సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం వరుసగా ప్రకటనలు చేస్తున్నా.. ఆ దిశగా ముందడుగు పడటం లేదని నిరుద్యోగులు, ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లకేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల కోసం సిద్ధమవుతున్నామని, వీలైనంత త్వరగా ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నారు. గత ప్రభుత్వంలో డీఎస్సీ వేసినా.. టీచర్ల పదోన్నతులు, బదిలీలు, టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష)లో అర్హత వంటి ఇబ్బందులతో నియామక ప్రక్రియ ఆగిపోయిందని గుర్తుచేస్తున్నారు. కొత్త సర్కారు మెగా డీఎస్సీ వేస్తామని ప్రకటించడం సంతోషకరమని.. కానీ ఇప్పటికే ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి, ఆటంకాలను తొలగించడంపై దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని, ఆలోగానే భర్తీ ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు.
నాలుగు లక్షల మందికిపైగా..
రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్య కోర్సులు పూర్తి చేసి, టెట్ కూడా పాసైన వారు సుమారు 4 లక్షల మందికిపైగా ఉన్నారు. వారంతా టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో ఏళ్లకేళ్లుగా డీఎస్సీ కోసం ప్రత్యేక కోచింగ్ తీసుకుంటున్నవారు కూడా ఉన్నారు. కొత్త సర్కారు మెగా డీఎస్సీ వేస్తామనడం, ఇటీవల సీఎం రెండుసార్లు టీచర్ పోస్టుల భర్తీపై సమీక్షించినా.. నోటిఫికేషన్ జారీ దిశగా ప్రక్రియ ఏదీ మొదలవకపోవడంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో మెగా డీఎస్సీపై చర్చ జరిగిందని, ఖాళీల గుర్తింపు, ఇతర అంశాలపై కసరత్తు చేపట్టాలని సీఎం ఆదేశించారని మంత్రులు చెప్పడంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
డీఎస్సీ వేసినా ఆగిపోయి..
తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2017లో టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించారు. తర్వాత ఆ ఊసే లేదు. గత ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినా.. 5,089 పోస్టులే ఉన్నాయి. ఆరేళ్ల తర్వాత డీఎస్సీ వేశారని, పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. కొత్త రోస్టర్ విధానంతో కొన్ని జిల్లాల్లో పోస్టులే లేకుండాపోయాయని నిరాశ వ్యక్తం చేశారు. దీనికితోడు పదోన్నతులు, బదిలీల సమస్యలతో డీఎస్సీ వాయిదా పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ మంత్రులు, అధికారులకు అభ్యర్థులు వినతిపత్రాలు సమర్పించారు.
దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. సీఎం కూడా టీచర్ పోస్టుల భర్తీపై రెండు సార్లు అధికారులతో సమీక్షించి.. సమగ్ర నివేదిక కోరారు. అధికారులు లెక్కలన్నీ తేల్చి.. పదోన్నతుల ద్వారా కొన్ని, నేరుగా జరిగే నియామకాల మరికొన్ని.. కలిసి 21వేల టీచర్ పోస్టుల భర్తీ అవసరమని నివేదించారు. సీఎం రేవంత్ కూడా మెగా డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అనేక మంది ప్రైవేటు స్కూళ్లలో ఉద్యోగాలు మానుకుని మరీ డీఎస్సీ కోసం సిద్ధమవుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి అనుకున్నస్థాయిలో వేగం కనిపించడం లేదని.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వస్తే మళ్లీ మొదటికి వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు.
ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం
డీఎస్సీ కోసం రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. అధికారులు ఖాళీల వివరాలను ప్రభుత్వానికి సమర్పించడం, సీఎం రివ్యూ చేయడంతో ఆశలు నెరవేరుతున్నాయన్న ఆనందం కనిపించింది. కానీ నోటిఫికేషన్ దిశగా అడుగు ముందుకు పడకపోతుండటంపై నిరుద్యోగుల్లో అసహనం పెరుగుతోంది.
– రావుల రామ్మోహన్‌రెడ్డి, డీఎడ్. బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
బదిలీలు, పదోన్నతులతో లింకు
పూర్తిస్థాయిలో టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపడితే తప్ప వాస్తవ ఖాళీలను నిర్థారించలేమని విద్యాశాఖ అధికారులే చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు 13వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పదోన్నతుల ద్వారా మరో 8 వేల వరకు పోస్టులు ఖాళీ అవుతాయని అంటున్నారు. మరోవైపు పదోన్నతుల విషయంలో పలు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. ముఖ్యంగా టీచర్ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణులకు మాత్రమే పదోన్నతులు ఇవ్వాలంటూ.. 2012 తర్వాత నియమితులైన టీచర్లు కోర్టును ఆశ్రయించారు. కోర్టు కేంద్ర నిబంధనలను పరిశీలించి.. పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని తేల్చింది.
గత ఏడాది చేపట్టిన టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు 80వేల మంది టీచర్లు ‘టెట్’రాయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మారిన సిలబస్ నేపథ్యంలో కొత్త అభ్యర్థులతో సమానంగా పాత టీచర్లు టెట్ రాయడం కష్టమని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం లేవనెత్తుతున్నాయి. ‘టెట్’నిర్వహణ, టీచర్ల బదిలీల విషయంలో ఇది చిక్కుముడిగా మారింది. మరోవైపు భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి అవసరం. వీటన్నింటితో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. అన్ని అడ్డంకులను ఛేదించుకుని లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌లోగా డీఎస్సీ నోటిఫికేషన్ రావడం కష్టమేనని అంటున్నాయి.
టీచర్లకు టెట్ నిర్వహించాలి
టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత తప్పనిసరి. ఎన్నో ఏళ్లుగా బోధిస్తున్న టీచర్లకు ఈ పరీక్షను అంతర్గత పరీక్షలా నిర్వహించాలి. ఇది ఎంత త్వరగా చేపడితే అంత మంచిది. ఇప్పటికే స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. నిర్వహణ పోస్టులైన డీఈవో, ఎంఈవోల పోస్టుల్లో చాలావరకు ఖాళీగా ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. – చావా రవి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment