teacher posts vacancy
-
గత ఐదేళ్లలో 23,699 టీచర్ పోస్టులు భర్తీ
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ అంటూ చాటింపు వేస్తున్న టీడీపీ పెద్దలు గత ప్రభుత్వం ఏకంగా 23,699 టీచర్ పోస్టులు భర్తీ చేసిన విషయాన్ని కప్పిపుచ్చుతున్నారు. ఎన్నికల ముందు డీఎస్సీ ప్రకటించడం, ఆ తరువాత పరీక్షలు నిర్వహించకుండా తాత్సారం చేయడం టీడీపీ హయాంలో రివాజు. 2014, 2018లోనూ ఆర్భాటంగా డీఎస్సీలు ప్రకటించి పోస్టులు భర్తీ చేయకుండా వదిలేసింది.అనంతరం డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలన్న తలంపుతో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతి పాఠశాలలలో నూరు శాతం ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకుంది. అందుకు అనుగుణంగా టీచర్ ఖాళీలను భర్తీ చేసింది. కేజీబీవీల్లో సైతం 1,200 రెగ్యులర్ టీచర్లను నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,100 ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి షెడ్యూల్ ప్రకటించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కూడా నిర్వహించింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ ఫలితాలు ప్రకటించలేదు. అన్యాయాలను సరిదిద్ది..చంద్రబాబు హయాంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీని ఓ ప్రహసనంగా మార్చేశారు. గతంలో నాలుగేళ్లు అధికారాన్ని అనుభవించి ఎన్నికలకు ముందు ఏడాది 2018లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. అది సక్రమంగా నిర్వహించలేక చేతులెత్తేశారు. ఫలితంగా అభ్యర్థులకు అన్యాయం జరగడంతో కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇందులో 7,902 ఉపాధ్యాయ పోస్టులకుగానూ 300 పోస్టులను భర్తీ చేసి చేతులెత్తేశారు. అంతకు ముందు 2014లోనూ 10,313 పోస్టులతో డీఎస్సీ ప్రకటించి పరీక్షలు నిర్వహించి పోస్టుల భర్తీని గాలికి వదిలేశారు. 1998లో ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహించి టీచర్ అభ్యర్థులను నిలువుగా మోసం చేశారు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా, ఏ ఒక్క టీచర్ అభ్యర్థికీ అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 2018 డీఎస్సీలో దగాపడ్డ అభ్యర్థులకు న్యాయం చేసింది. కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి సారించి సుమారు 7,254 మంది అభ్యర్థులకు ఉపాధ్యాయులుగా పోస్టింగ్ ఇచ్చింది.2018 లిమిటెడ్ డీఎస్సీ అభ్యర్థులు 24 మందికి పోస్టులిచ్చింది. 2019లోనే స్పెషల్ డీఎస్సీ వేసి 521 పోస్టులను భర్తీ చేసింది. ఇక 1998 డీఎస్సీ ద్వారా అన్యాయానికి గురైన 4,059 మంది అభ్యర్థులకు న్యాయం చేసేందుకు మినిమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) కింద 3,864 మందికి పోస్టింగ్ ఇచ్చారు. 2008 డీఎస్సీలో మిగిలిపోయిన 1,910 మందిని ఎంటీఎస్ టీచర్లుగా నియమించారు. తెలంగాణలో 1998, 2018 డీఎస్సీ అభ్యర్థులు పోస్టింగ్స్ కోసం ఇప్పటికీ నిరీక్షిస్తున్నా అక్కడి ప్రభుత్వాలు పట్టించుకున్నది లేదు. -
అంతా సిద్ధమే.. అయినా ఆలస్యమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం వరుసగా ప్రకటనలు చేస్తున్నా.. ఆ దిశగా ముందడుగు పడటం లేదని నిరుద్యోగులు, ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లకేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల కోసం సిద్ధమవుతున్నామని, వీలైనంత త్వరగా ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నారు. గత ప్రభుత్వంలో డీఎస్సీ వేసినా.. టీచర్ల పదోన్నతులు, బదిలీలు, టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష)లో అర్హత వంటి ఇబ్బందులతో నియామక ప్రక్రియ ఆగిపోయిందని గుర్తుచేస్తున్నారు. కొత్త సర్కారు మెగా డీఎస్సీ వేస్తామని ప్రకటించడం సంతోషకరమని.. కానీ ఇప్పటికే ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి, ఆటంకాలను తొలగించడంపై దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని, ఆలోగానే భర్తీ ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు. నాలుగు లక్షల మందికిపైగా.. రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్య కోర్సులు పూర్తి చేసి, టెట్ కూడా పాసైన వారు సుమారు 4 లక్షల మందికిపైగా ఉన్నారు. వారంతా టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో ఏళ్లకేళ్లుగా డీఎస్సీ కోసం ప్రత్యేక కోచింగ్ తీసుకుంటున్నవారు కూడా ఉన్నారు. కొత్త సర్కారు మెగా డీఎస్సీ వేస్తామనడం, ఇటీవల సీఎం రెండుసార్లు టీచర్ పోస్టుల భర్తీపై సమీక్షించినా.. నోటిఫికేషన్ జారీ దిశగా ప్రక్రియ ఏదీ మొదలవకపోవడంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో మెగా డీఎస్సీపై చర్చ జరిగిందని, ఖాళీల గుర్తింపు, ఇతర అంశాలపై కసరత్తు చేపట్టాలని సీఎం ఆదేశించారని మంత్రులు చెప్పడంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ వేసినా ఆగిపోయి.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2017లో టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించారు. తర్వాత ఆ ఊసే లేదు. గత ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినా.. 5,089 పోస్టులే ఉన్నాయి. ఆరేళ్ల తర్వాత డీఎస్సీ వేశారని, పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. కొత్త రోస్టర్ విధానంతో కొన్ని జిల్లాల్లో పోస్టులే లేకుండాపోయాయని నిరాశ వ్యక్తం చేశారు. దీనికితోడు పదోన్నతులు, బదిలీల సమస్యలతో డీఎస్సీ వాయిదా పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ మంత్రులు, అధికారులకు అభ్యర్థులు వినతిపత్రాలు సమర్పించారు. దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. సీఎం కూడా టీచర్ పోస్టుల భర్తీపై రెండు సార్లు అధికారులతో సమీక్షించి.. సమగ్ర నివేదిక కోరారు. అధికారులు లెక్కలన్నీ తేల్చి.. పదోన్నతుల ద్వారా కొన్ని, నేరుగా జరిగే నియామకాల మరికొన్ని.. కలిసి 21వేల టీచర్ పోస్టుల భర్తీ అవసరమని నివేదించారు. సీఎం రేవంత్ కూడా మెగా డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అనేక మంది ప్రైవేటు స్కూళ్లలో ఉద్యోగాలు మానుకుని మరీ డీఎస్సీ కోసం సిద్ధమవుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి అనుకున్నస్థాయిలో వేగం కనిపించడం లేదని.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వస్తే మళ్లీ మొదటికి వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం డీఎస్సీ కోసం రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. అధికారులు ఖాళీల వివరాలను ప్రభుత్వానికి సమర్పించడం, సీఎం రివ్యూ చేయడంతో ఆశలు నెరవేరుతున్నాయన్న ఆనందం కనిపించింది. కానీ నోటిఫికేషన్ దిశగా అడుగు ముందుకు పడకపోతుండటంపై నిరుద్యోగుల్లో అసహనం పెరుగుతోంది. – రావుల రామ్మోహన్‌రెడ్డి, డీఎడ్. బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బదిలీలు, పదోన్నతులతో లింకు పూర్తిస్థాయిలో టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపడితే తప్ప వాస్తవ ఖాళీలను నిర్థారించలేమని విద్యాశాఖ అధికారులే చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు 13వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పదోన్నతుల ద్వారా మరో 8 వేల వరకు పోస్టులు ఖాళీ అవుతాయని అంటున్నారు. మరోవైపు పదోన్నతుల విషయంలో పలు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. ముఖ్యంగా టీచర్ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణులకు మాత్రమే పదోన్నతులు ఇవ్వాలంటూ.. 2012 తర్వాత నియమితులైన టీచర్లు కోర్టును ఆశ్రయించారు. కోర్టు కేంద్ర నిబంధనలను పరిశీలించి.. పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని తేల్చింది. గత ఏడాది చేపట్టిన టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు 80వేల మంది టీచర్లు ‘టెట్’రాయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మారిన సిలబస్ నేపథ్యంలో కొత్త అభ్యర్థులతో సమానంగా పాత టీచర్లు టెట్ రాయడం కష్టమని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం లేవనెత్తుతున్నాయి. ‘టెట్’నిర్వహణ, టీచర్ల బదిలీల విషయంలో ఇది చిక్కుముడిగా మారింది. మరోవైపు భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి అవసరం. వీటన్నింటితో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. అన్ని అడ్డంకులను ఛేదించుకుని లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్లోగా డీఎస్సీ నోటిఫికేషన్ రావడం కష్టమేనని అంటున్నాయి. టీచర్లకు టెట్ నిర్వహించాలి టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత తప్పనిసరి. ఎన్నో ఏళ్లుగా బోధిస్తున్న టీచర్లకు ఈ పరీక్షను అంతర్గత పరీక్షలా నిర్వహించాలి. ఇది ఎంత త్వరగా చేపడితే అంత మంచిది. ఇప్పటికే స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. నిర్వహణ పోస్టులైన డీఈవో, ఎంఈవోల పోస్టుల్లో చాలావరకు ఖాళీగా ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. – చావా రవి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి -
ఒక్కో పోస్టుకు 61 మంది..
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రకటన నిరుద్యోగుల్లో ఆశలు రేపింది. ప్రభుత్వ టీచర్ పోస్టు దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మొత్తం 6612 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల మంది ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పాసయిన వాళ్ళున్నారు. డీఎస్సీలో టెట్ అర్హులకు వెయిటేజ్ ఉంటుంది. ఇక కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. మొత్తంగా భర్తీ చేసే 6,612 పోస్టులకు దాదాపు 4 లక్షలకుపైగా పోటీ పడే పరిస్థితి కన్పిస్తోంది. ఈ లెక్కన ఒక్కో పోస్టుకూ 61 మంది పోటీ పడే వీలుందని అంచనా వేస్తున్నారు. మళ్లీ కోచింగ్ హడావుడి.. డీఎస్సీ పరీక్షకు సంబంధించి విధివిధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పోటీ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రశ్నావళి రూపకల్పనలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిలబస్ ఏ విధంగా ఉండాలి? ఏ స్థాయిలో పరీక్ష విధానం ఉండాలనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఈ వ్యవహారం ఇలా ఉంటే... ఇప్పటికే పుట్టగొడుగుల్లా కోచింగ్ కేంద్రాలు వెలుస్తున్నాయి. డీఎస్సీకి ప్రిపేరయ్యే అభ్యర్థులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు తక్కువ సమయంలో డీఎస్సీ పరీక్షకు శిక్షణ ఇవ్వగల అధ్యాపకులను అన్వేషిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో డీఎస్సీ పరీక్ష కోసమే ప్రత్యేక శిక్షణ కేంద్రాలు, వాటికి అనుబంధంగా హాస్టళ్ళూ వెలుస్తున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమం ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. స్వల్పకాలిక శిక్షణ కోసం రూ.25వేల నుంచి 1.50 లక్షల వరకూ ఫీజులు వసూలు చేస్తున్నాయి. కేవలం డీఎస్సీ కోసమే నిర్వహించే హాస్టళ్ళు కూడా నెలకు రూ.15వేల నుంచి రూ.30 వేల వరకూ తీసుకుంటున్నాయి. టీచర్ పోస్టుల భర్తీ ప్రకటన తర్వాత హైదరాబాద్‌లోనే కొత్తగా 178 కోచింగ్ కేంద్రాలు వెలిశాయని టీచర్ పరీక్షల తర్ఫీదు ఇచ్చే అధ్యాపకుడు కృపాకర్ తెలిపారు. నెల రోజుల బోధనకు రూ.2 లక్షల వరకూ టీచర్లకు ఇచ్చేందుకు కోచింగ్ కేంద్రాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. పెద్ద ఎత్తున స్టడీ మెటీరియల్స్ నియామక పరీక్ష విధానం రూపురేఖలు తెలియకపోయినా స్టడీ మెటీరియల్ మాత్రం సిద్ధమవుతున్నాయి. గతంలో జరిగిన పరీక్షలను కొలమానంగా తీసుకుని స్టడీ మెటీరియల్ రూపొందిస్తున్నారు. ప్రచురణా సంస్థలు ఏకంగా అధ్యాపకులను నియమించుకుని మెటీరియల్స్ రూపొందిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన వివిధ పరీక్షలు, బోధన విధానాలు, సైకాలజీతో పాటు సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్స్ రూపొందిస్తున్నారు. విద్యార్థుల డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మెటీరియల్ ధరలు కూడా ఈసారి ఎక్కువగానే ఉండే వీలుందని నిపుణులు చెబుతున్నారు. 2017లో ఇదే తరహాలో స్టడీ మెటీరియల్స్ వచ్చినా, చాలా వరకూ నాణ్యత లోపం కన్పించిందని సైన్స్ అధ్యాపకుడు నవీన్ చంద్ర తెలిపారు. సీబీఎస్ఈ పుస్తకాలను 1–10 వరకూ క్షుణ్ణంగా చదివితే మంచి మార్కులు సాధించే వీలుందని, అనవరసంగా స్టడీ మెటీరియల్స్‌పై నమ్మకం పెట్టుకోవద్దని సూచించారు. ప్రైవేటు స్కూళ్ళల్లో టీచర్ల కొరత ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించాలని యువత లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రైవేటు స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్లు ప్రత్యేక శిక్షణపై దృష్టి పెట్టారు. దీంతో స్కూళ్ళకు దీర్ఘకాలిక సెలవులు పెడుతున్నారు. ఇది తమకు మంచి అవకాశమని, సెలవు ఇవ్వకపోతే రాజీనామాకు సిద్ధమని యాజమాన్యాలకు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ప్రైవేటు టీచర్లకు వేతనాలు కూడా అరకొరగా ఉంటున్నాయి. ఈ కారణంగా ఉన్నపళంగా ప్రైవేటు టీచర్లు వెళ్ళిపోతున్నారు. దీంతో ప్రైవేటు స్కూళ్ళల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతోంది. ఇక హైదరాబాద్ సహా ఇతర ముఖ్యమైన పట్టణ ప్రాంతాల్లో ఉన్న కార్పొరేట్ స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్లకు యాజమాన్యాలు కొన్ని క్లాసులు తగ్గించి, పరీక్షకు సన్నద్ధమయ్యే అవకాశం కల్పిస్తున్నాయి. -
10,673 టీచర్ పోస్టులు ఖాళీ
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖలో పదవీ విరమణలతో 10,673 టీచర్ పోస్టులు ఖాళీ అయినట్లు విద్యాశాఖ అంచనా వేసింది. అందులో అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు ఉండగా, మిగతావి స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు, హెడ్మాస్టర్ (హెచ్ఎం) పోస్టులు ఉన్నాయి. అయితే వాటన్నింటినీ డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే వీలు లేదు. అందులో 6 వేలకు పైగా ఎస్జీటీ పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉండగా, ఎస్ఏ ఖాళీల్లో 70 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా, 30 శాతం పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరంలో... వచ్చే విద్యా సంవత్సరంలో (2021–22) మరో 2,264 మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందనున్నారని విద్యాశాఖ లెక్కలు తేల్చింది. అందులో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 199 మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందనున్నారు. ఆ తరువాత అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 186 మంది టీచర్లు రిటైర్ కానున్నారు. అలాగే సంగారెడ్డిలో 152 మంది, సిద్దిపేట్ జిల్లాలో 139 మంది, నిజామాబాద్‌లో 136 మంది, వరంగల్ అర్బన్‌లో 106 మంది, కరీంనగర్లో 99 మంది, మిగతా వాటిలో ఒక్కో జిల్లాలో 8 మంది నుంచి 99 మందిలోపు టీచర్లు పదవీ విరమణ పొందనున్నట్లు లెక్కలు తీసింది. దీర్ఘకాలిక సెలవుల్లో 615 మంది టీచర్లు మరోవైపు 615 మంది టీచర్లు ధీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు విద్యాశాఖ తేల్చింది. అందులో అత్యధికంగా వనపర్తి జిల్లాలో 89 మంది టీచర్లు ధీర్ఘకాలిక సెలవు పెట్టినట్లు పేర్కొది. నాగర్‌కర్నూల్‌లో 65 మంది, రంగారెడ్డి జిల్లాలో 62 మంది, నల్లగొండలో 62 మంది, మెదక్‌లో 52 మంది, జోగులాంబ జిల్లాలో 30 మంది, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 34, సిద్ధిపేట్‌లో 22, నిజమాబాద్‌లో 17, నిర్మల్‌లో 18, మంచిర్యాలలో 17 మంది టీచర్లు ధీర్ఘకాలిక సెలవులో ఉన్నట్లు వెల్లడించింది. మిగతా జిల్లాల్లో ఒక్కరి నుంచి 15 మంది వరకు లాంగ్‌లీవ్‌లో ఉన్నట్లు తెలిపింది. చదవండి: (ఆర్టీసీలో మరో సరికొత్త వ్యవస్థ..!) -
దేశంలో 10 లక్షలటీచర్ల పోస్టులు ఖాళీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలకు సంబంధించి 10 లక్షలకు పైగా టీచర్లపోస్టులు మంజూరైనా అవన్నీ ఇంకా ఖాళీగానే ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. ఎలిమెంటరీ పోస్టుల్లో రాష్ట్రాలవారీ ఖాళీలను చూస్తే ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉంది. సెకండరీ లెవల్లో ఖాళీల విషయంలో జమ్మూ కశ్మీర్ తొలిస్థానంలో ఉంది. గత మార్చి31నాటి గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఎలిమెంటరీ లెవల్లో 51,03,539 పోస్టులు మంజూరుకాగా ఇంకా 9,00,316 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మానవవనరుల శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహ లోక్‌సభలో చెప్పారు. జమ్మూ కశ్మీర్లో సెకండరీ లెవల్లో 25,657 పోస్టులు మంజూరుకాగా ఏకంగా 21,221 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. -
తెలుగు రాష్ట్రాల్లో 38377 ఉపాధ్యాయ ఖాళీలు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఢిల్లీలో జరిగిన అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి సమర్పించిన నివేదికలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ వివరాలు వెల్లడించాయి. తెలంగాణలో 16,193 టీచర్ పోస్టులు ఖాళీ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 16,193 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో (1 నుంచి 8వ తరగతి వరకు) 13,049 పోస్టులు, ఉన్నత పాఠశాలల్లో 3,144 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. అలాగే రాష్ట్రంలో 35.79 శాతం స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేరని వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో 22,184 ఉపాధ్యాయ ఖాళీలు ‘రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కూడా సరిగా లేవు. వీటిపై తక్షణం చర్యలు తీసుకోవాలి’ అని కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఈ ఏడాది మార్చినాటికి ఏకంగా 22,184 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. ఇందులో ప్రాథమిక స్కూళ్లలో(1 నుంచి 8వ తరగతి వరకు) 17,128 పోస్టులు, ఉన్నత పాఠశాలల్లో 5,056 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో సగటు ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 18గా ఉందని, 32.03 శాతం ప్రాథమిక పాఠశాలల్లో నిబంధనల మేరకు ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి అమలు జరగడం లేదని కేంద్రం వెల్లడించింది. వివిధ రాష్ట్రాలు సమర్పించిన నివేదికల ఆధారంగా కేంద్రం దేశవ్యాప్తంగా స్కూళ్లలోని పరిస్థితిపై లెక్కలు కట్టింది. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో ఏకంగా 8.33 లక్షల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది. ఇక దేశంలోని మొత్తం స్కూళ్లలో 8.5 శాతం పాఠశాలలు ఒకే టీచర్‌తో కొనసాగుతున్నాయి. 64 శాతం స్కూళ్లలో ప్రధాన సబ్జెక్టులకు టీచర్లు లేరు. 16 రాష్ట్రాల్లో శిక్షణ పొందని టీచర్లు పనిచేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులే ఉన్నారు. టీచర్ పోస్టుల భర్తీతోపాటు స్కూళ్లలో మెరుగైన వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది.