Neiphiu Rio
-
అమాయక కూలీలపై పేలిన ఆర్మీ తూటా
కోహిమా/గువాహటి/న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో దారుణం జరిగింది. తీవ్రవాదుల ఏరివేత ఆపరేషన్ గురి తప్పింది. బొగ్గు గనిలో పని పూర్తిచేసుకొని పాటలు పాడుకుంటూ వాహనంలో ఇళ్లకు తిరిగి వస్తున్న కార్మికులపై సైనికులు తుపాకులు ఎక్కుపెట్టారు. కాల్పుల్లో ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సమయం గడుస్తున్నా ఇంటికి చేరుకోని తమవారిని వెతుకుతూ గ్రామస్థులు బయలుదేరారు. కొంతదూరం వెళ్లాక కంటిముందు కనిపించిన రక్తపాతాన్ని చూసి ఆగ్రహంతో రగిలిపోయారు. అక్కడే ఉన్న మిలటరీ వాహనాలను చుట్టుముట్టి, నిప్పు పెట్టారు. జవాన్లపై దాడికి దిగారు. అప్రమత్తమైన జవాన్లు ఆత్మరక్షణ కోసం తుపాకులకు మళ్లీ పనిచెప్పారు. ఈసారి మరో ఏడుగురు పౌరులు ప్రాణాలొదిలారు. గ్రామస్థుల దాడిలో ఒక జవాను మరణించాడు. సైనికుల కాల్పుల్లో మొత్తం 11 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. మోన్ జిల్లాలోని తిరూ ఏరియాలో ఓతింగ్ గ్రామం వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. మరొకరి మృతి సైనికుల కాల్పులు, పేదల మరణంపై ఆదివారం నాగాలాండ్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. జనం వీధుల్లోకి వచ్చారు. సైన్యం అకృత్యానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. 17 మందిని పొట్టనపెట్టుకున్న జవాన్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోన్ జిల్లాలో కోన్యాక్ యూనియన్ ఆఫీసు, అస్సాం రైఫిల్స్ క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కార్యాలయంలోని పలు భాగాలను దహనం చేశారు. వారిని అడ్డుకోవడానికి భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నాగాలాండ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. తప్పుడు సమాచారం, వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందకుండా మోన్ జిల్లాలో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులపై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయినప్పటికీ కార్యాలయాల విధ్వంసానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 17 మంది మృతదేహాలకు మోన్ జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం అస్సాంకు తరలించినట్లు చెప్పారు. ‘సిట్’ ఏర్పాటు తాజా సంఘటనపై విచారణ కోసం ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నాగాలాండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందానికి నాగాలాండ్ ఐజీ నేతృత్వం వహిస్తున్నారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తున్నామని, రాష్ట్ర ప్రజలంతా సంయమనం పాటించాలని సీఎం నీఫియూ రియో విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించరాదని కోరారు. సైనికుల కాల్పుల ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణేకు ఉన్నతాధికారులు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. 17 మంది మరణించడం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం ప్రకటించారు. వారి కుటుం బాలకు ట్విట్టర్లో సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. హార్న్‌బిల్ ఫెస్టివల్ బహిష్కరిస్తున్నాం పౌరులపై సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరపడాన్ని ఈస్ట్రర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్(ఈఎన్‌పీఓ) ఖండించింది. ఈ సంఘటనకు నిరసనగా హార్న్‌బిల్ ఫెస్టివల్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫెస్టివల్లో పాల్గొనరాదంటూ స్థానిక గిరిజన తెగలకు పిలుపునిచ్చింది. నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలపాలంది. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్శించడానికి నాగాలాండ్ ప్రభుత్వం ప్రస్తుతం హార్న్‌బిల్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. మోన్ జిల్లా పొరుగు దేశమైన మయన్మార్‌తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటోంది. ఎన్ఎస్సీఎన్–కేలోని యుంగ్ ఆంగ్ ముఠా ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తోంది. అసలేం జరిగింది? నిషేధిత నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్–ఖప్లాంగ్(ఎన్ఎస్సీఎన్–కే) అనే తీవ్రవాద సంస్థలో ఒక భాగమైన యుంగ్ ఆంగ్ ముఠా సభ్యులు తిరూ ఏరియాలో సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న సైనికులు గాలింపు చర్యలు ప్రారంభించారు. పని ముగించుకొని వాహనంలో వస్తున్న కార్మికులను ఎన్ఎస్సీఎన్–కే తీవ్రవాదులుగా భ్రమపడి, కాల్పులు జరిపారు. చిన్న పొరపాటు భారీ హింసాకాండకు దారితీసింది. రెండుసార్లు జరిగిన కాల్పుల్లో మొత్తం 17 మంది బడుగు జీవులు బలయ్యారు. ఒక జవాను సైతం ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం పరిణామాలపై ‘కోర్టు ఆఫ్ ఎంక్వైరీ’ కోసం ఆదేశాలు జారీ చేసినట్లు సైన్యం ప్రకటించింది. జనం దాడిలో తమ సైనికులు కొందరు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించింది. 17 మంది సాధారణ ప్రజలు చనిపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇది దురదృష్టకర సంఘటన అని పేర్కొంది. కేంద్ర హోంశాఖ ఏం చేస్తోంది? ‘‘నాగాలాండ్‌లో సైన్యం కాల్పులపై కేంద్ర ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాలి. సొంత దేశంలోనే పౌరులకు, భద్రతా సిబ్బందికి రక్షణ లేని పరిస్థితి ఉంటే కేంద్ర హోంశాఖ ఏం చేస్తోంది. 17 మంది పౌరుల మరణం నా హృదయాన్ని కలచివేసింది’’ – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ సమగ్ర దర్యాప్తు జరపాలి ‘‘నాగాలాండ్‌లో సైన్యం కాల్పుల్లో పౌరుల మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ – మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి -
నాగాలాండ్‌లో అరుదైన దృశ్యం.. 58 ఏళ్ల తర్వాత
కోహిమా: శాసనాలు రూపొందించే చట్టసభలో దాదాపు 58 ఏళ్లుగా జాతీయ గీతం ఆలపించడం లేదు. దేశవ్యాప్తంగా ‘జనగణమన’ ఆలపించడం సంప్రదాయం. కానీ ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ అసెంబ్లీలో మాత్రం ఇంతవరకు జాతీయ గీతం ఆలపించలేదు. ఐదు దశాబ్దాల అనంతరం తొలిసారిగా ఇప్పుడు జనగణమనను సభ్యులు పాడారు. ఈ కొత్త సంప్రదాయం ప్రారంభమవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 1962లో నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడగా రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారిగా ఆ అసెంబ్లీలో జనగణమనను ప్రజాప్రతినిధులు ఆలపించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రసంగం ప్రారంభానికి ముందు జాతీయ గీతం ఆలపించి కొత్త సంప్రదాయానికి తెర లేపారు. ఈ పరిణామం ఫిబ్రవరి 12వ తేదీన శుక్రవారం ప్రారంభమైంది. మంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తేమ్జన్ ఇమ్నా ఈ పరిణామంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అసెంబ్లీలో ఎందుకు జనగణమన గీతం ఆలపించడం లేదో తమకు తెలియదని అసెంబ్లీ అధికారులు చెప్పారు. ఏది ఏమైనా ఇప్పటికైనా ఈ కొత్త సంప్రదాయాన్ని వెలుగులోకి తీసుకురావడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. స్పీకర్ షరిన్‌గైర్ లాంగ్‌కుమార్ నేతృత్వంలో నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో ఆధ్వర్యంలో ఈ పరిణామం జరిగింది. 58 years after Nagaland became a state, Jana Gana Mana played in the assembly for the first time. Members of the Assembly stand as the National Anthem “Jana Gana Mana” is played in the House for the very first time in the history of the Nagaland Legislative Assembly. pic.twitter.com/nHLauZhucv — Nandan Pratim Sharma Bordoloi 🇮🇳 (@NANDANPRATIM) February 19, 2021 -
‘ఆ స్థానానికి ఆయనే కరెక్టు’
కోల్‌కత: మరో ఎన్నికల సమరానికి అంతా సిద్ధమైంది. రేపు (సోమవారం) అయిదు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని మహెష్తల, జార్ఖండ్‌లోని గోమియా, సిల్లీ, బిహార్‌లోని జోకిహత్, మేఘాలయలోని అంపతి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాగా, నాగాలాండ్ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి ఎన్డీపీపీ, బీజేపీలు భాగస్వాములుగా గల పీడీఏ కూటమి అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ అధ్యక్షుడు నెఫ్యూ రియోని ఎన్నికున్నారు. ఆయన తన ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో.. నాగాలాండ్‌లో ఉన్న ఏకైక లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా, నాగాలాండ్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. నాగా పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థికి, అధికార పీపుల్స్ డెమొక్రటిక్ అలయెన్స్ అభ్యర్థికి మధ్య ప్రధాన పోరు జరుగుతోంది. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఇప్పటికే ఆయా పార్టీలు తీవ్రంగా శ్రమించాయి. ఎన్డీపీపీ, బీజేపీలు భాగస్వాములైన పీపుల్స్ డెమొక్రటిక్ అలయెన్స్ తమ అభ్యర్థిగా మాజీ మంత్రి టొకిహో యెప్తోమీని నిలబెట్టింది. నాగా పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థి కె. అపోక్ కుమార్‌కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ‘మతోన్మాద శక్తుల ఆగడాలతో నాగాలాండ్‌లో అనిశ్చిత పరిస్థితులు తలెత్తాయి. అపోక్ కుమార్ తిరిగి రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా పనిచేస్తారని ఆశిస్తున్నాం. ఆయనే తగిన నాయకుడుగా భావిస్తున్నాం. అందుకనే మద్దతునిస్తున్నామ’ని నాగాలాండ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కె. థెరీ అన్నారు. థెరీ వ్యాఖ్యలపై నాగాలాండ్ బీజేపీ అధికార ప్రతినిధి కె. జేమ్స్ విజో స్పందించారు. ఓటమి భయంతో కాంగ్రెస్ అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు. -
కేజ్రివాల్ చేస్తే తప్పు, రియో చేస్తే ఒప్పా?
సాక్షి, న్యూఢిల్లీ : నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫ్యూ రియో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. 20 మంది శాసన సభ్యులను సలహాదారులుగా (అడ్వైజర్స్) నియమించి వారికి ఒకటి, రెండు ప్రభుత్వ విభాగాల సంపూర్ణ బాధ్యతలను అప్పగించారు. ఆ మరుసటి రోజే మరో ఆరుగురు శాసన సభ్యులను ప్రభుత్వరంగ సంస్థలకు, బాంబూ మిషన్ లాంటి మిషన్లకు చైర్మన్లను నియమించారు. గతేడాది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ నియామకాలు రాజ్యాంగ విరుద్ధమని చెల్లవని రాజకీయ విశ్లేషకులతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఢిల్లీలోని అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వం 21 మంది శాసన సభ్యులను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించడం చెల్లదని, అది రాజ్యాంగ విరుద్ధమంటూ 2017, జూలై నెలలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన విషయం తెల్సిందే. తాను పార్లమెంటరీ కార్యదర్శులను నియమించలేదని, అడైజర్లను మాత్రమే నియమించానని, ఇది రాజ్యాంగ విరుద్ధం కాదని ముఖ్యమంత్రి నైఫ్యూ రియో వాదిస్తున్నారు. ఆయన ఏర్పాటు చేసిన పార్టీ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, భారతీయ జనతా పార్టీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. రాజ్యాంగం నిబంధనల ప్రకారం 12 మందికి మించి రాష్ట్ర కేబినెట్లోకి తీసుకోరాదు. అసమ్మతి తలెత్తకుండా అందరిని సంతప్తిపరచడంలో భాగంగా రియో ఈ చర్య తీసుకున్నారు. ఢిల్లీలో కేజ్రివాల్ ఇలాంటి నిర్ణయమే తీసుకొని బోల్తాపడ్డారు. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాన్ని సుప్రీం కోర్జు కొట్టివేయగా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందున 20 మంది ఆప్ ఎమ్మెల్యేల సభ్యత్వం చెల్లదని ఎన్నికల కమిషన్ దెబ్బ కొట్టింది. అంతటి చర్య తగతంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పడంతో వారి సభ్యత్వం మిగిలింది. పార్లమెంటరీ కార్యదర్శులు లేదా అడ్వైజర్లు పేర్లు వేరైన నియామకాలు ఒకే రకానికి చెందినవని, గతంలో వారికి ప్రత్యేక ప్రభుత్వ బాధ్యతలు ఇచ్చినట్లే ఇప్పుడు వీరికి ప్రత్యేక బాధ్యతలు ఇస్తున్నారని ‘నాగాలాండ్ వాలంటరీ కన్జూమర్స్ అసొసియేషన్’ అధ్యక్షుడు కిజోఖోటో సావి విమర్శించారు. ఈ నియామకాలు రాజ్యాంగంలోని 164 (1ఏ) అధికరణంతో పాటు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి సహా మంత్రుల సంఖ్య మొత్తం అసెంబ్లీ సీట్లలో 15 శాతానికి మించరాదని స్పష్టం చేస్తున్న 2003లో రాజ్యాంగంలో తీసుకొచ్చిన 91వ సవరణను ఉల్లంఘించడమేనని ఆయన వాదించారు. ఇంతకుముందు నాగాలాండ్ సీఎం టీఆర్ తెలియాంగ్ 2017లో పార్లమెంటరీ కార్యదర్శులను నియమించగా ఆ నియామకాలు చెల్లవంటూ సావియే రాష్ట్ర గవర్నర్ వద్ద సవాల్ చేశారు. ఆయన నుంచి తీర్పు వెలువడక ముందే అసెంబ్లీ కాలపరిమితి తీరిపోయి ఎన్నికలు జరిగాయి. ఈశాన్య ఇలాంటి నియామకాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. పార్లమెంటరీ కార్యదర్శులుగా ఆప్ నియమాకాలు చెల్లవంటూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ఈ నియామకాలు కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమేనంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షమైన నాగా పీపుల్స్ ఫ్రంట్ మాత్రం ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంది. అడ్వజర్లుగా నియమితులైన వారికి బంగ్లా, కారు లాంటి అదనపు సౌకర్యాలు ఇస్తారా, లేదా అన్న విషయం తేలాక మాట్లాడతామని ఆ పార్టీ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ కొత్త నియామకాలకు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తారా లేదా అన్న విషయం తనకు తెలియదని, అందుకని తానిప్పుడు ఏమీ మాట్లాడలేనని బాంబూస్ బోర్డు చైర్మన్‌గా నియమితులైన నాగాలాండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విసాసోలి లవుంగు వ్యాఖ్యానించారు. అరవింద్ కేజ్రివాల్ పార్లమెంటరీ కార్యదర్శులను నియమించడంపై పెద్ద ఎత్తున బీజేపీ గొడవ చేయడంతోపాటు నానా రాద్ధాంతం చేసిన విషయం తెల్సిందే. -
నాగా సీఎంగా రియో ప్రమాణం
కోహిమా: నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నేత నీఫియు రియో బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య.. రియోతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత పాట్టూన్ ప్రమాణం చేశారు. వీరుకాక మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీతో కలసి పీపుల్స్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వాన్ని రియో ఏర్పాటు చేశారు. మార్చి 16 లోగా అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాలని రియోను గవర్నర్ కోరారు. నాగా సీఎంగా రియో బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరెణ్ రిజిజు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌తోపాటు తాజా మాజీ ముఖ్యమంత్రి జెలియాంగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. మరోవైపు, త్రిపురలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం శుక్రవారం కొలువుదీరనుంది. త్రిపుర కొత్త సీఎంగా విప్లవ్ కుమార్ దేవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. -
నాగాలాండ్ సీఎంగా రియో ప్రమాణస్వీకారం
కోహిమా : నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఎన్డీపీపీ వ్యవస్థాపక నాయకుడు నైఫ్యూ రియో ప్రమాణ స్వీకారం చేశారు. నాగలాండ్ గవర్నర్ పీబీ ఆచార్య సమక్షంలో ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ వేడుకకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు నిర్మాలా సీతారామన్, కిరణ్ రిజుజులు హాజరయ్యారు. భారతీయ జనతాపార్టీ–నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కూటమి మద్దతుతో రియో ప్రభుత్వం నెలకొంది. డిప్యూటీ సీఎంతో పాటు 10 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్ జెలియాంగ్ కంటే ముందు వరుసగా 11 ఏళ్లపాటు మూడుసార్లు రియో ముఖ్యమంత్రిగా చేశారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ తరఫున మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన ఆయన అర్ధాంతరంగా సీఎం పదవిని వదిలిపెట్టి 2014లో ఎంపీగా లోక్‌సభకు వెళ్లిన విషయం తెలిసిందే. -
బీజేపీ చెబుతున్న మార్పు ఎక్కడ?
సాక్షి, న్యూఢిల్లీ : ‘మార్పు తీసుకొస్తాం, మార్పు కోసమే మా పోరాటం’ అంటూ నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ–నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కూటమి విస్తృతంగా ప్రచారం చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడడంతో ఎలాగైనా బీజేపీ అధికారంలోకి వస్తుందని తేలిపోయింది. కానీ రాష్ట్రంలో మార్పు వచ్చే సూచనలు మాత్రం శూన్యమే. ఎన్డీపీపీ పార్టీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, 60 మంది సభ్యులు గల రాష్ట్ర అసెంబ్లీలో తమకు జేడీయూ, ఓ స్వతంత్య్ర అభ్యర్థితోపాటు మొత్తం 32 మంది సభ్యుల మద్దతు ఉందని బీజేపీ ప్రకటించింది. గవర్నర్ ఆహ్వానిస్తే ఎన్డీపీపీ వ్యవస్థాపక నాయకుడు నైఫ్యూ రియో ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ కంటే ముందు వరుసగా 11 ఏళ్లపాటు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ తరఫున మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన ఆయన అర్ధాంతరంగా సీఎం పదవిని వదిలిపెట్టి 2014లో ఎంపీగా లోక్‌సభకు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. జెలియాంగ్ ప్రభుత్వం హయాంలో వెలుగులోకి వచ్చిన అనేక అవినీతి కుంభకోణాలు నాటి రియో ప్రభుత్వంలో ప్రారంభమైనవే. రియో పార్టీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గత శాసనసభ్యులకన్నా ఈసారి అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే శాసనసభ్యుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ ఓ సర్వే ద్వారా తేల్చింది. నాగాలాండ్ ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేయనని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం తనకూ ఉందని, తనకే అవకాశం కల్పించాలని ప్రస్తుత ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ రాష్ట్ర గవర్నర్‌ను కోరిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన్ని కూడా బీజేపీ చర్చలకు పిలిచింది. జెలియాంగ్ ప్రాతినిథ్యం వహిస్తున్న నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు ఎన్నికల్లో 27 సీట్లు లభించాయి. 2013 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకొని ఈసారి ఏకంగా 12 సీట్లను గెలుచుకున్న బీజేపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు మద్దతిస్తే మళ్లీ జెలియాంగ్ ప్రభుత్వమే ఏర్పడుతుంది. ప్రస్తుత జెలియాంగ్ ప్రభుత్వంలో కూడా బీజేపీ కొనసాగిన విషయం తెల్సిందే. బీజేపీ తరఫున 2013లో ఒక్కరే గెలిచినప్పటికీ ఆ తర్వాతా వారి సంఖ్య పార్టీ ఫిరాయింపులతో నాలుగుకు చేరింది. 2015 నుంచి ప్రతిపక్షంలో ఒక్కరు కూడా లేకుండానే జెలియాంగ్ ప్రభుత్వం కొనసాగింది. ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వంలో చేరిపోవడమే అందుకు కారణం. రియో నాయకత్వంలోని ఎన్డీపీపీతో కలిసే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోనే ధనిక ప్రభుత్వం అవుతుంది. ఇరుపార్టీలకు చెందిన శాసనసభ్యుల్లో 75 శాతం మంది కోటి రూపాయలకు పైగా ఆస్తులు కలిగిన వారే. అవినీతి కుంభకోణాలు రియో హయాంలో ప్రారంభమై ఆ కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నందున బీజేపీ చెప్పే మార్పు ఎక్కడ వస్తుంది? ఇక జెలియాంగ్‌తో చేతులు కలిపితే మార్పు అనే పదానికే అర్థం ఉండదు. ఈసారి మార్పు వచ్చేదల్లా ఒక్కటే. బీజేపీ ఎవరితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అవతలి పక్షం ప్రతిపక్షం అవుతుంది. రియో పార్టీతో కలిసి బీజేపీ పోటీ చేసినందున ప్రభుత్వంలో ఆయన పార్టీ కూడా చేరిపోతే మళ్లీ ప్రతిపక్షం అనేది ఉండదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రభుత్వ పాలన సవ్యంగా సాగుతుంది. -
నాగాలాండ్‌లో నేనంటే.. నేను!
కోహిమా: నాగాలాండ్ ప్రభుత్వం ఏర్పాటులో ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ నాగాలాండ్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ) నేత నేఫియో రియో, నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్)కు చెందిన టీఆర్ జెలియాంగ్ గవర్నర్‌ను కలవటంతో రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. ఆదివారం ఉదయం ఎన్డీపీపీ నేత రియో గవర్నర్ పీబీ ఆచార్యను కలిసి తనకు 32 మంది సభ్యుల మద్దతు ఉందని చెప్పారు. అనంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ కూడా గవర్నర్ వద్దకు వెళ్లి మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని తెలిపారు. వీరితో సమావేశాల అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. ఇద్దరికీ 48 గంటల సమయం ఇచ్చాననీ, మెజారిటీ సభ్యుల మద్దతుతో లేఖలు ఎవరు తీసుకువస్తే వారినే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరతానన్నారు. రియో వెంట ఎన్డీపీపీ అధ్యక్షుడు చింగ్వాంగ్ కొన్యాక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విసాసోలీ లౌంగు, జనతాదళ్(యు) ఎమ్మెల్యే, మరో స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారని గవర్నర్ చెప్పారు. రియోకు చెందిన ఎన్డీపీపీకి 18, బీజేపీకి 12 మంది సభ్యుల బలం ఉందని తెలిపారు. జెలియాంగ్కు చెందిన ఎన్పీఎఫ్కు 26 మంది సభ్యులుండగా ఇద్దరు నాగాలాండ్ పీపుల్స్ పార్టీ, ఒక జేడీయూ ఎమ్మెల్యే మద్దతు ఉందని చెప్పారన్నారు. అయితే ఇదే జేడీయూ ఎమ్మెల్యే రియోకు కూడా మద్దతు తెలిపారన్నారు. ఇలా ఉండగా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జెలియాంగ్ రాజీనామాకు నిరాకరించారు. నాగాలాండ్‌లో సంకీర్ణ ప్రభుత్వం: రామ్‌మాధవ్ ఎన్డీపీపీతో కలిసి నాగాలాండ్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తెలిపారు. 60 సీట్లున్న అసెంబ్లీలో రెండు పార్టీలతోపాటు జేడీయూ, ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిపి సాధారణ మెజారిటీ ఉందని తెలిపారు. -
నాగాలాండ్‌లో ఎవరిది విజయం?
సాక్షి, న్యూఢిల్లీ : నాగాలాండ్‌లో అతిపెద్ద నగరమైన దిమాపూర్‌కు వెళితే అక్కడ రోడ్డు పక్కన మూడంతస్తుల భవనం, ఆ భవనంపై ‘నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ’ అని రాసి ఉన్న బ్యానర్ కనిపిస్తుంది. అదే బ్యానర్‌పైన కొంత చిన్న అక్షరాలతో ‘ప్యాక్టా నాన్ వెర్బా’, అంటే మాటలు కాదు, చేతలు అనే నినాదం కనిపిస్తుంది. ఆ భవనంలోకి వెళ్లి చూస్తే మెల్లగా మాట్లాడుకుంటున్న ఓ గుంపు మినహా మొత్తమంతా ప్రశాంతంగా కనిపిస్తోంది. మరో గదిలోకి వెళ్లే ముందు ఎంతో క్రమశిక్షణ కలిగిన రిసెప్షన్ డెస్క్ ఆహ్వానిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకున్న పార్టీకి అది ప్రధాన కార్యాలయం. ఆ పార్టీకి ప్రాణం పోసిన నాయకుడు నైఫ్యూ రియో వచ్చినప్పుడు మాత్రం పార్టీ కార్యాలయం సందడిగా ఉంటుంది. ఆయన మామూలు నాయకుడు కాదు. వరుసగా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎన్నిక 11 ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగిన వ్యక్తి. మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు రియో ఏడాదికే తన పదవికి రాజీనామాచేసి ఎంపీగా పార్లమెంట్‌కు వెళ్లారు. అక్కడ కేంద్ర కేబినెట్ పదవిని ఆశించి అది అందక పోవడంతో వెనుతిరిగా రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. నాగాలాండ్ పాలకపక్ష ‘నాగా పీపుల్స్ ఫ్రంట్’లో కొనసాగిన రియో గత మే నెలలోనే నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ’ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొత్త పార్టీపై పెద్దగా దృష్టి పెట్టకుండా, నాగా పీపుల్స్ ఫ్రంట్‌లో కొనసాగుతూ వచ్చారు. గత ఏడాది కాలంగా ఢిల్లీకే పరిమితమై అక్కడి బీజేపీ నాయకులతో ఎడతెరపి లేకుండా చర్చలు జరిపిన రియో గత జనవరి నెలలోనే నాగాలాండ్‌కు వచ్చి నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పారు. సొంత పార్టీ అయిన ‘నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ’ అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించారు. ఇంతలో నాగా అసెంబ్లీకి ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అప్పటి నుంచి నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి రియో పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. గత శుక్రవారం నాడు ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు రియో పార్టీ, బీజేపీ పార్టీలు ప్రకటించాయి. అప్పటి నుంచి వలసలు మరీ ఊపందుకున్నాయి. నాగా అసెంబ్లీలోని 60 సీట్లకుగాను 40 సీట్లకు రియో పార్టీ, మిగతా 20 సీట్లకు బీజేపీ పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. నాగా పీపుల్స్ ఫ్రంట్ నాయకత్వంలోని ‘డెమోక్రటిక్ అలయెన్స్ ఆఫ్ నాగాలాండ్’కు రియో పార్టీ, బీజేపీ కూటమికి మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2015 నుంచి ప్రతిపక్షమే లేకుండా నడుస్తున్న నాగా అసెంబ్లీలో మళ్లీ ప్రతిపక్షం ప్రత్యక్షం కానుంది. డెమోక్రటిక్ అలయెన్స్ ఆఫ్ నాగాలాండ్ ప్రభుత్వంలో మొదటి నుంచి బీజేపీ భాగస్వామిగా ఉండగా, ఎనిమిది శాసన సభ్యులను కలిగిన కాంగ్రెస్ పార్టీ కూడా అలయెన్స్‌లో చేరిపోవడంతో 2015 నుంచి ఆ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. కాంగ్రెస్, బీజేపీలో పాలకపక్షంలో చేరిన అరుదైన రికార్డు నాగాలాండ్‌కు దగ్గింది. ఇప్పుడు ఆ అలయెన్స్‌ను వీడి నాగా పీపుల్స్ పార్టీ సభ్యత్వాన్ని వదులుకొని రియో కొత్త పార్టీకి ప్రాణం పోయగా, ఎప్పటి నుంచో ఆయనతో తెరవెనక, తెర ముందు చర్చలు జరుపుతూ వస్తున్న బీజేపీ అలయెన్స్‌ను వీడి రియోతో చేతులు కలిపింది. నాగాలాండ్ శక్తివంతమైన ‘అంగామి నాగా’ తెగకు చెందిన రియో ఉత్తర అంగామి–2 నియోజక వర్గం నుంచి 2003లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి మొదటిసారి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2008, 2013లలో కూడా పోటీచేసి గెలవడమే కాకుండా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014లో డెమోక్రటిక్ అలయెన్స్ తరఫున పార్లమెంట్‌కు పోటీచేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. నాగాలాండ్‌కు ఏదైనా అభివృద్ధి జరిగిదంటే ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నుంచే అని స్థానిక ప్రజలు ఆయన గురించి చెబుతున్నారు. అభివృద్ధితోపాటు అవినీతి కూడా పెరిగిందని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. రియో ఆధ్వర్యంలో నాగాలాండ్‌లో కొత్త ప్రభుత్వ భవనాలు వచ్చిన మాట నిజమేగానీ వాటిలో అవినీతి జరగడమే కాకుండా రాష్ట్రానికి అప్పులు కూడా పెరిగాయని విమర్శకుల ఆరోపణ. ‘రియో అవినీతి పరుడు అయితే కావచ్చు. పనులు మాత్రం చేస్తార’ని సెయిరియో అనే ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నందున రియో కూటమికే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. -
నాగాలాండ్ సీఎం నైపూ రియో రాజీనామా
కోహిమా: నాగాలాండ్ ముఖ్యమంత్రి నైపూ రియో తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ అశ్వనీ కుమార్ ఆయన రాజీనామాను ఆమోదించారు. నైపూ రియో లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో ఆయన సీఎం పదవిని వదులుకున్నారు. కొత్త ముఖ్యమంత్రిగా టీఆర్ జెలియాంగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) నేతృత్వంలోని డెమొక్రాటిక్ అలయన్స్ ఆఫ్ నాగాలాండ్ (డీఏఎన్) శాసన సభా పక్ష నేతగా, ముఖ్యమంత్రిగా జెలియాంగ్‌ను శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. జెలియాంగ్ ప్రస్తుతం గనులు, భూగర్భ వనరులు, ప్రణాళిక శాఖల మంత్రిగా ఉన్నారు. జెలియాంగ్ అభ్యర్థిత్వానికి డీఏఎన్లోని పక్షాలైన జేడీయూ, ఎన్సీపీ, బీజేపీ, స్వత్రంతులు పూర్తి మద్దతు ప్రకటించారు.