సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి అవాంతరాలు తప్పడం లేదు. ఒక్కోసారి ఒక్కో సమస్యతో ఏడాది కాలంగా పోస్టుల భర్తీ ఆగిపోతూనే ఉంది. రోస్టర్ కమ్ రిజర్వేషన్ విషయంలో న్యాయ వివాదం కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నా.. రాష్ట్రంలో వరుస ఎన్నికలతో కోడ్ కారణంగా అవి భర్తీకి నోచుకునే పరిస్థితి కనిపించటం లేదు. మొత్తంగా ఎన్నికలు పూర్తయ్యే సరికి మరో ఆరేడు నెలల సమయం పట్టనుంది. ఆ తర్వాత నియామకాలు జరుగుతాయా.. అంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న వైస్ చాన్స్‌లర్ల పదవీకాలం జూన్, జూలై నెలల్లో ముగిసిపోనుంది. దీంతో ప్రభుత్వం కొత్త వైస్ ఛాన్స్‌లర్లను నియమించి వారు ఆ నియామకాల నిబంధనలను అధ్యయనం చేసి నోటిఫికేషన్ జారీ చేసే నాటికి మరింత సమయం పట్టనుంది.
పోస్టుల భర్తీకి గతేడాదే అనుమతి..
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో మొత్తంగా 1,551 పోస్టులు ఖాళీగా ఉండగా, మొదటి దశలో 1,061 పోస్టుల భర్తీకి గతేడాదే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అప్పట్లో నియామక నిబంధనల విషయంలో ఉన్నత విద్యాశాఖ తాత్సారం చేయగా, ఆ తర్వాత యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లు కొన్నాళ్లు వాటిపై దృష్టి పెట్టలేదు. అనంతరం నియామకాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త నిబంధనలను జారీ చేసిందని, వాటిని అమలు చేయాలా.. వద్దా.. అంటూ ఆలస్యం చేశారు. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం నియామకాలకు వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. అదే సమయంలో రోస్టర్ కమ్ రిజర్వేషన్ విషయంలో అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. విభాగాల వారీగా రోస్టర్ కమ్ రిజర్వేషన్లను అమలు చేయాలని పేర్కొంది. అయితే ఆ ఉత్తర్వులు కేవలం సెంట్రల్ యూనివర్సిటీలకే వర్తిస్తాయా.. రాష్ట్రాల యూనివర్సిటీలకు వర్తిస్తాయా.. వాటిని అమలు చేయాలా.. వద్దా.. అన్న గందరగోళం నెలకొంది.
ప్రత్యేక చట్టంపై కేంద్రం దృష్టి
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కూడా మొదట్లో నియామకాలపై కొంత అయోమయంలో పడినా యూనివర్సిటీల వారీగా అమలు కోసం ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంది. అయితే ఆ తీర్పు వచ్చేందుకు సమయం పట్టనున్న నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక చట్టం తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఒకవేళ ఆ ప్రత్యేక చట్టం తెచ్చి నియామక నిబంధనలు జారీ చేసినా, రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో నియామకాలు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలు పూర్తయ్యాక నోటిఫికేషన్లు జారీ చేసే వెసులుబాటున్నా ప్రస్తుతం యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లు రిటైర్‌మెంట్ సమయంలో నోటిఫికేషన్లను జారీ చేయకపోవచ్చన్న వాదనలు వ్యక్తమవుతోన్నాయి. ఆ తర్వాత కొత్త వైస్ చాన్స్‌లర్లు వచ్చి నియామకాల ప్రక్రియను చేపట్టేందుకే కనీసంగా నాలుగైదు నెలల సమయం పడుతుందని, అప్పటివరకు నియామకాలుండే పరిస్థితి కనిపించడం లేదని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
అధ్యాపకుల భర్తీకి అన్నీ ఆటంకాలే!
Published Thu, Dec 27 2018 2:44 AM | Last Updated on Thu, Dec 27 2018 2:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment