సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రకటన నిరుద్యోగుల్లో ఆశలు రేపింది. ప్రభుత్వ టీచర్ పోస్టు దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మొత్తం 6612 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. డిపార్ట్‌మెంటల్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల మంది ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పాసయిన వాళ్ళున్నారు. డీఎస్సీలో టెట్ అర్హులకు వెయిటేజ్ ఉంటుంది. ఇక కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. మొత్తంగా భర్తీ చేసే 6,612 పోస్టులకు దాదాపు 4 లక్షలకుపైగా పోటీ పడే పరిస్థితి కన్పిస్తోంది. ఈ లెక్కన ఒక్కో పోస్టుకూ 61 మంది పోటీ పడే వీలుందని అంచనా వేస్తున్నారు.
మళ్లీ కోచింగ్ హడావుడి..
డీఎస్సీ పరీక్షకు సంబంధించి విధివిధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పోటీ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రశ్నావళి రూపకల్పనలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిలబస్ ఏ విధంగా ఉండాలి? ఏ స్థాయిలో పరీక్ష విధానం ఉండాలనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఈ వ్యవహారం ఇలా ఉంటే... ఇప్పటికే పుట్టగొడుగుల్లా కోచింగ్ కేంద్రాలు వెలుస్తున్నాయి. డీఎస్సీకి ప్రిపేరయ్యే అభ్యర్థులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు తక్కువ సమయంలో డీఎస్సీ పరీక్షకు శిక్షణ ఇవ్వగల అధ్యాపకులను అన్వేషిస్తున్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో డీఎస్సీ పరీక్ష కోసమే ప్రత్యేక శిక్షణ కేంద్రాలు, వాటికి అనుబంధంగా హాస్టళ్ళూ వెలుస్తున్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమం ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. స్వల్పకాలిక శిక్షణ కోసం రూ.25వేల నుంచి 1.50 లక్షల వరకూ ఫీజులు వసూలు చేస్తున్నాయి.
కేవలం డీఎస్సీ కోసమే నిర్వహించే హాస్టళ్ళు కూడా నెలకు రూ.15వేల నుంచి రూ.30 వేల వరకూ తీసుకుంటున్నాయి. టీచర్ పోస్టుల భర్తీ ప్రకటన తర్వాత హైదరాబాద్‌లోనే కొత్తగా 178 కోచింగ్ కేంద్రాలు వెలిశాయని టీచర్ పరీక్షల తర్ఫీదు ఇచ్చే అధ్యాపకుడు కృపాకర్ తెలిపారు. నెల రోజుల బోధనకు రూ.2 లక్షల వరకూ టీచర్లకు ఇచ్చేందుకు కోచింగ్ కేంద్రాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు.
పెద్ద ఎత్తున స్టడీ మెటీరియల్స్
నియామక పరీక్ష విధానం రూపురేఖలు తెలియకపోయినా స్టడీ మెటీరియల్ మాత్రం సిద్ధమవుతున్నాయి. గతంలో జరిగిన పరీక్షలను కొలమానంగా తీసుకుని స్టడీ మెటీరియల్ రూపొందిస్తున్నారు. ప్రచురణా సంస్థలు ఏకంగా అధ్యాపకులను నియమించుకుని మెటీరియల్స్ రూపొందిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన వివిధ పరీక్షలు, బోధన విధానాలు, సైకాలజీతో పాటు సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్స్ రూపొందిస్తున్నారు.
విద్యార్థుల డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మెటీరియల్ ధరలు కూడా ఈసారి ఎక్కువగానే ఉండే వీలుందని నిపుణులు చెబుతున్నారు. 2017లో ఇదే తరహాలో స్టడీ మెటీరియల్స్ వచ్చినా, చాలా వరకూ నాణ్యత లోపం కన్పించిందని సైన్స్ అధ్యాపకుడు నవీన్ చంద్ర తెలిపారు. సీబీఎస్‌ఈ పుస్తకాలను 1–10 వరకూ క్షుణ్ణంగా చదివితే మంచి మార్కులు సాధించే వీలుందని, అనవరసంగా స్టడీ మెటీరియల్స్‌పై నమ్మకం పెట్టుకోవద్దని సూచించారు.
ప్రైవేటు స్కూళ్ళల్లో టీచర్ల కొరత
ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించాలని యువత లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రైవేటు స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్లు ప్రత్యేక శిక్షణపై దృష్టి పెట్టారు. దీంతో స్కూళ్ళకు దీర్ఘకాలిక సెలవులు పెడుతున్నారు. ఇది తమకు మంచి అవకాశమని, సెలవు ఇవ్వకపోతే రాజీనామాకు సిద్ధమని యాజమాన్యాలకు చెబుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ప్రైవేటు టీచర్లకు వేతనాలు కూడా అరకొరగా ఉంటున్నాయి. ఈ కారణంగా ఉన్నపళంగా ప్రైవేటు టీచర్లు వెళ్ళిపోతున్నారు. దీంతో ప్రైవేటు స్కూళ్ళల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతోంది. ఇక హైదరాబాద్ సహా ఇతర ముఖ్యమైన పట్టణ ప్రాంతాల్లో ఉన్న కార్పొరేట్ స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్లకు యాజమాన్యాలు కొన్ని క్లాసులు తగ్గించి, పరీక్షకు సన్నద్ధమయ్యే అవకాశం కల్పిస్తున్నాయి.
ఒక్కో పోస్టుకు 61 మంది..
Published Mon, Aug 28 2023 6:06 AM | Last Updated on Mon, Aug 28 2023 2:54 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment