నేఫియో రియో, టీఆర్ జెలియాంగ్
కోహిమా: నాగాలాండ్ ప్రభుత్వం ఏర్పాటులో ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ నాగాలాండ్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ(ఎన్‌డీపీపీ) నేత నేఫియో రియో, నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్(ఎన్‌పీఎఫ్)కు చెందిన టీఆర్ జెలియాంగ్ గవర్నర్‌ను కలవటంతో రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. ఆదివారం ఉదయం ఎన్‌డీపీపీ నేత రియో గవర్నర్ పీబీ ఆచార్యను కలిసి తనకు 32 మంది సభ్యుల మద్దతు ఉందని చెప్పారు. అనంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ కూడా గవర్నర్ వద్దకు వెళ్లి మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని తెలిపారు.
వీరితో సమావేశాల అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. ఇద్దరికీ 48 గంటల సమయం ఇచ్చాననీ, మెజారిటీ సభ్యుల మద్దతుతో లేఖలు ఎవరు తీసుకువస్తే వారినే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరతానన్నారు. రియో వెంట ఎన్‌డీపీపీ అధ్యక్షుడు చింగ్వాంగ్ కొన్యాక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విసాసోలీ లౌంగు, జనతాదళ్(యు) ఎమ్మెల్యే, మరో స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారని గవర్నర్ చెప్పారు. రియోకు చెందిన ఎన్‌డీపీపీకి 18, బీజేపీకి 12 మంది సభ్యుల బలం ఉందని తెలిపారు. జెలియాంగ్‌కు చెందిన ఎన్పీఎఫ్‌కు 26 మంది సభ్యులుండగా ఇద్దరు నాగాలాండ్ పీపుల్స్ పార్టీ, ఒక జేడీయూ ఎమ్మెల్యే మద్దతు ఉందని చెప్పారన్నారు. అయితే ఇదే జేడీయూ ఎమ్మెల్యే రియోకు కూడా మద్దతు తెలిపారన్నారు. ఇలా ఉండగా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జెలియాంగ్ రాజీనామాకు నిరాకరించారు.
నాగాలాండ్‌లో సంకీర్ణ ప్రభుత్వం: రామ్‌మాధవ్
ఎన్‌డీపీపీతో కలిసి నాగాలాండ్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తెలిపారు. 60 సీట్లున్న అసెంబ్లీలో రెండు పార్టీలతోపాటు జేడీయూ, ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిపి సాధారణ మెజారిటీ ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment