ధర్నాలో పాల్గొన్న ఆర్.కృష్ణయ్య తదితరులు
హైదరాబాద్: టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి 18 నెలలు గడిచినా ఇప్పటి వరకు తుది ఫలితాలు ప్రకటించకుండా నిరుద్యోగుల జీవితాలతో టీఎస్‌పీఎస్సీ చెలగాటం ఆడుతోందని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. వెంటనే తుది ఫలితాలు ప్రకటించాలని, లేదంటే వేలాది మంది నిరుద్యోగులతో టీఎస్‌పీఎస్సీ భవంతిని ముట్టడిస్తామని హెచ్చరించారు. టీఆర్‌టీ నోటిఫికేషన్ భర్తీలో జరుగుతోన్న జాప్యాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం, టీఆర్‌టీ నిరుద్యోగుల ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ 8,792 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా 4 నెలల్లో పూర్తి కావాల్సిన రిక్రూట్‌మెంట్ ప్రక్రియ 18 నెలలు గడుస్తున్నా పూర్తి కావడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 45 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా.. కేవలం 8,792 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు. వీటికి కూడా పోస్టింగ్ ఇవ్వకుండా కోర్టు కేసుల సాకుతో ఫైనల్ లిస్టు పెట్టకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఫైనల్ సెలక్షన్ జాబితాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ నాయకులు గుజ కృష్ణ, నీల వెంకటేశ్, దాసు సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment