ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేరింతలు
కోహిమా: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని ఫలితం. శనివారం ఉదయం నుంచి నువ్వా?నేనా? అన్నట్లు సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ రేకెత్తించి, చివరికి ప్రధాన పక్షాల మధ్య సమంగా ముగిసింది. ఏ పార్టీ, కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభించక అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్), బీజేపీ–నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ(ఎన్‌డీపీపీ) కూటము లు చెరో 29 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసినా, అందులో బీజేపీ భాగస్వామిగా చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఎన్‌డీపీపీతో ఎన్నికల ముందస్తు పొత్తు పెట్టుకున్న బీజేపీ..అంతకు ముందు ఎన్‌పీఎఫ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం గమనార్హం. ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. ఎన్‌డీపీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నేఫియూ రియో ఉత్తర అంగామి 2 స్థానం నుంచి ఏకగ్రీవంగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, ఎన్‌పీఎఫ్ చీఫ్ టీఆర్ జెలియాంగ్ 5,432 ఓట్ల తేడాతో పెరెన్ స్థానం నుంచి గెలుపొందారు. బీజేపీ 20 స్థానాల్లో, మిత్ర పక్షం ఎన్‌డీపీపీ 40 స్థానాల్లో పోటీచేశాయి. 60 సీట్లున్న నాగాలాండ్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజారిటీ 31 కాగా, ఆ మార్కును ఏ పార్టీ, కూటమి చేరుకోలేక పోయింది.
బీజేపీకి ఎన్‌పీఎఫ్ ఆహ్వానం..
తమతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని బీజేపీని సీఎం టీఆర్ జెలియాంగ్ ఆహ్వానించారు. ఎన్నికలకు కొంతకాలం ముందే బీజేపీ ఎన్‌పీఎఫ్‌తో తెగతెంపులు చేసుకుని, నేఫియూ రియో నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన ఎన్‌డీపీపీతో జట్టుకట్టింది. ఇతర పార్టీలతో కలసి నాగాలాండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జ్ కిరణ్ రిజిజు వెల్లడించారు. నాగాలాండ్ అసెంబ్లీకి ఒక్క మహిళ కూడా ఎన్నికకాలేదు. బరిలో నిలిచిన ఐదుగురు మహిళా అభ్యర్థులు ఓటమిపాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment