
గ్రామసభలో రెండో రోజూ పలుచోట్ల గొడవలు
మంత్రి ఉత్తమ్ ప్రసంగాన్నిఅడ్డుకున్న గ్రామస్తులు
సుడా మాజీ చైర్మన్‌కు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటంపై ప్రజల ఆగ్రహం
60% సభలు విజయవంతం: ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా లబ్ధిదారుల ఎంపికకు చేపట్టిన గ్రామసభల్లో బుధ వారం రెండోరోజు కూడా పలు చోట్ల గందరగోళం తలెత్తింది. మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు సభల్లో పాల్గొన్నారు.
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన సభకు హాజరయ్యారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పలు గ్రామసభల్లో పాల్గొన్నారు.
ముంపు నుంచి తేల్చండి
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్‌లో జరిగిన గ్రామసభలో మంత్రి ఉత్తమ్‌కుమా ర్ రెడ్డి ప్రసంగాన్ని మహిళలు అడ్డుకున్నారు. నారాయణపూర్, మంగపేట, చెర్లపల్లిని నారాయణపూర్ ప్రాజెక్టులో ముంపు గ్రామాలుగా ప్రకటించి, నష్ట పరిహారం చెల్లించాలని కోరారు.
మహిళలు పట్టు వీడకపోవటంతో 3 గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు అభ్యంతరం తెలుపటంతో గందరగోళం ఏర్పడింది.
సుడా మాజీ చైర్మన్‌కు ఇందిరమ్మ ఇల్లు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 41 డివిజన్‌లో జరిగిన వార్డు సభలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో మాజీ కార్పొరేటర్ విశాలిని రెడ్డి పేరు ఉండటంపై బీజేపీ నేతలు అభ్యంతరం తెలిపారు.
విశాలిని రెడ్డి మాజీ కార్పొరేటర్ కాగా, ఆమె భర్త శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) మాజీ చైర్మన్. వారికి ఇందిరమ్మ ఇల్లు ఎలా ఇస్తారని ప్రజలు నిలదీశారు. మోర్తాడ్ మండలం ఓడ్యాడ్ గ్రామంలో అర్హుల జాబితాపై గ్రామస్తులు అభ్యంతరం తెలపటంతో అధికారులు సభను అర్ధాంతరంగా ముగించారు.
ఖమ్మంలో రసాభాస
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం గ్రామసభలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం లేదని ప్రజలు అధికారులను నిలదీశారు. కూసుమంచి గ్రామసభలో అనర్హులను జాబితాలో చేర్చారని ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. తిరుమలాయపాలెం మండలంలో ని జల్లేపల్లి గ్రామంలో అర్హులకు పథకాలు అంద డం లేదని గ్రామస్తులు అధికారులను నిలదీశారు.
మరికొన్ని జిల్లాల్లో..
నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం ఉజ్జెలి గ్రామంలో ఆత్మీయ భరోసా అర్హుల జాబితాపై గ్రామస్తులు నిరసన తెలిపారు. భూమి లేని కూలీలు 95 మంది ఉంటే, 12 మందినే ఎంపిక చేస్తారా? అని అధికారులను నిలదీశారు. మంచిర్యాల జిల్లా భీమారం, తలమడగు మండలం రుయ్యడిలో అర్హుల పేర్లు జాబితాలో లేవని గ్రామస్తులు గొడవకు దిగారు.
తమ గ్రామంలో ఉన్న డంప్‌యార్డును తొలగించాలని సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామస్తులు గ్రామసభను బహిష్కరించారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామసభలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలంలోని కూరెళ్లలో గ్రామసభలో గందరగోళం ఏర్పడింది. గ్రామంలో 520 మంది ఇళ్లకోసం దర ఖాస్తు చేయగా, 25 మందికే మంజూరు కావడంపై గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మల్లాపూర్‌లో గ్రామసభ జరుగుతుండగా జాబితాలో పేరు లేదన్న కోపంతో ఓ వ్యక్తి ఆ జాబితా ప్రతులను ఎత్తుకుపోయాడు.
విజయవంతంగా గ్రామసభలు: ప్రభుత్వం
నాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపికచేసేందుకు నిర్వహిస్తున్న గ్రామసభలు విజయవంతంగా కొనసాగుతున్నా యని ప్రభుత్వం ప్రకటించింది. 9,844 గ్రామాలు, వార్డులలో సభలు జరిగాయని, 60 శాతం సభలను విజయవంతంగా నిర్వహించినట్లు బుధవారం తెలిపింది. గ్రామసభల్లో నాలుగు పథకాలకు సంబంధించి ఇప్పటివరకు 10,09,131 దరఖాస్తులు అందినట్లు వెల్లడించింది.
రెండో రోజు బుధవారం 3,608 గ్రామ సభలు, 1,055 వార్డు సభలు కలపి మొత్తం 4,663 సభలను నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 12,914 గ్రామ సభలు, పట్టణ ప్రాంతాల్లో 3,484 వార్డు సభలు కలిపి 16,398 సభలు నిర్వహించాల్సి ఉంది.