కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్‌కు వినతిపత్రం అందజేస్తున్న అమృతాసాగర్, నాయకులు
జనగామ : రాష్ట్రంలో నిరుద్యోగ యువతీయువకులకు మంచి రోజులు వస్తాయని నమ్మబలికి.. గెలిచి గద్దెనెక్కిన తర్వాత మొడిచేయి చూపిన సీఎం కేసీఆర్ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కె.అమృతాసాగర్ అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట గురువారం ‘నిరుద్యోగ ధర్నా’ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం నుంచి 500 మందితో ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
లోనికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకుని గేట్లు మూసి వేశారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అమృతాసాగర్ మాట్లాడుతూ లక్ష ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన కేసీఆర్.. నాలుగేళ్లలో 12 వేలు మాత్రమే భర్తీ చేశారని ఆరోపించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున 2016లో గ్రూప్–2, గురుకుల నోటిఫికేషన్లను వేసినట్టే వేసి.. అభ్యర్థులను న్యాయస్థానాల చుట్టూ తిప్పుకుంటున్నారని మండిపడ్డారు.
మొక్కుబడి నోటిఫికేషన్లతో కాలయాపన తప్ప నిరుద్యోగులకు చేసింది శూన్యమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మొసలి కన్నీరు కార్చిన కేసీఆర్.. స్వరాష్ట్రంలో అంతకు రెట్టింపు వివక్ష చూపిస్తున్నారని దుయ్యబట్టారు. దివంగత ముఖ్యమంత్రి హయాంలో తెలంగాణ సుఖశాంతులతో ఉంటే, ఇప్పుడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో ముందున్న వారికి ఈ ప్రభుత్వంలో తీరని అన్యా యం జరుగుతోందన్నారు. నిరుద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
నిరాశలో నిరుద్యోగులు : కళ్యాణ్
నిరుద్యోగులు నిరాశలో మునిగి పోయారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్యాణ్‌రాజ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ వివిధ కేటగిరీల్లో న్యాయపరమైన చిక్కులను తొలగించి, పోటీ పరీక్షలు రాసిన అభ్యర్థుల ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జూలై 25న జిల్లా వ్యాప్తంగా అన్ని మం డల కేంద్రాల్లో ఉద్యోగ ధర్నా నిర్వహించామని చెప్పారు. అంతకుముందు పలు వురు కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఎస్సై పరమేశ్వర్ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు.
అనంతరం కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. అంతకు ముందు సాక్షర భారత్ కోఆర్డినేటర్లు, గ్రామ పంచాయతీ కార్మికుల దీక్షలకు అమృతాసాగర్ సంఘీభావం ప్రకటించారు.
కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కేసరి సాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరబోయిన సమ్మయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మానెగల్ల మంజుల, జిల్లా ప్రధాన కార్యదర్శి భిక్షపతి, జిల్లా సంయుక్త కార్యదర్శి కంతి చిరంజీవి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రామిండ్ల ఐలయ్య, జిల్లా యూత్ అధ్యక్షుడు బక్క జంపన్న, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు చిన్నపాగ వెంకటరత్నం, కల్లెపు ప్రవీణ్ కుమార్, నోముల జయపాల్‌రెడ్డి, జనగామ మండల మహిళా అధ్యక్షురాలు వసంత, యూత్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్ ఆధ్వర్యంలో బచ్చన్నపేట మండలానికి చెందిన యువకులు పార్టీలో చేరారు. అమృతాసాగర్ కండువా కప్పి స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment