లో టీచర్ల సంఖ్యను కుదించడానికీ వీలుంటుంది. -
టీచర్ పోస్టుల భర్తీ షురూ
సాక్షి, అమరావతి: టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ – 2018 నియామకాల ప్రక్రియ గురువారం రాత్రి నుంచి ప్రారంభమైంది. తొలుత మోడల్ స్కూళ్లు, ఏపీ బీసీ వెల్ఫేర్ స్కూళ్లలో ప్రిన్సిపాల్ పోస్టుల ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితాను పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్లో విడుదల చేసింది. సెలెక్షన్ కమిటీ పరిశీలించి ఖరారు చేసిన అనంతరం జాబితాను శుక్రవారం ప్రకటించారు. అభ్యర్థులు దీన్ని అనుసరించి శని, ఆదివారాల్లో ధ్రువపత్రాలను నిర్దేశిత వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేయాలి. ఐదు కేటగిరీల పోస్టులకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 4తో ముగియనున్న షెడ్యూల్.. రాష్ట్రంలో 7,902 పోస్టుల భర్తీకి డీఎస్సీ – 2018 నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితాలను ఇంతకు ముందే ఖరారుచేసినా ఎన్నికల కోడ్, కోర్టు కేసుల వల్ల జిల్లాలవారీగా సెలెక్షన్ జాబితాల విడుదలలో జాప్యం జరిగింది. ఎన్నికల కోడ్ ముగిసి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఇటీవల పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేయడం తెలిసిందే. తొలిసారిగా పోస్టుల భర్తీ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పోస్టులు మిగిలిపోకుండా ఉండేందుకు విభాగాల వారీగా వేర్వేరుగా షెడ్యూళ్లను ప్రకటించారు. అదే సమయంలో ఆయా విభాగాల్లో మూడు నాలుగుసార్లు ప్రొవిజనల్ సెలెక్షన్ జాబితా విడుదల చేసేలా చర్యలు చేపట్టారు. ఈనెల 20వ తేదీ రాత్రి నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ ఐదు కేటగిరీల పోస్టుల భర్తీకి వీలుగా ఐదు షెడ్యూళ్లలో కొనసాగుతుంది. సెప్టెంబర్ 4వ తేదీతో ముగిసేలా పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ను ప్రకటించింది. పోస్టులు మిగలకుండా చర్యలు గతానికి భిన్నంగా పాఠశాల విద్యాశాఖ ఈసారి భర్తీ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ప్రొవిజనల్ సెలెక్షన్ జాబితాల విడుదల, కన్ఫర్మేషన్, సర్టిఫికెట్ల అప్లోడ్, పరిశీలన, అనంతరం ప్రొవిజనల్ సెలెక్షన్ జాబితాల విడుదల ఇలా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. చివరిగా తుది సెలెక్షన్ జాబితా ప్రకటించి అభ్యర్ధులకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. అనంతరం పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తారు. ప్రొవిజనల్ ఎంపిక జాబితాలను మూడు దఫాలుగా ఇవ్వడం వల్ల ఎవరైనా అనర్హతతో వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చినా ఆ పోస్టు మిగలకుండా తదుపరి మెరిట్ అభ్యర్థికి అవకాశమిచ్చేలా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాగే ఒకే అభ్యర్థి పలు కేటగిరీల్లోని పోస్టులకు ఎంపికైనా ఏ పోస్టులో చేరేందుకు ప్రాధాన్యమిస్తున్నారో ముందుగానే ఆప్షన్ ఇచ్చే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అన్ని ప్రొవిజనల్ జాబితాలు వెలువడిన అనంతరం వారికి ఆప్షన్‌కు అవకాశం కల్పిస్తామని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల అలాంటి అభ్యర్ధులు ఏదో ఒక పోస్టుకు ఆప్షన్ ఇస్తే మిగతా పోస్టులకు మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థిని ఎంపిక చేస్తామని వివరించారు. తద్వారా ఏ కేటగిరీలోనూ పోస్టులు మిగలకుండా అర్హులైన అభ్యర్ధుల ద్వారా అన్ని పోస్టులు భర్తీ చేస్తామని పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరు వివరించారు. ప్రిన్సిపాల్ పోస్టులకు ఈ ధ్రువపత్రాలు తెచ్చుకోవాలి... ప్రిన్సిపాల్ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్ధులు పరిశీలన కోసం వచ్చే సమయంలో నిర్ణీత సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటిమేషన్ లెటర్, అప్లికేషన్ ఫారం, హాల్‌టిక్కెట్, అర్హత ధ్రువపత్రాలు, ఎస్సెస్సీ సర్టిఫికెట్, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ తత్సమాన ధ్రువపత్రాలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ పత్రాలు, బీఈడీ, ఎంఈడీ తత్సమాన సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రాలు (ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులకు), మాజీ సైనికోద్యోగుల సర్టిఫికెట్లు, దివ్యాంగ అభ్యర్థులు సంబంధిత మెడికల్ బోర్డు ధ్రువీకరణ పత్రాలు వెంట తెచ్చుకోవాలి. ఒరిజినల్ పత్రాలతో పాటు మూడు సెట్ల నకలు ధ్రువపత్రాల కాపీలను కూడా తీసుకురావాలని పేర్కొన్నారు. ధ్రువపత్రాల పరిశీలన శని, ఆదివారాల్లో ఉంటుందన్నారు. ఈ రెండు రోజుల్లో అభ్యర్ధులు ‘సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్సైట్లో ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని సూచించారు. అనంతరం అభ్యర్ధులు ఈనెల 24వ తేదీన 9 గంటల నుంచి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలోని మోడల్ స్కూల్ విభాగంంలో నిర్వహించే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించారు. ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితాలో ఉన్న అభ్యర్ధులంతా హాజరు కావాలన్నారు. మోడల్ స్కూళ్లు, బీసీ వెల్ఫేర్ స్కూళ్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులు ఏదో ఒక మేనేజ్మెంట్ స్కూల్‌కు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందని కమిషనర్ వివరించారు. -
టీఆర్టీ తుది ఫలితాలను ప్రకటించాలి
హైదరాబాద్: టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి 18 నెలలు గడిచినా ఇప్పటి వరకు తుది ఫలితాలు ప్రకటించకుండా నిరుద్యోగుల జీవితాలతో టీఎస్పీఎస్సీ చెలగాటం ఆడుతోందని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. వెంటనే తుది ఫలితాలు ప్రకటించాలని, లేదంటే వేలాది మంది నిరుద్యోగులతో టీఎస్పీఎస్సీ భవంతిని ముట్టడిస్తామని హెచ్చరించారు. టీఆర్టీ నోటిఫికేషన్ భర్తీలో జరుగుతోన్న జాప్యాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం, టీఆర్టీ నిరుద్యోగుల ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ 8,792 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా 4 నెలల్లో పూర్తి కావాల్సిన రిక్రూట్మెంట్ ప్రక్రియ 18 నెలలు గడుస్తున్నా పూర్తి కావడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 45 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా.. కేవలం 8,792 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు. వీటికి కూడా పోస్టింగ్ ఇవ్వకుండా కోర్టు కేసుల సాకుతో ఫైనల్ లిస్టు పెట్టకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఫైనల్ సెలక్షన్ జాబితాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ నాయకులు గుజ కృష్ణ, నీల వెంకటేశ్, దాసు సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అధ్యాపకుల భర్తీకి అన్నీ ఆటంకాలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి అవాంతరాలు తప్పడం లేదు. ఒక్కోసారి ఒక్కో సమస్యతో ఏడాది కాలంగా పోస్టుల భర్తీ ఆగిపోతూనే ఉంది. రోస్టర్ కమ్ రిజర్వేషన్ విషయంలో న్యాయ వివాదం కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నా.. రాష్ట్రంలో వరుస ఎన్నికలతో కోడ్ కారణంగా అవి భర్తీకి నోచుకునే పరిస్థితి కనిపించటం లేదు. మొత్తంగా ఎన్నికలు పూర్తయ్యే సరికి మరో ఆరేడు నెలల సమయం పట్టనుంది. ఆ తర్వాత నియామకాలు జరుగుతాయా.. అంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న వైస్ చాన్స్లర్ల పదవీకాలం జూన్, జూలై నెలల్లో ముగిసిపోనుంది. దీంతో ప్రభుత్వం కొత్త వైస్ ఛాన్స్లర్లను నియమించి వారు ఆ నియామకాల నిబంధనలను అధ్యయనం చేసి నోటిఫికేషన్ జారీ చేసే నాటికి మరింత సమయం పట్టనుంది. పోస్టుల భర్తీకి గతేడాదే అనుమతి.. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో మొత్తంగా 1,551 పోస్టులు ఖాళీగా ఉండగా, మొదటి దశలో 1,061 పోస్టుల భర్తీకి గతేడాదే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అప్పట్లో నియామక నిబంధనల విషయంలో ఉన్నత విద్యాశాఖ తాత్సారం చేయగా, ఆ తర్వాత యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు కొన్నాళ్లు వాటిపై దృష్టి పెట్టలేదు. అనంతరం నియామకాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త నిబంధనలను జారీ చేసిందని, వాటిని అమలు చేయాలా.. వద్దా.. అంటూ ఆలస్యం చేశారు. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం నియామకాలకు వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. అదే సమయంలో రోస్టర్ కమ్ రిజర్వేషన్ విషయంలో అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. విభాగాల వారీగా రోస్టర్ కమ్ రిజర్వేషన్లను అమలు చేయాలని పేర్కొంది. అయితే ఆ ఉత్తర్వులు కేవలం సెంట్రల్ యూనివర్సిటీలకే వర్తిస్తాయా.. రాష్ట్రాల యూనివర్సిటీలకు వర్తిస్తాయా.. వాటిని అమలు చేయాలా.. వద్దా.. అన్న గందరగోళం నెలకొంది. ప్రత్యేక చట్టంపై కేంద్రం దృష్టి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కూడా మొదట్లో నియామకాలపై కొంత అయోమయంలో పడినా యూనివర్సిటీల వారీగా అమలు కోసం ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంది. అయితే ఆ తీర్పు వచ్చేందుకు సమయం పట్టనున్న నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక చట్టం తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఒకవేళ ఆ ప్రత్యేక చట్టం తెచ్చి నియామక నిబంధనలు జారీ చేసినా, రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో నియామకాలు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలు పూర్తయ్యాక నోటిఫికేషన్లు జారీ చేసే వెసులుబాటున్నా ప్రస్తుతం యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు రిటైర్మెంట్ సమయంలో నోటిఫికేషన్లను జారీ చేయకపోవచ్చన్న వాదనలు వ్యక్తమవుతోన్నాయి. ఆ తర్వాత కొత్త వైస్ చాన్స్లర్లు వచ్చి నియామకాల ప్రక్రియను చేపట్టేందుకే కనీసంగా నాలుగైదు నెలల సమయం పడుతుందని, అప్పటివరకు నియామకాలుండే పరిస్థితి కనిపించడం లేదని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
నిండా ముంచిన డీఎస్సీ రోస్టర్
సాక్షి, అమరావతి : టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ–2018లో పోస్టుల కేటాయింపు రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను పూర్తిగా దెబ్బతీసింది. నోటిఫికేషన్ అనంతరం జిల్లాల వారీగా టీచర్ పోస్టుల రోస్టర్ పాయింట్ల జాబితా వారిని ఒక్కసారిగా నిరాశ, నిస్పృహల్లోకి నెట్టేసింది. టీచర్ పోస్టుల కోసం నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు భర్తీ చేయబోయే పోస్టులు, రోస్టర్ వారీగా కేటాయింపులు చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను పూర్తిగా దగా చేసిందని మండిపడుతున్నారు. ఖాళీ పోస్టులు వేలాదిగా ఉన్నా అరకొర మాత్రమే భర్తీకి నిర్ణయించి తమను తీవ్రంగా నష్ట పరిచిందంటున్నారు. 23 వేల నుంచి 30 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అటు విద్యా శాఖ, ఇటు సర్వశిక్ష అభియాన్ నివేదికలు చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం కేవలం 7,729 పోస్టులు మాత్రమే భర్తీ చేసేలా డీఎస్సీని కుదించింది. సీఎం జిల్లా చిత్తూరులో ఎస్జీటీ పోస్టులు రెండే ప్రభుత్వం గత నెల 26వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో పాఠశాల విద్యా శాఖలో 4,341 (4,334 ప్లస్ స్పెషల్ పోస్టులు 7), మున్సిపల్లో 1,100, గిరిజన గురుకులాల్లో 500, ఆశ్రమ స్కూళ్లలో 300, మోడల్ స్కూళ్లలో 909, రెసిడెన్షియల్ స్కూళ్లలో 175, బీసీ గురుకులాల్లో 404 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు జిల్లాల వారీ రోస్టర్ పాయింట్లతో జాబితాను గత నెలాఖరున ప్రకటించింది. పలు సబ్జెక్టుల పోస్టులు కొన్ని జిల్లాలకు అసలు కేటాయించకపోగా, మరికొన్నిటికి నామమాత్రంగానే ఉన్నాయి. ఉదాహరణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సొంత జిల్లా చిత్తూరులో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని స్కూళ్లకు ప్రభుత్వం ఇచ్చిన ఎస్జీటీ పోస్టులు కేవలం రెండు మాత్రమే. ఆ రెండింటిలో ఒకటి అంధ, బధిర దివ్యాంగ కోటాకు సంబంధించినది. అలాగే వేలాది మంది శిక్షణ తీసుకుని ఎదురు చూస్తున్న గుంటూరులో 19, నెల్లూరులో 16, కడపలో 36, కృష్ణాలో 43, విజయనగరంలో 58 మాత్రమే ఇచ్చారు. అన్ని జిల్లాల్లోనూ ఎస్జీటీ పోస్టులకు దాదాపు 5 లక్షల మంది పోటీపడుతున్నారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల కోసం దాదాపు 20 వేల మందికి పైగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. కొన్ని నెలలుగా డీఎస్సీ కోసం శిక్షణ తీసుకుంటున్న జిల్లాల్లోని వేలాది మంది అభ్యర్థులు ఈ రోస్టర్ జాబితాను చూసి ఒక్కసారిగా షాక్‌తిన్నారు. మున్సిపల్ సహా ఇతర విభాగాల స్కూళ్లలోని పోస్టుల్లో కూడా ఇదే పరిస్థితి. ఈసారి ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులతో పాటు బీఈడీ వారు కూడా అర్హులేనని పేర్కొనడంతో ఒక్కో జిల్లాలో ఈ పోస్టుల కోసం లక్షలాదిగా పోటీ పడుతున్నారు. స్కూల్ అసిస్టెంటు, భాషా పండితులు, పీఈటీ, మ్యూజిక్ పోస్టులకూ పోటీపడుతున్న వారు వేలాదిగా ఉండగా పోస్టులు మాత్రం అరకొరే. అవి రోస్టర్ జాబితాలో ప్రత్యేక కేటగిరీల్లో ఉండడం, ఆయా కేటగిరీలకు చెందిన వారు అందుబాటులో లేని తరుణంలో అవన్నీ మిగిలిపోతాయే తప్ప తమకు ప్రయోజనం ఉండదని ఇతర కేటగిరీల వారు వాపోతున్నారు. మున్సిపల్, వివిధ సంక్షేమ శాఖలు, మోడల్ స్కూళ్ల పోస్టుల రోస్టర్ పాయింట్ల జాబితా కూడా నిరాశకు గురి చేసింది. మంత్రి గంటా ప్రకటనలతో మోసపోయిన అభ్యర్థులు డీఎస్సీని 2014లో ప్రకటించారు. ఆ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు పలుమార్లు ప్రకటించారు. గత రెండేళ్లలో అయితే ఏకంగా షెడ్యూళ్లు కూడా ప్రకటించి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒకసారి 22 వేల పోస్టులని, మరోసారి 14,300 అని, మరోసారి 10,351 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి ప్రకటన చేసిన ప్రతిసారీ అభ్యర్థులు ప్రిపరేషన్ కోసం కోచింగ్ సెంటర్లకు పరుగులు తీశారు. ఒకొక్కరు కోచింగ్ ఫీజు, అక్కడ హాస్టల్, ఇతర ఖర్చుల కోసం మొత్తంగా లక్షల్లో వెచ్చించాల్సి వచ్చింది. ఇలా రెండేళ్లుగా లక్షలాది మంది అవనిగడ్డ, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లోని కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందారు. ప్రభుత్వ టీచర్ పోస్టు వస్తే భవిష్యత్తు సాఫీగా సాగుతుందన్న ఆశతో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటున్న పలువురు వాటిని వదులుకుని అప్పులు చేసి ఆయా కోచింగ్ సెంటర్లలో చేరారు. రెండేళ్లుగా వీరంతా ఒకొక్కరు కనీసం రూ.50 వేలకు తక్కువ కాకుండా చెల్లించిన సొమ్ము రూ.కోట్లలోనే బడా కోచింగ్ సెంటర్లకు చేరింది. వీరికి మేలు జరిగేందుకే మంత్రి పలుమార్లు ప్రకటనలు చేశారని, దీనివెనుక పెద్ద ఎత్తున ముడుపుల బాగోతం ఉందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు చేయడం వృథా అనిపిస్తోంది నేను 2008లో హిందీ పండిట్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఇప్పటి వరకు అవకాశం రాలేదు. 2014లో కూడా పోస్టులు చాలా స్వల్పం. ఈసారి జెడ్పీ, ఎంపీపీల్లో పోస్టులు లేనేలేవు. మున్సిపాల్టీలో ఒకే ఒక్క పోస్టు వేశారు. ఒక్క పోస్టుకు 5 వేలకుపైగా అభ్యర్థులు పోటీ పడాల్సిన పరిస్థితి. దరఖాస్తు చేయడం కూడా వృధా అనిపిస్తోంది. – మహలక్ష్మి, విజయనగరం పోస్టే లేదు.. ఏం చేయాలి? ఎనిమిదేళ్లుగా స్కూల్ అసిస్టెంటు పోస్టు (బీఈడీ సోషల్) కోసం ఎదురు చూస్తున్నాను. ఒకసారి డీఎస్సీ వేసినా మా పోస్టులు వేయలేదు. ఈ డీఎస్సీలోనైనా అవకాశం వస్తుందనుకుంటే మా కేటగిరీలో ఒక్క పోస్టూ ఇవ్వలేదు. మూడు సార్లు టెట్ రాశాను. ఏం లాభం? – శాంతి శ్రీ, శ్రీకాకుళం ఒకే ఒక్క పోస్టు.. ఏం చేసేది? నేను 2014 డీఎస్సీలో 0.1 మార్కు తేడాతో స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) పోస్టు అవకాశం కోల్పోయాను. డీఎస్సీ అని ప్రకటిస్తుండటంతో రెండేళ్లుగా అదే పనిగా కోచింగ్ తీసుకున్నాను. ఈసారి మాకు ఒకే ఒక్క పోస్టు ఇచ్చారు. అభ్యర్థులు వేలల్లో ఉన్నారు. ఖాళీ పోస్టులున్నా చూపించడం లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. – శిరీష, రాజాం ఫీజు కట్టినా దరఖాస్తుకు అవకాశం లేదు మూడేళ్లుగా టీచర్ పోస్టు కోసం ఎదురు చూస్తున్నా డీఎస్సీని ప్రకటించలేదు. బీటెక్ పూర్తిచేసి ఆపై బీఈడీ చేశా. ఇప్పుడు ఎస్ఏ మేథ్స్ పోస్టుకు దరఖాస్తుకు ఆన్లైన్లో ఫీజు కడితే స్వీకరించారు. తీరా ఆన్లైన్ దరఖాస్తు చేస్తే బీఏ, బీఎస్సీ ఆప్షన్లు మాత్రమే చూపిస్తున్నారు తప్ప బీటెక్ వారికి అవకాశం ఇవ్వడం లేదు. ఫీజు కట్టించుకొని దరఖాస్తుకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయం. నాలుగేళ్లు బీఈడీ చేసి, టెట్లు రాసి లక్షలు ఖర్చు చేస్తే దరఖాస్తుకు అవకాశం లేకుండా చేశారు. – యమున, తిరుపతి, – రవీంద్ర, కడప మెగా డీఎస్సీ ప్రకటించాలి టెట్‌లో నాకు 143 మార్కులు వచ్చాయి. 23 వేల పోస్టులు ఖాళీలున్నాయని, కనీసం 12 వేలు భర్తీచేస్తారని పోస్టు గ్యారంటీ అనుకున్నాను. ఇప్పుడు ఎస్జీటీ పోస్టులు కుదించారు. బీఈడీ చేసిన వారికి కూడా అవకాశం ఇవ్వడంతో పోటీ ఎక్కువైంది. బీఈడీ వారికి అవకాశం ఇచ్చినందున మెగా డీఎస్సీ వేస్తే మాకు న్యాయం జరుగుతుంది. – తాళాడ సుకన్య, విజయనగరం -
నిబంధనల ప్రకారమే గురుకుల పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: గురుకుల టీచర్ పోస్టుల భర్తీని నిబంధనల ప్రకారమే చేపట్టామని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీలో మెరిట్ అభ్యర్థులకు ఓపెన్ కోటాలో పోస్టింగ్‌లు ఇవ్వకుండా, లోకల్ కోటాలో పోస్టింగ్‌లు ఇచ్చారని, దానివల్ల లోకల్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆరోపించిన నేపథ్యంలో టీఎస్పీఎస్పీ స్పందించింది. శుక్రవారం టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చిన కృష్ణయ్యకు పోస్టింగ్‌లకు సంబంధించి వివరాలను కమిషన్ సభ్యుడు సి.విఠల్, కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. భర్తీలో ఎలాంటి తప్పిదాల్లేవని వారు స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు చేయొద్దని కృష్ణయ్యకు సూచించారు. దానివల్ల కమిషన్ ప్రతిష్ట దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఆప్షన్ల ప్రకారమే భర్తీ..: ఐదు సొసైటీలకు సంబంధించిన పోస్టులను ఒకే పరీక్ష ద్వారా భర్తీ చేసినపుడు, అన్నింటికీ కామన్ మెరిట్ తీసి, అభ్యర్థుల నుంచి తీసుకున్న ఆప్షన్ల ప్రకారమే పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. కొందరు అభ్యర్థులు కోరుకున్న సొసైటీల్లో, కోరుకున్న జోన్లో, కోరుకున్న ఏజెన్సీ– నాన్ ఏజెన్సీ, బాలిక–బాలుర విద్యా సంస్థలను పరిగణనలోకి తీసుకొని వారికి లోకల్ కేటగిరీలో పోస్టులు కేటాయించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఓపెన్ కేటగిరీలో వారు కోరుకున్న (ఆప్షన్లు ఇచ్చిన ప్రకారం) పోస్టులను వారికంటే మెరిట్లో ఉన్న వారికి కేటాయించడం వల్ల ఆ కొంతమంది అభ్యర్థులకు లోకల్ కేటగిరీలో పోస్టులను కేటాయించాల్సి వచ్చిందన్నారు. ఇవన్నీ రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి ప్రభుత్వం జారీ చేసిన జీవో 8, జీవో 124, 763 ప్రకారమే చేశామని స్పష్టం చేశారు. స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 22, 22ఏ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్, మహిళ రిజర్వేషన్ అమలు చేస్తూ పోస్టింగ్‌లు ఇచ్చామన్నారు. అదికూడా మెరిట్ వారికి ఓపెన్ కేటగిరీలో పోస్టుల్లేకపోతే లోకల్ కేటగిరీలో పోస్టులు ఇవ్వాలని, మల్టిపుల్ కేడర్ రిక్రూట్మెంట్ చేసినపుడు అభ్యర్థుల ఆప్షన్లు తీసుకొని భర్తీ చేయాలని రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా జారీ చేసిన జీవో 763లో స్పష్టంగా ఉందని వివరించారు. -
ఎస్ఏ పోస్టుకు బీటెక్–బీఈడీ చదివితే సరిపోదు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో స్కూల్ అసిస్టెంట్ (మేథమెటిక్స్) పోస్టుకు దర ఖాస్తు చేసుకునేందుకు బీటెక్–బీఈడీ చదివితే సరిపోదని, బీఈడీలో తప్పనిసరిగా మేథమెటిక్స్ మెథడాలజీ చదివి ఉండాల్సిందేనని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. బీటెక్ చేసి బీఈడీలో మేథమెటిక్స్ మెథడాలజీ చదవని అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు చేసుకున్న దరఖాస్తులను తిరస్కరించడంలో తప్పు లేదంది. ఈ విషయంలో అధికారులను తప్పుపట్టలేమని పేర్కొంది. తన దరఖాస్తును అధికారులు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ఓ అభ్యర్ధి దాఖ లు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం రెండు రోజుల కింద ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన టీఆర్టీ నోటిఫికేషన్లో స్కూల్ అసి స్టెంట్ (మేథమెటిక్స్) పోస్టుకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మేథమెటిక్స్‌లో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలని, దీంతోపాటు ఎన్సీటీఈ గుర్తింపు ఉన్న విద్యా సంస్థ నుంచి బీఈడీలో మేథమెటిక్స్‌ను తప్పనిసరిగా చదివి ఉండాలని నిర్దేశించింది. -
ఏపీ డీఎస్సీ–2018 షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 12,370 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 15న డీఎస్సీ–2018 నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం జూన్ 11 నాటికి ఎంపికైనవారికి నియామక పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం సచివాలయంలో విడుదల చేశారు. మార్చి 23, 24, 26 తేదీల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఖాళీగా ఉన్న 10,313 స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జీటీ, లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీ తదితర పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి రెండు కేటగిరీల్లో అదనపు పోస్టులు 860, ఆదర్శ పాఠశాలల్లో 1197 ఖాళీలు కలిపి మొత్తం 12,370 పోస్టులు భర్తీ చేయనున్నారు. -
‘స్కీం అండ్ సిలబస్’పై దృష్టి
స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీ విధానంపై సర్కార్ కసరత్తు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయపోస్టుల భర్తీకి అమలు చేయాల్సిన పరీక్షకు సంబంధించి స్కీం అండ్ సిలబస్ రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పరీక్ష స్కీంను తెలియజేయాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, పరీక్ష విధానం ఎలా ఉండాలన్న అంశంపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖ పేర్కొంది. ప్రభుత్వం పరీక్ష విధానాన్ని ఖరారు చేస్తే దానికి అనుగుణంగా సిలబస్‌ను తాము ఇస్తామని విద్యా శాఖ ప్రభుత్వానికి తెలియ జేసినట్లు తెలిసింది. 3 నెలల్లో కష్టమే! పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ని 3 నెలల్లో పూర్తి చేయా లని ఇటీవల సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిం చిన నేపథ్యంలో విద్యా శాఖ కసరత్తు ప్రారంభిం చింది. ముందుగా సిలబ స్పై దృష్టి సారించింది. సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు నియామకాలను 3నెలల్లో పూర్తి చేయడం కష్టమేనని విద్యాశాఖ వర్గాలు చెబు తున్నాయి. దీంతోపాటు వి ద్యార్థులకు పరీక్షకు సిద్ధం అయ్యేందుకు మరో మూడు నెలల సమయం ఇచ్చి పరీక్షను నిర్వహిం చాలన్న ఆలోచన చేస్తోంది. మొత్తంగా ఆరు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది.