శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని ఉరి సెక్టార్లో గత కొన్నాళ్లుగా జరుగుతున్న చొరబాట్లను అడ్డుకునేందుకు ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ మంగళవారం ముగిసింది. ఈ ఆపరేషన్‌లో లష్కరే తోయిబాకి చెందిన 18 ఏళ్ల వయసున్న ఉగ్రవాది అలీ బాబర్ పాత్రాను సైనికులు బంధించారు. సైన్యం జరిపిన కాల్పుల్లో మరో ఉగ్రవాది కారి అనాజ్ మరణించాడు. భారత్‌లో భీకరదాడులకు పన్నాగాలు రచించినట్టుగా బాబర్ ఆర్మీ విచారణలో చెప్పాడు.
బారాముల్లాకు ఆయుధాలు తీసుకొని వెళ్లే పని తనకు అప్పగించారని తెలిపాడు. అతని దగ్గరనుంచి ఏకే–47 రైఫిల్స్, కమ్యూనికేషన్ సెట్, రెండు గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ ఆర్మీ స్వయంగా నిర్వహించిన ఉగ్రవాద శిక్షణ శిబిరంలో తాను పాల్గొన్నానని బాబర్ చెప్పాడు. సలాంబాదా నాలా నుంచి ఈ చొరబాటు యత్నాలు జరిగాయి. 2016లో ఈ మార్గం నుంచే ఉరి సెక్టార్‌లోకి చొరబడి ఆత్మాహుతి దాడులు నిర్వహించారు.
ఇస్లాం మతం ప్రమాదంలో పడిందని, కశ్మీర్‌లో ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని తప్పుడు ప్రచారం చేస్తూ స్వయంగా పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఈ ఉగ్రవాదులకు శిక్షణనిచ్చి భారత్‌లోకి పంపుతోంది. తాను పేదరికాన్ని తట్టుకోలేకే లష్కరేలో చేరానని పట్టుబడిన ఉగ్రవాది బాబర్ చెప్పాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన తమ కుటుంబం దుర్భర దారిద్య్రంలో ఉందని, తన తల్లి అనారోగ్యాలకు చికిత్స కోసం 20 వేలు ఇవ్వడంతో తాను వారి వలలో చిక్కుకున్నానని బాబర్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment