ప్రతీకాత్మక చిత్రం
కోల్‌కత: మరో ఎన్నికల సమరానికి అంతా సిద్ధమైంది. రేపు (సోమవారం) అయిదు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని మహెష్తల, జార్ఖండ్‌లోని గోమియా, సిల్లీ, బిహార్‌లోని జోకిహత్, మేఘాలయలోని అంపతి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాగా, నాగాలాండ్ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి ఎన్డీపీపీ, బీజేపీలు భాగస్వాములుగా గల పీడీఏ కూటమి అధికారం చేపట్టింది.
ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ అధ్యక్షుడు నెఫ్యూ రియోని ఎన్నికున్నారు. ఆయన తన ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో.. నాగాలాండ్‌లో ఉన్న ఏకైక లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
కాగా, నాగాలాండ్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. నాగా పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థికి, అధికార పీపుల్స్ డెమొక్రటిక్ అలయెన్స్ అభ్యర్థికి మధ్య ప్రధాన పోరు జరుగుతోంది. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఇప్పటికే ఆయా పార్టీలు తీవ్రంగా శ్రమించాయి. ఎన్డీపీపీ, బీజేపీలు భాగస్వాములైన పీపుల్స్ డెమొక్రటిక్ అలయెన్స్ తమ అభ్యర్థిగా మాజీ మంత్రి టొకిహో యెప్తోమీని నిలబెట్టింది. నాగా పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థి కె. అపోక్ కుమార్‌కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.
‘మతోన్మాద శక్తుల ఆగడాలతో నాగాలాండ్‌లో అనిశ్చిత పరిస్థితులు తలెత్తాయి. అపోక్ కుమార్ తిరిగి రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా పనిచేస్తారని ఆశిస్తున్నాం. ఆయనే తగిన నాయకుడుగా భావిస్తున్నాం. అందుకనే మద్దతునిస్తున్నామ’ని నాగాలాండ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కె. థెరీ అన్నారు. థెరీ వ్యాఖ్యలపై నాగాలాండ్ బీజేపీ అధికార ప్రతినిధి కె. జేమ్స్ విజో స్పందించారు. ఓటమి భయంతో కాంగ్రెస్ అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment