naga peoples front
-
‘ఈశాన్యం’లో కాషాయం
గత సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదంతో అధికారంలోకొచ్చింది. ఆ తర్వాత కొన్ని మినహాయింపులతో ఆ పనిలో విజయవంతమవుతూనే ఉంది. కానీ సీపీఎం విషయంలో అలాంటి నినాదమేదీ ఇవ్వకుండానే త్రిపురలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీని తుడిచిపెట్టింది. త్రిపురలో 60 స్థానాల్లో 59 సీట్లకు ఎన్నికలు జరగ్గా బీజేపీకి 35 లభించాయి. ఆ పార్టీ కూటమిలోని ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ)కి వచ్చిన 8 సీట్లు లెక్కలోకి తీసుకుంటే కూటమి బలం 43 అవుతుంది. సుదీర్ఘకాలం నుంచి ఆ రాష్ట్రాన్నేలుతున్న సీపీఎం 16 సీట్లతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. 60 సీట్లున్న మేఘాలయలో అత్యధి కంగా... అంటే 21 స్థానాలొచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఆవిర్భవించినా ఆ పార్టీకి అధి కారం దక్కకుండా చేయడంలో బీజేపీ కృతకృత్యమైంది. అక్కడ నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) బీజేపీ ఆశీస్సులతో మంగళవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబో తోంది. 60 స్థానాలున్న నాగాలాండ్‌లోనూ అదే పరిస్థితి. అక్కడ ఇంతవరకూ పాల కపక్షంగా ఉన్న నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్)కు 27 స్థానాలు లభించి అతి పెద్ద పార్టీగా ఉన్నా 17 స్థానాలు వచ్చిన నాగాలాండ్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)యే 12 స్థానాలున్న బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబో తోంది. ఎన్నికల ముందు బీజేపీ ఎన్పీఎఫ్తో ఉన్న పదిహేనేళ్ల చెలిమిని విడిచి ఎన్డీ పీపీతో జట్టు కట్టింది. తాజా ఎన్నికల తర్వాత ఈశాన్యంలో ఒక్క మిజోరం తప్ప మిగిలినచోట్ల కాంగ్రెస్ కనుమరుగైంది. క్రైస్తవ మత ప్రాబల్యం అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడటం, పైగా పాతికేళ్లుగా సీపీఎం ఏలు తున్న త్రిపురను సైతం తన ఖాతాలో వేసుకోవడం అసాధారణమే. త్రిపురలో ఇంతవరకూ ఒకే ఒక్క స్థానం ఉన్న బీజేపీకి ఒక్కసారిగా 35 స్థానాలు రావడం, ఆ పార్టీతో కలిసి పోటీచేసిన ఐపీఎఫ్‌టీకి 8 రావడం సాధారణ విషయం కాదు. అయితే ఓట్ల శాతం రీత్యా చూస్తే బీజేపీ, సీపీఎంల మధ్య పెద్ద తేడా లేదు. బీజేపీకి 43 శాతం ఓట్లు లభిస్తే సీపీఎంకు 42.7 శాతం వచ్చాయి. ఇన్నాళ్లనుంచీ సీపీఎంకు గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ తన ఓట్ల శాతాన్ని కోల్పో నట్టయితే బహుశా బీజేపీకి ఇక్కడ విజయం సాధ్యమయ్యేది కాదు. కానీ 2013లో 36.5శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్ ఈసారి 1.5 శాతానికి పడిపోయింది. 34 ఏళ్లపాటు ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన పశ్చిమబెంగాల్లో సీపీఎం అధికారం కోల్పోయి ఏడేళ్లవుతోంది. దానికి త్రిపుర కూడా ఇప్పుడు తోడైంది. ఇక అయిదేళ్లకో సారి పాలక పక్షాన్ని మార్చే అలవాటున్న కేరళ మాత్రమే ప్రస్తుతం సీపీఎం నేతృ త్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) చేతిలో ఉంది. సుదీర్ఘకాలం అధికా రంలో ఉండటం ఏ పార్టీకైనా బలమూ, బలహీనత కూడా. బలం ఎందుకంటే– ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలతో పార్టీ ప్రజలకు చేరువ కావొచ్చు. పలుకుబడిని పెంచుకోవచ్చు. సంస్థాగతంగా పటిష్టం కావొచ్చు. అయితే అదే సమయంలో పార్టీ శ్రేణుల్లో నిర్లిప్తత గూడుకట్టుకుంటుంది. ధీమా ఏర్పడుతుంది. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతున్నదో పైనున్న నాయకత్వానికి అందకుండా పోతుంది. కేరళ వంటి రాష్ట్రాల్లో పార్టీ నాయకత్వమూ, శ్రేణులూ కూడా నిరంతర జాగురూకతతో ఉంటారు. ఎక్కడేం జరుగుతున్నదో, దాన్ని అనుకూలంగా మలుచుకొనేందుకూ లేదా అధిగ మించేందుకూ చేయాల్సిందేమిటో నిరంతరం చర్చించుకునే ప్రక్రియ కొనసాగు తుంది. త్రిపురలో 2013 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక సీటుతో, రెండు శాతంలోపు ఓట్లతో ఉన్న బీజేపీ ఈసారి సవాలు విసిరినప్పుడు సీపీఎం తేలిగ్గా తీసుకుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకొ చ్చాక ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ నిర్దిష్ట కార్యాచరణతో పనిచేస్తున్నదనీ, ముఖ్యంగా రెండేళ్లుగా వేలాదిమంది ఆరెస్సెస్ కార్యకర్తలు బీజేపీ అనుకూల వాతావరణం ఏర్ప డటానికి కృషి చేస్తున్నారని సీపీఎం శ్రేణులు సరిగా గుర్తించలేకపోయాయి. ముఖ్య మంత్రి మాణిక్ సర్కార్ వ్యక్తిగతంగా నిరాడంబరుడే కావొచ్చు... సొంతానికి ఇల్లు కూడా లేకపోవచ్చు... నిజాయతీతో కూడిన పాలన అందించి ఉండొచ్చు–కానీ రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో పాతుకుపోయిన బెంగాలీ సంస్కృతి ఆధిపత్యంపై గిరి జనుల్లో గూడుకట్టుకుంటున్న అసంతృప్తిని పసిగట్టడంలో ఆ పార్టీ విఫలమైంది. త్రిపురలో 31శాతంమంది గిరిజనులు. వారిలో ఎక్కువమంది మాట్లాడే కోక్బోరాక్ భాష కాకుండా బెంగాలీయే అధికార భాషగా, బోధనాభాషగా చలామణి కావడం ఆ అసంతృప్తికి కారణం. రెండున్నర లక్షలమంది రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందికి జీతాల విషయంలోనూ ఈ తరహా ఆగ్రహమే ఉంది. గత జూన్‌లో ప్రభుత్వం నాలుగో వేతన సంఘం సిఫార్సులు అమలు చేసిందిగానీ తాము అధికారంలోకొస్తే ఏడో వేతన సంఘం సిఫార్సులు అమలు చేస్తామని బీజేపీ ప్రకటించింది. అది అమలైతే ప్రభుత్వ సిబ్బందికి ఒక్కసారిగా రెట్టింపు వేతనం లభిస్తుంది. దీనికితోడు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య కూడా సీపీఎంకు ప్రతికూలంగా మారింది. దేశంలో అత్య ధిక నిరుద్యోగం(19.7శాతం) త్రిపురలోనే ఉంది. 2016 జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం జాతీయ సగటు కంటే త్రిపురలో ఆత్మ హత్యల రేటు కూడా అధికమే. ఎన్నికల్లో గెలుపోటములు సర్వసాధారణం. వాటినిబట్టే ఒక పార్టీ బలాన్ని లేదా బలహీనతల్ని లెక్కేయలేం. అయితే త్రిపురకూ, ఈశాన్య ప్రాంతంలోని ఇతర రాష్ట్రాలకూ తేడా ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఉండే ప్రాంతీయ పార్టీలు దాదాపుగా ఆయా ప్రాంతాల్లోని గిరిజన తెగలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. కానీ త్రిపురలో కార్యకర్తలు పునాదిగా ఉన్న పార్టీ సీపీఎం. మళ్లీ ఆ స్థాయిలో శ్రేణులున్న బీజేపీ అడుగుపెడితే తప్ప సీపీఎంను ఓడించడం మరెవరికీ సాధ్యం కాలేదు. మొత్తానికి బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో వేళ్లూనుకున్న తీరు ఆ ప్రాంతం అభివృద్ధికి ఏ స్థాయిలో తోడ్పడగలదో వేచిచూడాలి. గొడ్డు మాంసం వంటి అంశాల్లో దేశంలో ఇతరచోట్ల ఉన్నట్టు ఈశాన్యంలో వ్యవహరిస్తే బీజేపీ వ్యతిరేకత మూటగట్టుకుంటుంది. ఈ విజయంలోని పరిమితులేమిటో ఇతరుల కంటే బీజేపీకే ఎక్కువ తెలుసు. -
నాగాలాండ్‌లో ఉత్కం‘టై’
కోహిమా: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని ఫలితం. శనివారం ఉదయం నుంచి నువ్వా?నేనా? అన్నట్లు సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ రేకెత్తించి, చివరికి ప్రధాన పక్షాల మధ్య సమంగా ముగిసింది. ఏ పార్టీ, కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభించక అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్), బీజేపీ–నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ) కూటము లు చెరో 29 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసినా, అందులో బీజేపీ భాగస్వామిగా చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్డీపీపీతో ఎన్నికల ముందస్తు పొత్తు పెట్టుకున్న బీజేపీ..అంతకు ముందు ఎన్పీఎఫ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం గమనార్హం. ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. ఎన్డీపీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నేఫియూ రియో ఉత్తర అంగామి 2 స్థానం నుంచి ఏకగ్రీవంగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, ఎన్పీఎఫ్ చీఫ్ టీఆర్ జెలియాంగ్ 5,432 ఓట్ల తేడాతో పెరెన్ స్థానం నుంచి గెలుపొందారు. బీజేపీ 20 స్థానాల్లో, మిత్ర పక్షం ఎన్డీపీపీ 40 స్థానాల్లో పోటీచేశాయి. 60 సీట్లున్న నాగాలాండ్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజారిటీ 31 కాగా, ఆ మార్కును ఏ పార్టీ, కూటమి చేరుకోలేక పోయింది. బీజేపీకి ఎన్పీఎఫ్ ఆహ్వానం.. తమతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని బీజేపీని సీఎం టీఆర్ జెలియాంగ్ ఆహ్వానించారు. ఎన్నికలకు కొంతకాలం ముందే బీజేపీ ఎన్పీఎఫ్తో తెగతెంపులు చేసుకుని, నేఫియూ రియో నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీపీపీతో జట్టుకట్టింది. ఇతర పార్టీలతో కలసి నాగాలాండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ ఇన్చార్జ్ కిరణ్ రిజిజు వెల్లడించారు. నాగాలాండ్ అసెంబ్లీకి ఒక్క మహిళ కూడా ఎన్నికకాలేదు. బరిలో నిలిచిన ఐదుగురు మహిళా అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. -
తొలిసారి ఐదుగురు మహిళల పోటీ
సాక్షి, న్యూఢిల్లీ : నాగాలాండ్ అసెంబ్లీకి ఈనెల 27న జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి ఐదుగురు మహిళలు పోటీ చేస్తున్నారు. అసెంబ్లీలోని మొత్తం 60 సీట్లకుగాను 2.56 శాతం సీట్లకే మహిళలు పోటీ పడుతున్నారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే ఎక్కువ సంఖ్యలో మహిళలు పోటీ చేయడం కూడా ఇదే మొదటిసారి అంటే ఆశ్చర్యం కలగకమానదు. నేషనల్ పీపుల్స్ పార్టీ నుంచి ఇద్దరు, కొత్తగా ఏర్పాటైన నేషనలిస్ట్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ నుంచి ఒకరు, భారతీయ జనతా పార్టీ నుంచి ఒకరు పోటీ చేస్తుండగా, మరొకరు స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని నిరాటంకంగా పాలిస్తున్న నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి ఒక్క మహిళ కూడా పోటీ చేయక పోవడం కూడా ఆశ్చర్యకరమే. 1963లో నాగాలాండ్ ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు 19 మంది మహిళలు పోటీ చేయగా, ఇంతవరకు ఒక్కరు కూడా విజయం సాధించలేదు. ఇంతవరకు నాగాలాండ్ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికల్లో పోటీచేసి ఒకే ఒక మహిళ విజయం సాధించారు. 1977లో యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేసి రానో ఎం సాయిజ్ విజయం సాధించారు. ఆ పార్టీకి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన మొదటి మహిళ కూడా ఆమెనే. ఆమే ప్రముఖ నాగా వేర్పాటువాద నాయకుడు ఏజెడ్ పీజో మేనకోడలు. ఆమె 2015లో మరణించారు. మగవారితో సమానంగా ప్రత్యర్థి సైనికులతో పోరాడడమే కాకుండా తెల్లవారక ముందే కొండ కోనల్లో కష్టమైన పనులకు వెళ్లే అలవాటు, సామాజిక సంస్థల్లో క్రియాశీలక పాత్ర వహించే నాగా మహిళలు ఎన్నికల పట్ల అంతగా ఆసక్తి చూపక పోవడం, ఎన్నికల్లో రాణించక పోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఒక్క నాగాలాండ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా అసెంబ్లీలలో మహిళ ప్రాతినిధ్యం తొమ్మిది శాతం దాటడం లేదు. గతేడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మొత్తం 4,800 మంది పోటీ చేయగా, 446 మంది మహిళలు, పంజాబ్‌కు 1145 మంది పోటీ చేయగా, వారిలో 81 మంది, ఉత్తరాఖండ్‌కు 637 మంది పోటీ చేయగా, వారిలో 58 మంది, గోవాకు 250 మంది పోటీ చేయగా, వారిలో 18 మంది, మణిపూర్‌కు 266 మంది పోటీ చేయగా, వారిలో 11 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అస్సాం, త్రిపుర ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి ఫర్వాలేదు. ఈ రెండు రాష్ట్రాల్లో ఎనిమిది శాతం మంది మహిళలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2013లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే నాగాలండ్‌లో కూడా పోటీచేసే మహిళల సంఖ్య 1.6 శాతం నుంచి 2.5 శాతానికి పెరిగింది. ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లను కల్పిస్తే వారి ప్రాతినిథ్యం పెరుగుతుందని వాదించేవారు లేకపోలేదు. నాగాలాండ్‌లో గతేడాది ప్రాంతీయ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించినప్పుడు పెద్ద గొడవ జరిగింది. అది హింసకు దారితీయడమే కాకుండా రాష్ల్రముఖ్యమంత్రి రాజీనామా చేసే వరకు వెళ్లింది. ఒక్క మహిళలే రిజర్వేషన్లనే కాదు, అన్ని రకాల రిజర్వేషన్లకు నాగాలాండ్ ఆదివాసీ తెగలు వ్యతిరేకం. ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలన్న విషయాన్ని కూడా ఎక్కువగా స్థానిక సంఘాలే నియమిస్తాయి. కనుక మహిళల ప్రాతినిధ్యం తక్కువగానే ఉంటోంది. -
బీజేపీకి గట్టి షాకిచ్చిన మిత్రపక్షం
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి పెద్ద షాక్ తగిలింది. మిత్రపక్షం నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్) ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మణిపూర్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎన్పీఎఫ్ తన మద్ధతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించుకోగా.. బీజేపీ ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ‘త్వరలోనే ఈ నిర్ణయాన్ని ప్రజల సమక్షంలో ప్రకటిస్తాం’అని ఆదివారం ఎన్పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మురంగ్ ముకంగా ప్రకటించారు. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లు ఉండగా.. బీజేపీకి 31 మంది ఎమ్మెల్యేలు(వీరిలో 9 మంది కాంగ్రెస్ నుంచి, ఒకరు ఏఐటీసీ నుంచి ఫిరాయించిన వారు), ఎన్పీఎఫ్ తరపున నలుగురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్ధతు ఇస్తున్నారు. ఈ పరిస్థితులలో ఎన్పీఎఫ్ గనుక మద్ధతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు ఎదురుకావొచ్చు. ఇక ఆ మధ్య ఓ బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ ప్రసంగిస్తూ... నలుగురు ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేరాలంటూ పిలుపునిచ్చారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్పీఎఫ్ బిరెన్‌పై విరుచుకుపడింది. ‘మమల్ని చులకన చేసిన వారితో ఇంకా కొనసాగటం సరికాదు.. మద్ధతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించాం’ అని ఎన్పీఎఫ్ పేర్కొంది. ఈ పరిణామాల అనంతరం ఎన్పీఎఫ్ నేతలు ఒక్కోక్కరుగా బీజేపీ ప్రభుత్వంపై అవినీతి విమర్శలు చేయటం ప్రారంభించారు కూడా. ఫిబ్రవరి 27 నాగాలాండ్ ఎన్నికల తర్వాత బీజేపీతో తెగదెంపులపై ఎన్పీఎఫ్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. -
నాగాలాండ్‌లో ఎవరిది విజయం?
సాక్షి, న్యూఢిల్లీ : నాగాలాండ్‌లో అతిపెద్ద నగరమైన దిమాపూర్‌కు వెళితే అక్కడ రోడ్డు పక్కన మూడంతస్తుల భవనం, ఆ భవనంపై ‘నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ’ అని రాసి ఉన్న బ్యానర్ కనిపిస్తుంది. అదే బ్యానర్‌పైన కొంత చిన్న అక్షరాలతో ‘ప్యాక్టా నాన్ వెర్బా’, అంటే మాటలు కాదు, చేతలు అనే నినాదం కనిపిస్తుంది. ఆ భవనంలోకి వెళ్లి చూస్తే మెల్లగా మాట్లాడుకుంటున్న ఓ గుంపు మినహా మొత్తమంతా ప్రశాంతంగా కనిపిస్తోంది. మరో గదిలోకి వెళ్లే ముందు ఎంతో క్రమశిక్షణ కలిగిన రిసెప్షన్ డెస్క్ ఆహ్వానిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకున్న పార్టీకి అది ప్రధాన కార్యాలయం. ఆ పార్టీకి ప్రాణం పోసిన నాయకుడు నైఫ్యూ రియో వచ్చినప్పుడు మాత్రం పార్టీ కార్యాలయం సందడిగా ఉంటుంది. ఆయన మామూలు నాయకుడు కాదు. వరుసగా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎన్నిక 11 ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగిన వ్యక్తి. మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు రియో ఏడాదికే తన పదవికి రాజీనామాచేసి ఎంపీగా పార్లమెంట్‌కు వెళ్లారు. అక్కడ కేంద్ర కేబినెట్ పదవిని ఆశించి అది అందక పోవడంతో వెనుతిరిగా రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. నాగాలాండ్ పాలకపక్ష ‘నాగా పీపుల్స్ ఫ్రంట్’లో కొనసాగిన రియో గత మే నెలలోనే నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ’ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొత్త పార్టీపై పెద్దగా దృష్టి పెట్టకుండా, నాగా పీపుల్స్ ఫ్రంట్‌లో కొనసాగుతూ వచ్చారు. గత ఏడాది కాలంగా ఢిల్లీకే పరిమితమై అక్కడి బీజేపీ నాయకులతో ఎడతెరపి లేకుండా చర్చలు జరిపిన రియో గత జనవరి నెలలోనే నాగాలాండ్‌కు వచ్చి నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పారు. సొంత పార్టీ అయిన ‘నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ’ అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించారు. ఇంతలో నాగా అసెంబ్లీకి ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అప్పటి నుంచి నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి రియో పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. గత శుక్రవారం నాడు ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు రియో పార్టీ, బీజేపీ పార్టీలు ప్రకటించాయి. అప్పటి నుంచి వలసలు మరీ ఊపందుకున్నాయి. నాగా అసెంబ్లీలోని 60 సీట్లకుగాను 40 సీట్లకు రియో పార్టీ, మిగతా 20 సీట్లకు బీజేపీ పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. నాగా పీపుల్స్ ఫ్రంట్ నాయకత్వంలోని ‘డెమోక్రటిక్ అలయెన్స్ ఆఫ్ నాగాలాండ్’కు రియో పార్టీ, బీజేపీ కూటమికి మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2015 నుంచి ప్రతిపక్షమే లేకుండా నడుస్తున్న నాగా అసెంబ్లీలో మళ్లీ ప్రతిపక్షం ప్రత్యక్షం కానుంది. డెమోక్రటిక్ అలయెన్స్ ఆఫ్ నాగాలాండ్ ప్రభుత్వంలో మొదటి నుంచి బీజేపీ భాగస్వామిగా ఉండగా, ఎనిమిది శాసన సభ్యులను కలిగిన కాంగ్రెస్ పార్టీ కూడా అలయెన్స్‌లో చేరిపోవడంతో 2015 నుంచి ఆ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. కాంగ్రెస్, బీజేపీలో పాలకపక్షంలో చేరిన అరుదైన రికార్డు నాగాలాండ్‌కు దగ్గింది. ఇప్పుడు ఆ అలయెన్స్‌ను వీడి నాగా పీపుల్స్ పార్టీ సభ్యత్వాన్ని వదులుకొని రియో కొత్త పార్టీకి ప్రాణం పోయగా, ఎప్పటి నుంచో ఆయనతో తెరవెనక, తెర ముందు చర్చలు జరుపుతూ వస్తున్న బీజేపీ అలయెన్స్‌ను వీడి రియోతో చేతులు కలిపింది. నాగాలాండ్ శక్తివంతమైన ‘అంగామి నాగా’ తెగకు చెందిన రియో ఉత్తర అంగామి–2 నియోజక వర్గం నుంచి 2003లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి మొదటిసారి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2008, 2013లలో కూడా పోటీచేసి గెలవడమే కాకుండా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014లో డెమోక్రటిక్ అలయెన్స్ తరఫున పార్లమెంట్‌కు పోటీచేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. నాగాలాండ్‌కు ఏదైనా అభివృద్ధి జరిగిదంటే ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నుంచే అని స్థానిక ప్రజలు ఆయన గురించి చెబుతున్నారు. అభివృద్ధితోపాటు అవినీతి కూడా పెరిగిందని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. రియో ఆధ్వర్యంలో నాగాలాండ్‌లో కొత్త ప్రభుత్వ భవనాలు వచ్చిన మాట నిజమేగానీ వాటిలో అవినీతి జరగడమే కాకుండా రాష్ట్రానికి అప్పులు కూడా పెరిగాయని విమర్శకుల ఆరోపణ. ‘రియో అవినీతి పరుడు అయితే కావచ్చు. పనులు మాత్రం చేస్తార’ని సెయిరియో అనే ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నందున రియో కూటమికే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. -
నాగాలో ఎన్నికలంటే బీజేపీకి అంతే సంగతులు!
సాక్షి, న్యూఢిల్లీ : నాగాలాండ్ రాష్ట్రానికి ఫిబ్రవరి 27వ తేదీన జరుగనున్న ఎన్నికల్లో పోటీ చేయరాదని పాలకపక్ష నాగా పీపుల్స్ ఫ్రంట్, దాని మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ సహా పది రాజకీయ పార్టీలు నిర్ణయించడం, అందుకు అనుగుణంగా ఓ అంగీకార పత్రంపై సోమవారం సంతకాలు కూడా చేయడం తెల్సిందే. ఆ మరుసటి రోజే పార్టీ అధిష్టానం ఒత్తిడి మేరకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మాట మార్చింది. ఇలాంటి విషయాల్లో నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని, కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు తాము రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా రాష్ట్ర నాయకులు ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయమంటూ నిర్ణయం తీసుకున్న వివిధ పార్టీల సమావేశానికి హాజరైన ఇద్దరు బీజేపీ నేతలను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలిమ్ (ఐ–ఎం)తో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గతంలో చేసుకున్న శాంతి ఒప్పందాన్ని అమలు చేసే వరకు ఎన్నికలను వాయిదా వేయడం మంచిదని నాగాలాండ్ ట్రైబల్ హొహోస్, పౌర సంఘాల కోర్ కమిటీ పిలుపునివ్వగా సోషలిస్ట్ కౌన్సిల్ సహా పలు పార్టీలు ఆమోదం తెలిపాయి. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న నాగాల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నాగాల గ్రూపులతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం వివరాలేమిటీ ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. వాటిని అమలు చేయాలని మాత్రం అన్ని పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్రంలోని పార్టీ అధిష్టానికి నచ్చచెప్పేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఢిల్లీకి వెళుతోంది. జనవరి 31వ తేదీన ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాగా, ఎన్నికలకు నిరసనగా ఫిబ్రవరి ఒకటవ తేదీన నిర్వహించిన నాగాలాండ్ బంద్ విజయవంతమైంది. అన్ని నాగాలాండ్ పార్టీలను కాదని భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే రాష్ట్రంలో హింసాకాండ ప్రజ్వరిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలాగా రాష్ట్ర పార్టీ శాఖలపై పెత్తనం చెలాయించమని చెప్పుకునే బీజేపీ అధిష్టానం రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించకపోతే అందుకు తగిన మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. -
ఆచితూచి అడుగేయాలి
సమస్య ఎదురైనప్పుడు సకాలంలో దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించకపోతే ఉన్నకొద్దీ అది జటిలంగా మారుతుంది. ఫిబ్రవరి 27న జరిగే నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని మొన్న సోమవారం పాలక నాగా పీపుల్స్ ఫ్రంట్, బీజేపీ, కాంగ్రెస్లతోసహా 11 రాజకీయ పక్షాలు, వివిధ గిరిజన మండళ్లకు ప్రాతి నిధ్యంవహించే హోహో, ఇతర పౌర సమాజ సంస్థలు నిర్ణయించడం దీన్నే సూచిస్తోంది. ఈ ఉమ్మడి ప్రకటన నుంచి రాష్ట్ర బీజేపీ విభాగం ఆ తర్వాత తప్పుకుని, సమావేశానికి పార్టీ తరఫున వెళ్లిన ఇద్దరు నేతలను సస్పెండ్‌చేసి ఉండొచ్చుగానీ... అంతమాత్రాన పరిస్థితి తీవ్రత తగ్గదు. దాదాపు రెండున్నరేళ్ల క్రితం నాగాలాండ్ సమస్యపై కేంద్రం కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా ఎన్నికల్లోగా పరిష్కారాన్ని ప్రకటించాలన్నదే వారి ఏకైక డిమాండు. కేంద్రంలో అధికారంలోకొచ్చినవెంటనే ఎన్డీఏ ప్రభుత్వం నాగాలాండ్ సమస్యపై దృష్టి పెట్టి ఏడాది తిరగకుండానే 2015లో అక్కడి ప్రధాన మిలిటెంట్ సంస్థ నేషనల్ సోష లిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్–ఇసాక్, మ్యూవా (ఎన్ఎస్సీఎన్–ఐఎం) వర్గంతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు సర్వత్రా హర్షామోదాలు వ్యక్తమయ్యాయి. నిజాని కది పూర్తి స్థాయి ఒప్పందం కాదు. ఒప్పందానికి సంబంధించిన స్వరూపం (ఫ్రేమ్‌వర్క్) మాత్రమే. దీని ప్రాతిపదికన రాగలకాలంలో విస్పష్టమైన విధివిధానా లతో, సవివరమైన ఒప్పందం రూపొందుతుందని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రక టించింది. కానీ ఇంతకాలమైనా ఆ ఫ్రేమ్‌వర్క్‌లోని అంశాలూ బయటకు రాలేదు. ఆ ప్రాతిపదికన ఒప్పందమూ ఖరారు కాలేదు. పర్యవసానంగా ఇప్పుడీ సంక్షోభం ఏర్పడింది. నాగాలాండ్ అసెంబ్లీ మొన్న డిసెంబర్ 14న ఎన్నికలకు ముందే నాగా రాజ కీయ సమస్యకు ‘గౌరవనీయమైన, ఆమోదయోగ్యమైన’ పరిష్కారాన్ని ప్రకటించా లని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసింది. ఆ తర్వాత జనవరిలో నాగా హోహో, ఇతర పౌర సమాజ సంస్థల ప్రతినిధులు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఎన్నికలను కొద్దికాలం వాయిదా వేసి ముందుగా పరిష్కారాన్ని ఖరారు చేయాలని కోరారు. 2015 నుంచి ఇప్పటివరకూ అనేక దఫాలు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకూ, ఎన్ఎస్సీఎన్(ఐఎం) ప్రతినిధులకూ మధ్య చర్చలు జరిగినా కొలిక్కిరాని వ్యవ హారం కొన్ని రోజుల వ్యవధిలో తేలిపోతుందని అనుకోవడం సహేతుకం కాకపో యినా నాగా ప్రతినిధులకు కేంద్రం కనీసం నచ్చజెప్పే ప్రయత్నం చేయాల్సింది. ఎన్ఎస్సీఎన్–ఐఎంతో ఒప్పందం కుదిరినప్పుడు న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో స్వయంగా నరేంద్రమోదీ పాల్గొన్నారు. ‘ఇది ఒక సమస్యకు అంతం పలకడం మాత్రమే కాదు... నూతన భవిష్యత్తు దిశగా వేస్తున్న ముందడుగు కూడా...’ అని ఆ రోజు ఆయన వ్యాఖ్యానించారు. ఒప్పందానికి ముందు నరేంద్ర మోదీ కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్తోసహా వివిధ పక్షాల నాయకులతో మాట్లా డారు. దురదృష్టవశాత్తూ అనంతరకాలంలో ఒప్పందం ఖరారుకు సంబంధించిన కార్యాచరణ కనబడలేదు. నాగాలాండ్ సమస్య అత్యంత క్లిష్టమైనదనడంలో సందేహం లేదు. ఇప్పుడున్న నాగాలాండ్‌కు తోడు నాగా ప్రజలు అధికంగా నివ సించే మణిపూర్‌లోని నాలుగు జిల్లాలు, అస్సాంలోని రెండు జిల్లాలు, అరుణా చల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలూ కలిపి విశాల నాగాలాండ్ కావాలని ఎన్ఎస్సీఎన్ (ఐఎం) కోరుతోంది. అంతేకాదు... మయన్మార్‌లో నాగాలు నివసించే ఒకటి రెండు ప్రాంతాలను కూడా దీంతో విలీనం చేయాలంటున్నది. ఈ ప్రాంతాల్లో తమ జాతి ప్రజలు 12 లక్షలమంది ఉన్నారని, వారు నిత్యం వివక్షను ఎదుర్కొంటున్నారని ఎన్ఎస్సీఎన్(ఐఎం) ఆరోపిస్తోంది. నాగా ప్రజలు నివసించే ప్రాంతాలను భారత్‌లో విలీనం చేసి విశాల నాగాలాండ్ ఏర్పాటుకు సహకరించమని మయన్మార్‌ను కోరడం అసాధ్యం. వారి వరకూ ఎందుకు... అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లను ఒప్పించడం కూడా కష్టతరమైన విషయం. అందుకే ఎన్ఎస్సీఎన్(ఐఎం)తో ఒప్పందం కుదిరి నట్టు ప్రకటన వెలువడినప్పుడు అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఒప్పందం వివరాలేమిటో చెప్పాలని మణిపూర్, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల పార్టీలు, ఇతర సంస్థలు కోరినప్పుడు ఇప్పుడున్న భౌగోళిక సరిహద్దులు మారబోవని కేంద్రం హామీ ఇచ్చింది. అలా మారకుండా విశాల నాగాలాండ్ ఎలా సాధ్యమని అందరూ ఆశ్చర్యపోయారు. అటు ఎన్ఎస్సీఎన్(ఐఎం) నాయ కత్వం కూడా దీన్ని గురించి మాట్లాడలేదు. తమ దీర్ఘకాల డిమాండుకు ‘గౌర వనీయమైన పరిష్కారం’ లభించిందన్నదే వారి జవాబు. సమస్య ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ముడిపడి ఉన్నది కనుక ఆ రాష్ట్రాల సీఎంలను కూడా చర్చల్లో భాగస్వాములను చేసి ఉంటే, నాగాల డిమాండులోని సహేతుకతను వారు గుర్తించేలా చేయగలిగితే బహుశా అలాంటి ‘గౌరవనీయమైన పరిష్కారం’ సాధ్యమయ్యేదేమో. ఒప్పందం ఖరారుకు ఇంత సమయం కూడా పట్టేది కాదేమో. ప్రస్తుతం అస్సాం, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లు బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలకు చెందిన భూభాగాన్ని నాగాలాండ్‌కు ధారదత్తం చేస్తారని ఏమాత్రం అనుమానాలు తలెత్తినా అక్కడ రాజకీయంగా తీవ్ర నష్టం చవిచూడాల్సివస్తుందని బీజేపీ అగ్ర నాయకత్వానికి తెలుసు. అందుకే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఆర్ఎన్ రవికి, నాగా ప్రతినిధులకు మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న చర్చల గురించి ఎవరూ నోరుజారలేదు. బ్రిటిష్ వలస పాలకుల హయాంలో రగుల్కొని స్వాతంత్య్రా నంతరం కూడా కొనసాగుతూ దశాబ్దాలుగా ఎంతో హింసను చవిచూసిన నాగా లాండ్ విషయంలో అన్ని పక్షాలూ పట్టువిడుపులతో వ్యవహరించాలి. ఎన్నికలు సజావుగా సాగడానికి నాగాలాండ్ లోని పార్టీలనూ, సంస్థలనూ ఒప్పించేందుకు... అది సాధ్యపడకపోతే కొద్దికాలం వాటిని వాయిదా వేయడానికి కూడా కేంద్రం వెన కాడకూడదు. సమస్యపై ఒప్పందం కుదిరి, దానికి కొనసాగింపుగా చర్చలు సాగు తున్న ఈ దశలో ఎవరు మొండి పట్టుదలకు పోయినా సమస్య మళ్లీ మొదటి కొస్తుందని మరువకూడదు. -
నాగాలాండ్ కొత్త సీఎంగా లీజిత్సు
22న ప్రమాణ స్వీకారం కోహిమా: నాగాలాండ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్ పీఎఫ్) అధ్యక్షుడు షురోజీలి లీజిత్సు (81) ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సోమవారం జరిగిన డెమొక్రటిక్ అలయెన్స్ ఆఫ్ నాగాలాండ్ (డీఏఎన్) శాసనసభాపక్ష సమావేశంలో లీజిత్సును రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఎంఎల్ఏలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా లీజిత్సును గవర్నర్ పీబీ ఆచార్య ఆహ్వానించారు. పాత ముఖ్యమంత్రి జెలియాంగ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు బాధ్యత వహిస్తూ రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని జెలియాంగ్ ప్రభుత్వం నిర్ణయిచగా, దానిపై అక్కడి గిరిజన జాతుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై ప్రజలు నిరసన ఉద్యమాలు చేపడుతుండగా జనవరి 31న నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఉద్యమం మరింత తీవ్రమైంది. సీఎం తన పదవి నుంచి తప్పుకోవడంతోపాటు కాల్పులకు బాధ్యులను సస్పెండ్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. దీంతో జెలియాంగ్ రాజీనామా చేయక తప్పలేదు. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం నాగాలాండ్ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న లీజిత్సు రాజకీయ ప్రస్థానం సుమారు నాలుగు దశాబ్దాల క్రితం మొదలైంది. 1969లో కోహిమా జిల్లాలోని ఉత్తర అన్గమి–1 నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన లీజిత్సు నాగాలాండ్ తొలి ప్రాంతీయ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో విద్య, ప్రణాళిక వంటి ఎనిమిది మంత్రిత్వ శాఖలను ఆయన విజయవంతంగా నిర్వహించారు. 2013 వరకూ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన లీజిత్సు అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించారు. -
ప్రతిపక్షమే లేని రాష్ట్రానికి కొత్త సీఎం
నాగాలాండ్‌లో అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) అధినేతగా ఉన్న షుర్హోజెలీ లీజియెట్సు కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. మొత్తం 48 మంది ఎమ్మెల్యేలలో 42 మంది ఆయనకే మద్దతు పలకడంతో ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న జెలియాంగ్ నిర్ణయంపై ఒక్కసారిగా ప్రజాప్రతినిధులు తిరగబడ్డారు. వారి ఒత్తిడికి తలొగ్గిన ఆయన రాజీనామా చేయడంతో 81 ఏళ్ల లీజియెట్సు పగ్గాలు చేపట్టేందుకు ముందుకొచ్చారు. నాగాలాండ్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలుండగా.. వాటిలో 48 స్థానాలను నాగా పీపుల్స్ ఫ్రంట్ గెలుచుకుంది. మిగిలిన 12 స్థానాలు కూడా దాని మిత్రపక్షానికే రావడంతో.. అసలు అక్కడ ప్రతిపక్షం అన్నదే లేదు. 2015 సంవత్సరంలో కూడా ఒకసారి జెలియాంగ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి, నాగాలాండ్ నుంచి ఉన్న ఏకైక ఎంపీ నెయిఫియు రియో అప్పట్లో ఈ ప్రయత్నం చేసి, తాను సీఎం అవ్వాలనుకున్నారు గానీ కుదరలేదు. ఈసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనుకున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం లీజియెట్సును తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆయన కూడా ఎన్పీఎఫ్ నేతృత్వంలోని డెమొక్రాటిక్ అలయెన్స్ ఆఫ్ నాగాలాండ్ (డాన్)కు నేతృత్వం వహించేందుకు అంగీకరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించకుండా.. పరిపాలనను పునరుద్ధరించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. -
నాగాలాండ్ సీఎంగా జెలియాంగ్ ప్రమాణ స్వీకారం
కోహిమా: నాగాలాండ్ నూతన ముఖ్యమంత్రిగా నాగా పీపుల్స్ ఫ్రంట్ నేత టి.ఆర్.జెలియాంగ్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులతో గవర్నర్ అశ్వనికుమార్ కోహిమాలోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. నాగాలాండ్ లోక్‌సభ స్థానం నుంచి నిఫూ రియో విజయం సాధించటంతో ముఖ్యమంత్రి శుక్రవారం పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. ఆయనకు కేంద్రంలో నరేంద్రమోడీ మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. నరేంద్ర మోడీ శుభాకాంక్షలు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జెలియాంగ్కు కాబోయే ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రయాణించేందుకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. -
నాగాలాండ్ కొత్త సీఎం జెలియాంగ్
కోహిమా: నాగాలాండ్ నూతన ముఖ్యమంత్రిగా నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) నేత టి.ఆర్. జెలియాంగ్ శుక్రవారం నియమితులయ్యారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో నాగాలాండ్ లోక్‌సభా స్థానం నుంచి విజయం సాధించిన ప్రస్తుత ముఖ్యమంత్రి నిఫూ రియో శుక్రవారం సీఎం పదవికి, శాసనసభా స్థానానికి రాజీనామా చేయడంతో జెలియాంగ్‌ను గవర్నర్ అశ్వనీకుమార్ కొత్త సీఎంగా నియమించారు. శనివారం జెలియాంగ్, ఆయన మంత్రివర్గంతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేసే ఉద్దేశంతో పార్లమెంట్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్న నిఫూ రియోను ప్రజలు 4 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిపించారు -
‘ఉచితం’పై ఏకాభిప్రాయం!
సంపాదకీయం: చాలాకాలం తర్వాత సిద్ధాంతాలకూ, దృక్పథాలకూ అతీతంగా రాజకీయ పక్షాలన్నీ ఒకే స్వరాన్ని వినిపించాయి. దేశ భద్రతకు ముప్పువాటిల్లే సందర్భాలు ఏర్పడినప్పుడు మినహా మిగిలిన సమయాల్లో దాదాపు మృగ్యమైపోయిన ఏకీభావం ఈ పార్టీలన్నిటిమధ్యా వ్యక్తమైంది. ఎన్నికల సమయంలో పార్టీలు ఓటర్లకు చేసే ‘ఉచిత’ వాగ్దానాల విషయమై ఎన్నికల సంఘం సోమవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఒకటి, రెండు పార్టీలు మినహా అన్నీ ఏకాభిప్రాయాన్ని వెలిబుచ్చాయి. ఏ పార్టీకైనా అలాంటి వాగ్దానాలు చేసే హక్కుంటుందని, అందులో ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, మరే ఇతర సంస్థ జోక్యం అంగీకరించబోమని స్పష్టంచేశాయి. ఆరు జాతీయ పార్టీలూ, 24 ప్రాంతీయపార్టీలూ పాల్గొన్న ఈ సమావేశంలో జాతీయ పార్టీ అయిన బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఒక్కటే భిన్నంగా స్పందించగా, నాగా పీపుల్స్ ఫ్రంట్, మిజో నేషనల్ ఫ్రంట్ దానితో గొంతు కలిపాయి. కొన్ని పార్టీలు చేసే వాగ్దానాలు ఓటర్లను ప్రలోభపెట్టడం వాస్తవమేనని, ఈ పరిస్థితి ఎన్నికల క్షేత్రంలో పార్టీలకు ఉండాల్సిన సమానావకాశాలను దెబ్బతీస్తున్నదని ఈ మూడు పార్టీలూ ఆరోపిస్తున్నాయి. ‘ఉచిత’ హామీలను నియంత్రించేలా మార్గదర్శకాలను రూపొందించాలని గత నెలలో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇలాంటి హామీలవల్ల ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలన్న స్ఫూర్తి దెబ్బతింటున్నదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఎన్నికల సంఘం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో బీఎస్పీ ఒక్కటే భిన్న స్వరం వినిపించడానికి కారణం ఉంది. గత ఏడాది జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఇచ్చిన ఇలాంటి హామీల కారణంగానే తాను ఓడిపోయానని బీఎస్పీ భావిస్తోంది. మరి సమాజ్‌వాదీ చేసిన వాగ్దానాలు అలాంటివి! వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మద్దతు ధర వచ్చేలా చేయడం దగ్గరనుంచి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్ధులకు ల్యాప్‌టాప్‌లు, మెట్రిక్ ఉత్తీర్ణులైనవారికి ట్యాబ్‌లు, అర్హులైన నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయల భత్యం, రైతుల రుణాల మాఫీ, ఉచిత విద్యుత్ వంటివెన్నో అందులో ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ అమలుచేస్తే ఒక్కోదానికి వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిరీత్యా ఇది మంచిదికాదని కొందరు ఆర్ధికవేత్తలు గుండెలు బాదుకున్నారు. మాయావతి కూడా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయకపోలేదు. అయితే, ఆమె మరో దోవను ఎంచుకున్నారు. యూపీని నాలుగు రాష్ట్రాలుగా విడగొట్టాలని కోరుతూ అసెంబ్లీ చివరి సమావేశంలో తీర్మానం ఆమోదింపజేశారు. ప్రజల్లో ప్రాంతీయ ఆకాంక్షలను పెంచితే అది తనకు ఉపయోగపడుతుందని ఆమె విశ్వసించారు. కానీ, ఆమె కోరుకున్న స్పందన కరువైంది. ఓటర్లు సమాజ్వాదీవైపే మొగ్గుచూపారు. ఎన్నికల్లో వాగ్దానాలు చేయడం, ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించడం ఉత్తరప్రదేశ్కో, తమిళనాడుకో పరిమితమైన ధోరణి మాత్రమే కాదు. అలాగే, వాగ్దానాలు చేసిన పార్టీలన్నీ గెలుస్తాయనిగానీ, గెలిచినవారంతా గద్దెనెక్కాక ఆ హామీలను నిలుపుకుంటారనిగానీ చెప్పడానికి లేదు. మద్యపాన నిషేధం, కిలో రెండు రూపాయల పథకంవంటి వాగ్దానాలతో 1995 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అధినేత ఎన్టీఆర్ వాటి అమలు ప్రారంభించిన కొన్నాళ్లకే చంద్రబాబువల్ల పదవి కోల్పోయారు. తాను గద్దెనెక్కాక చంద్రబాబు ఆ రెండు వాగ్దానాలకూ తిలోదకాలిచ్చారు. ప్రపంచీకరణ, ఉదారవాద విధానాలే అన్నిటినీ శాసిస్తున్న తరుణంలో సామాన్య ప్రజల తక్షణ ప్రయోజనాలకూ, దీర్ఘకాలిక అభివృద్ధికీ మధ్య సమతూకాన్ని పాటిస్తూ సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలుచేసినవారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. 2004లో రైతులకు ఉచిత విద్యుత్ వాగ్దానం చేసినప్పుడు అది ఆచరణ సాధ్యంకాదని కాంగ్రెస్‌లోనే ఎందరో వాదించారు. స్వయంగా ఆర్ధికవేత్త అయిన ప్రధాని మన్మోహన్సింగ్ ఈ పథకం అమలుపై ఎన్నో అనుమానాలు వ్యక్తంచేశారు. కానీ, వైఎస్ దాన్ని అయిదేళ్లూ సమర్ధవంతంగా అమలుచేశారు. అదే సమయంలో రాష్ట్రంలో విద్యుదుత్పాదనా సామర్ధ్యాన్ని పెంచడానికి ప్రణాళికలు వేశారు. విద్యుత్ చార్జీలను పెంచబోమన్న హామీని కూడా ఆయన అదేవిధంగా నిలుపుకున్నారు. ఎన్నికల వాగ్దానాల్లో లేని ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్వంటి పథకాలనెన్నిటినో ఆయన అమలు చేశారు. అందువల్లే 2009 ఎన్నికల్లో చంద్రబాబు నగదు బదిలీ పథకంనుంచి నిరుద్యోగ భృతివరకూ...ఉచిత బియ్యం పథకంనుంచి కలర్ టీవీల వరకూ ఎన్నో వాగ్దానాలు చేశారు. అయితే, ప్రజలు తెలుగుదేశాన్ని తిరస్కరించి, కొత్తగా ఒక్క వాగ్దానమూ చేయని వైఎస్వైపే మొగ్గుచూపారు. రాజకీయ పార్టీలు విధానాలు, కార్యక్రమాలు రూపొందించుకోవడం చిన్న విషయమేమీ కాదు. ఆ విధానాలైనా, కార్యక్రమాలైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేకపోతే, వారిని మెప్పించలేకపోతే ఆ పార్టీలు తమ లక్ష్యసాధనలో విజయం సాధించలేవు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయడం, వాటి పరిష్కారానికి పథకాలు రూపకల్పన చేయడం, ప్రజల ఆదరణను పొందడం ఒక సృజనాత్మక ప్రక్రియ. హామీలివ్వడంలో పార్టీలు అప్పుడప్పుడు హద్దు మీరుతున్నాయనడంలో నిజం లేకపోలేదుగానీ...దానికి విరుగుడు ఈ సృజనాత్మక ప్రక్రియపై ఆంక్షలు విధించడం కాదు. ఎన్నికల ప్రచారంలో పార్టీల వాగ్దానాలపై విస్తృతమైన చర్చ జరుగుతుంది. వాగ్దానాలకంటే ముందు అవి చేసిన వారెవరన్న అంశాన్ని ప్రజలు ప్రధానంగా చూస్తారు. వారి విశ్వసనీయత, సమర్ధత ఏపాటివో అంచనా వేసుకుంటారు. అనర్హులనుకున్నవారిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు. అంతేతప్ప ఆ వ్యామోహంలోపడి కొట్టుకుపోరు. పార్టీల వాగ్దానాలు కట్టుదాటుతున్నాయని ఆదుర్దా పడేవారు మన ఓటర్ల రాజకీయ పరిణతిని తక్కువ అంచనా వేస్తున్నామని మరిచిపోతున్నారు.