సాక్షి, అమరావతి: ఇంగ్లిష్ మీడియం జీవోల రద్దుపై హైకోర్టు జడ్జిమెంట్ కాపీ చూశాక అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును విజయంగానో, అపజయంగానో చూడొద్దన్నారు. ఇంగ్లిష్ మీడియం అమలు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ చెబుతూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం చాలా బాధాకరమన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..
► వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం అమలు చేయాలని, ఆ తర్వాత ఒక్కో తరగతికి పెంచుకుంటూ పదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో చదువులు చెప్పాలని సీఎం వైఎస్ జగన్ ఆలోచన చేశారు.
► ఇదే అంశంపై అన్ని పాఠశాలల్లోని పేరెంట్స్ కమిటీలు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాయి. చిత్తూరు జిల్లా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా 90 శాతం పేరెంట్స్ కమిటీలు తీర్మానం చేశాయి.
► ఆంగ్ల మాధ్యమంపై అసెంబ్లీలో చర్చించాం. మొదట ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యతిరేకించినా, ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆయన కూడా స్వాగతించారు. ఇప్పుడు హైకోర్టు అభ్యంతరం చెప్పిందని చంద్రబాబు, టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేయడం చూస్తుంటే వారి ఆలోచన ఏమిటో అర్థమైంది.
► బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవడం, ఆంగ్ల మాద్యమంలో విద్యనభ్యసించడం టీడీపీకి ఇష్టం లేదు.
► తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ.. అన్ని భాషల్లో ప్రాథమిక విద్యను అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు ఇప్పటికే లక్ష మంది టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చాం. బ్రిడ్జి కోర్సులు ప్రవేశ పెడుతున్నాం. సీఎం ఇచ్చిన మాటను తప్పక నెరవేరుస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇచ్చిన మాట కోసం సీఎం ఎంత దూరమైనా వెళ్తారు.
న్యాయ పోరాటం చేస్తాం
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఒకటో తరగతి నుంచే పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే తరగతులు నిర్వహిస్తున్నాయి. ఈ దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బడుగు, బలహీన వర్గాల పిల్లలకు పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన ఇంగ్లిష్ చదువు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయాన్ని నిలిపివేయడం వల్ల ఆయా వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. బడుగు, బలహీన వర్గాల ప్రతినిధిగా çసుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ వేసి ఆంగ్ల మాధ్యమం కోసం న్యాయ పోరాటం చేస్తాం.
– వై.కోటేశ్వరరావు (వైకే), హైకోర్టు సీనియర్ న్యాయవాది, సామాజిక న్యాయ కేంద్రం కన్వీనర్
ఆంగ్ల మాధ్యమంతోనే పేదలకు న్యాయం
ఇంగ్లీష్ మీడియంతోనే ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్న పేద కుటుంబాల్లోని విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం అందుబాటులో ఉంటుందని ఎంతో సంతోషించాం. హైకోర్టు తీర్పుతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాము. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలి. ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాల విద్యార్ధులకు ఆంగ్ల మాధ్యమంతో న్యాయం జరిగేలా చూడాలి.
– సామల సింహాచలం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు
ఆంగ్ల మాధ్యమం ఎంతో మేలు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడాన్ని మా సంఘం తొలి నుంచి సమర్థిస్తూ వస్తోంది. గతంలో మున్సిపల్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ఐచ్ఛికంగా అమలు చేశారు. పిల్లల తల్లిదండ్రులలో అవగాహన కల్పించడంతో మంచి స్పందన వచ్చింది. కొన్ని వామపక్ష టీచర్ల సంఘాలు ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకించినా, మునిసిపల్ టీచర్ల ఫెడరేషన్ మాత్రమే పట్టుపట్టి అమలు చేయించింది. మునిసిపల్ స్కూళ్లలో 90 శాతం ఇంగ్లిష్ మీడియంలోనికి మార్చగలిగాము.
– ఎస్.రామకృష్ణ, అధ్యక్షుడు, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్
ఇది ప్రతిపక్షాల కుట్రే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేద, బడుగు, బలహీన వర్గాల వారి పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో చదువులు అందించాలన్న సంకల్పంతో 81, 85 జీవోలు తీసుకొచ్చారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక ఆర్టీఈ చట్టంలోని కొన్ని లొసుగులను ఆధారం చేసుకుని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. ఇలా ఆంగ్ల మాధ్యమం అమలు కాకుండా అడ్డుకోవడం దారుణం. ఇది పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువులను దూరం చేయడమే.
– గిరిప్రసాదరెడ్డి, మల్లు శ్రీధర్ రెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
పేదలకు న్యాయం చేయాలి
ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నిరుపేద విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుంటున్నారు. వారికి ఆంగ్ల మాధ్యమం అందకుండా పోవడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి అయినా పేదలకు న్యాయం చేకూర్చాలి. ఎలాగైనాసరే వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకొవాలి.
– చేబ్రోలు శరత్ చంద్ర, పర్రె వెంకటరావు, బహుజన టీచర్స్ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
Comments
Please login to add a commentAdd a comment