సాక్షి, హైదరాబాద్: గురుకుల టీచర్ పోస్టుల భర్తీని నిబంధనల ప్రకారమే చేపట్టామని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీలో మెరిట్ అభ్యర్థులకు ఓపెన్ కోటాలో పోస్టింగ్‌లు ఇవ్వకుండా, లోకల్ కోటాలో పోస్టింగ్‌లు ఇచ్చారని, దానివల్ల లోకల్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆరోపించిన నేపథ్యంలో టీఎస్‌పీఎస్పీ స్పందించింది. శుక్రవారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వచ్చిన కృష్ణయ్యకు పోస్టింగ్‌లకు సంబంధించి వివరాలను కమిషన్ సభ్యుడు సి.విఠల్, కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. భర్తీలో ఎలాంటి తప్పిదాల్లేవని వారు స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు చేయొద్దని కృష్ణయ్యకు సూచించారు. దానివల్ల కమిషన్ ప్రతిష్ట దెబ్బతింటుందని పేర్కొన్నారు.
ఆప్షన్ల ప్రకారమే భర్తీ..: ఐదు సొసైటీలకు సంబంధించిన పోస్టులను ఒకే పరీక్ష ద్వారా భర్తీ చేసినపుడు, అన్నింటికీ కామన్ మెరిట్ తీసి, అభ్యర్థుల నుంచి తీసుకున్న ఆప్షన్ల ప్రకారమే పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. కొందరు అభ్యర్థులు కోరుకున్న సొసైటీల్లో, కోరుకున్న జోన్‌లో, కోరుకున్న ఏజెన్సీ– నాన్ ఏజెన్సీ, బాలిక–బాలుర విద్యా సంస్థలను పరిగణనలోకి తీసుకొని వారికి లోకల్ కేటగిరీలో పోస్టులు కేటాయించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
ఓపెన్ కేటగిరీలో వారు కోరుకున్న (ఆప్షన్లు ఇచ్చిన ప్రకారం) పోస్టులను వారికంటే మెరిట్‌లో ఉన్న వారికి కేటాయించడం వల్ల ఆ కొంతమంది అభ్యర్థులకు లోకల్ కేటగిరీలో పోస్టులను కేటాయించాల్సి వచ్చిందన్నారు. ఇవన్నీ రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి ప్రభుత్వం జారీ చేసిన జీవో 8, జీవో 124, 763 ప్రకారమే చేశామని స్పష్టం చేశారు. స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 22, 22ఏ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్, మహిళ రిజర్వేషన్ అమలు చేస్తూ పోస్టింగ్‌లు ఇచ్చామన్నారు. అదికూడా మెరిట్ వారికి ఓపెన్ కేటగిరీలో పోస్టుల్లేకపోతే లోకల్ కేటగిరీలో పోస్టులు ఇవ్వాలని, మల్టిపుల్ కేడర్ రిక్రూట్‌మెంట్ చేసినపుడు అభ్యర్థుల ఆప్షన్లు తీసుకొని భర్తీ చేయాలని రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా జారీ చేసిన జీవో 763లో స్పష్టంగా ఉందని వివరించారు.
నిబంధనల ప్రకారమే గురుకుల పోస్టుల భర్తీ
Published Sat, May 12 2018 2:44 AM | Last Updated on Sat, May 12 2018 2:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment