సాక్షి, న్యూఢిల్లీ : నాగాలాండ్‌లో అతిపెద్ద నగరమైన దిమాపూర్‌కు వెళితే అక్కడ రోడ్డు పక్కన మూడంతస్తుల భవనం, ఆ భవనంపై ‘నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ’ అని రాసి ఉన్న బ్యానర్ కనిపిస్తుంది. అదే బ్యానర్‌పైన కొంత చిన్న అక్షరాలతో ‘ప్యాక్టా నాన్ వెర్బా’, అంటే మాటలు కాదు, చేతలు అనే నినాదం కనిపిస్తుంది. ఆ భవనంలోకి వెళ్లి చూస్తే మెల్లగా మాట్లాడుకుంటున్న ఓ గుంపు మినహా మొత్తమంతా ప్రశాంతంగా కనిపిస్తోంది. మరో గదిలోకి వెళ్లే ముందు ఎంతో క్రమశిక్షణ కలిగిన రిసెప్షన్ డెస్క్ ఆహ్వానిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకున్న పార్టీకి అది ప్రధాన కార్యాలయం.
ఆ పార్టీకి ప్రాణం పోసిన నాయకుడు నైఫ్యూ రియో వచ్చినప్పుడు మాత్రం పార్టీ కార్యాలయం సందడిగా ఉంటుంది. ఆయన మామూలు నాయకుడు కాదు. వరుసగా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎన్నిక 11 ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగిన వ్యక్తి. మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు రియో ఏడాదికే తన పదవికి రాజీనామాచేసి ఎంపీగా పార్లమెంట్‌కు వెళ్లారు. అక్కడ కేంద్ర కేబినెట్ పదవిని ఆశించి అది అందక పోవడంతో వెనుతిరిగా రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. నాగాలాండ్ పాలకపక్ష ‘నాగా పీపుల్స్ ఫ్రంట్’లో కొనసాగిన రియో గత మే నెలలోనే నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ’ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొత్త పార్టీపై పెద్దగా దృష్టి పెట్టకుండా, నాగా పీపుల్స్ ఫ్రంట్‌లో కొనసాగుతూ వచ్చారు.
గత ఏడాది కాలంగా ఢిల్లీకే పరిమితమై అక్కడి బీజేపీ నాయకులతో ఎడతెరపి లేకుండా చర్చలు జరిపిన రియో గత జనవరి నెలలోనే నాగాలాండ్‌కు వచ్చి నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పారు. సొంత పార్టీ అయిన ‘నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ’ అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించారు. ఇంతలో నాగా అసెంబ్లీకి ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అప్పటి నుంచి నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి రియో పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. గత శుక్రవారం నాడు ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు రియో పార్టీ, బీజేపీ పార్టీలు ప్రకటించాయి. అప్పటి నుంచి వలసలు మరీ ఊపందుకున్నాయి. నాగా అసెంబ్లీలోని 60 సీట్లకుగాను 40 సీట్లకు రియో పార్టీ, మిగతా 20 సీట్లకు బీజేపీ పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి.
నాగా పీపుల్స్ ఫ్రంట్ నాయకత్వంలోని ‘డెమోక్రటిక్ అలయెన్స్ ఆఫ్ నాగాలాండ్’కు రియో పార్టీ, బీజేపీ కూటమికి మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2015 నుంచి ప్రతిపక్షమే లేకుండా నడుస్తున్న నాగా అసెంబ్లీలో మళ్లీ ప్రతిపక్షం ప్రత్యక్షం కానుంది. డెమోక్రటిక్ అలయెన్స్ ఆఫ్ నాగాలాండ్ ప్రభుత్వంలో మొదటి నుంచి బీజేపీ భాగస్వామిగా ఉండగా, ఎనిమిది శాసన సభ్యులను కలిగిన కాంగ్రెస్ పార్టీ కూడా అలయెన్స్‌లో చేరిపోవడంతో 2015 నుంచి ఆ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. కాంగ్రెస్, బీజేపీలో పాలకపక్షంలో చేరిన అరుదైన రికార్డు నాగాలాండ్‌కు దగ్గింది. ఇప్పుడు ఆ అలయెన్స్‌ను వీడి నాగా పీపుల్స్ పార్టీ సభ్యత్వాన్ని వదులుకొని రియో కొత్త పార్టీకి ప్రాణం పోయగా, ఎప్పటి నుంచో ఆయనతో తెరవెనక, తెర ముందు చర్చలు జరుపుతూ వస్తున్న బీజేపీ అలయెన్స్‌ను వీడి రియోతో చేతులు కలిపింది.
నాగాలాండ్ శక్తివంతమైన ‘అంగామి నాగా’ తెగకు చెందిన రియో ఉత్తర అంగామి–2 నియోజక వర్గం నుంచి 2003లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి మొదటిసారి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2008, 2013లలో కూడా పోటీచేసి గెలవడమే కాకుండా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014లో డెమోక్రటిక్ అలయెన్స్ తరఫున పార్లమెంట్‌కు పోటీచేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. నాగాలాండ్‌కు ఏదైనా అభివృద్ధి జరిగిదంటే ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నుంచే అని స్థానిక ప్రజలు ఆయన గురించి చెబుతున్నారు. అభివృద్ధితోపాటు అవినీతి కూడా పెరిగిందని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. రియో ఆధ్వర్యంలో నాగాలాండ్‌లో కొత్త ప్రభుత్వ భవనాలు వచ్చిన మాట నిజమేగానీ వాటిలో అవినీతి జరగడమే కాకుండా రాష్ట్రానికి అప్పులు కూడా పెరిగాయని విమర్శకుల ఆరోపణ. ‘రియో అవినీతి పరుడు అయితే కావచ్చు. పనులు మాత్రం చేస్తార’ని సెయిరియో అనే ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నందున రియో కూటమికే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా.
Comments
Please login to add a commentAdd a comment