కోహిమా/గువాహటి/న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో దారుణం జరిగింది. తీవ్రవాదుల ఏరివేత ఆపరేషన్ గురి తప్పింది. బొగ్గు గనిలో పని పూర్తిచేసుకొని పాటలు పాడుకుంటూ వాహనంలో ఇళ్లకు తిరిగి వస్తున్న కార్మికులపై సైనికులు తుపాకులు ఎక్కుపెట్టారు. కాల్పుల్లో ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సమయం గడుస్తున్నా ఇంటికి చేరుకోని తమవారిని వెతుకుతూ గ్రామస్థులు బయలుదేరారు. కొంతదూరం వెళ్లాక కంటిముందు కనిపించిన రక్తపాతాన్ని చూసి ఆగ్రహంతో రగిలిపోయారు. అక్కడే ఉన్న మిలటరీ వాహనాలను చుట్టుముట్టి, నిప్పు పెట్టారు. జవాన్లపై దాడికి దిగారు.
అప్రమత్తమైన జవాన్లు ఆత్మరక్షణ కోసం తుపాకులకు మళ్లీ పనిచెప్పారు. ఈసారి మరో ఏడుగురు పౌరులు ప్రాణాలొదిలారు. గ్రామస్థుల దాడిలో ఒక జవాను మరణించాడు. సైనికుల కాల్పుల్లో మొత్తం 11 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. మోన్ జిల్లాలోని తిరూ ఏరియాలో ఓతింగ్ గ్రామం వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.
మరొకరి మృతి
సైనికుల కాల్పులు, పేదల మరణంపై ఆదివారం నాగాలాండ్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. జనం వీధుల్లోకి వచ్చారు. సైన్యం అకృత్యానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. 17 మందిని పొట్టనపెట్టుకున్న జవాన్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోన్ జిల్లాలో కోన్యాక్ యూనియన్ ఆఫీసు, అస్సాం రైఫిల్స్ క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కార్యాలయంలోని పలు భాగాలను దహనం చేశారు. వారిని అడ్డుకోవడానికి భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నాగాలాండ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. తప్పుడు సమాచారం, వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందకుండా మోన్ జిల్లాలో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులపై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయినప్పటికీ కార్యాలయాల విధ్వంసానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 17 మంది మృతదేహాలకు మోన్ జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం అస్సాంకు తరలించినట్లు చెప్పారు.
‘సిట్’ ఏర్పాటు
తాజా సంఘటనపై విచారణ కోసం ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నాగాలాండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందానికి నాగాలాండ్ ఐజీ నేతృత్వం వహిస్తున్నారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తున్నామని, రాష్ట్ర ప్రజలంతా సంయమనం పాటించాలని సీఎం నీఫియూ రియో విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించరాదని కోరారు. సైనికుల కాల్పుల ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణేకు ఉన్నతాధికారులు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. 17 మంది మరణించడం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం ప్రకటించారు. వారి కుటుం బాలకు ట్విట్టర్‌లో సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు.
హార్న్‌బిల్ ఫెస్టివల్ బహిష్కరిస్తున్నాం
పౌరులపై సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరపడాన్ని ఈస్ట్రర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్(ఈఎన్‌పీఓ) ఖండించింది. ఈ సంఘటనకు నిరసనగా హార్న్‌బిల్ ఫెస్టివల్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫెస్టివల్‌లో పాల్గొనరాదంటూ స్థానిక గిరిజన తెగలకు పిలుపునిచ్చింది. నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలపాలంది. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్శించడానికి నాగాలాండ్ ప్రభుత్వం ప్రస్తుతం హార్న్‌బిల్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. మోన్ జిల్లా పొరుగు దేశమైన మయన్మార్‌తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటోంది. ఎన్‌ఎస్‌సీఎన్–కేలోని యుంగ్ ఆంగ్ ముఠా ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తోంది.
అసలేం జరిగింది?
నిషేధిత నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్–ఖప్లాంగ్(ఎన్‌ఎస్‌సీఎన్–కే) అనే తీవ్రవాద సంస్థలో ఒక భాగమైన యుంగ్ ఆంగ్ ముఠా సభ్యులు తిరూ ఏరియాలో సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న సైనికులు గాలింపు చర్యలు ప్రారంభించారు. పని ముగించుకొని వాహనంలో వస్తున్న కార్మికులను ఎన్‌ఎస్‌సీఎన్–కే తీవ్రవాదులుగా భ్రమపడి, కాల్పులు జరిపారు. చిన్న పొరపాటు భారీ హింసాకాండకు దారితీసింది.
రెండుసార్లు జరిగిన కాల్పుల్లో మొత్తం 17 మంది బడుగు జీవులు బలయ్యారు. ఒక జవాను సైతం ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం పరిణామాలపై ‘కోర్టు ఆఫ్ ఎంక్వైరీ’ కోసం ఆదేశాలు జారీ చేసినట్లు సైన్యం ప్రకటించింది. జనం దాడిలో తమ సైనికులు కొందరు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించింది. 17 మంది సాధారణ ప్రజలు చనిపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇది దురదృష్టకర సంఘటన అని పేర్కొంది.
కేంద్ర హోంశాఖ ఏం చేస్తోంది?
‘‘నాగాలాండ్‌లో సైన్యం కాల్పులపై కేంద్ర ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాలి. సొంత దేశంలోనే పౌరులకు, భద్రతా సిబ్బందికి రక్షణ లేని పరిస్థితి ఉంటే కేంద్ర హోంశాఖ ఏం చేస్తోంది. 17 మంది పౌరుల మరణం నా హృదయాన్ని కలచివేసింది’’ – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ
సమగ్ర దర్యాప్తు జరపాలి
‘‘నాగాలాండ్‌లో సైన్యం కాల్పుల్లో పౌరుల మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ – మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
Comments
Please login to add a commentAdd a comment