సంపాదకీయం: చాలాకాలం తర్వాత సిద్ధాంతాలకూ, దృక్పథాలకూ అతీతంగా రాజకీయ పక్షాలన్నీ ఒకే స్వరాన్ని వినిపించాయి. దేశ భద్రతకు ముప్పువాటిల్లే సందర్భాలు ఏర్పడినప్పుడు మినహా మిగిలిన సమయాల్లో దాదాపు మృగ్యమైపోయిన ఏకీభావం ఈ పార్టీలన్నిటిమధ్యా వ్యక్తమైంది. ఎన్నికల సమయంలో పార్టీలు ఓటర్లకు చేసే ‘ఉచిత’ వాగ్దానాల విషయమై ఎన్నికల సంఘం సోమవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఒకటి, రెండు పార్టీలు మినహా అన్నీ ఏకాభిప్రాయాన్ని వెలిబుచ్చాయి. ఏ పార్టీకైనా అలాంటి వాగ్దానాలు చేసే హక్కుంటుందని, అందులో ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, మరే ఇతర సంస్థ జోక్యం అంగీకరించబోమని స్పష్టంచేశాయి.
ఆరు జాతీయ పార్టీలూ, 24 ప్రాంతీయపార్టీలూ పాల్గొన్న ఈ సమావేశంలో జాతీయ పార్టీ అయిన బహుజన సమాజ్ పార్టీ(బీఎస్‌పీ) ఒక్కటే భిన్నంగా స్పందించగా, నాగా పీపుల్స్ ఫ్రంట్, మిజో నేషనల్ ఫ్రంట్ దానితో గొంతు కలిపాయి. కొన్ని పార్టీలు చేసే వాగ్దానాలు ఓటర్లను ప్రలోభపెట్టడం వాస్తవమేనని, ఈ పరిస్థితి ఎన్నికల క్షేత్రంలో పార్టీలకు ఉండాల్సిన సమానావకాశాలను దెబ్బతీస్తున్నదని ఈ మూడు పార్టీలూ ఆరోపిస్తున్నాయి. ‘ఉచిత’ హామీలను నియంత్రించేలా మార్గదర్శకాలను రూపొందించాలని గత నెలలో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇలాంటి హామీలవల్ల ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలన్న స్ఫూర్తి దెబ్బతింటున్నదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఎన్నికల సంఘం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది.
దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో బీఎస్‌పీ ఒక్కటే భిన్న స్వరం వినిపించడానికి కారణం ఉంది. గత ఏడాది జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఇచ్చిన ఇలాంటి హామీల కారణంగానే తాను ఓడిపోయానని బీఎస్‌పీ భావిస్తోంది. మరి సమాజ్‌వాదీ చేసిన వాగ్దానాలు అలాంటివి! వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మద్దతు ధర వచ్చేలా చేయడం దగ్గరనుంచి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్ధులకు ల్యాప్‌టాప్‌లు, మెట్రిక్ ఉత్తీర్ణులైనవారికి ట్యాబ్‌లు, అర్హులైన నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయల భత్యం, రైతుల రుణాల మాఫీ, ఉచిత విద్యుత్ వంటివెన్నో అందులో ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ అమలుచేస్తే ఒక్కోదానికి వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిరీత్యా ఇది మంచిదికాదని కొందరు ఆర్ధికవేత్తలు గుండెలు బాదుకున్నారు. మాయావతి కూడా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయకపోలేదు. అయితే, ఆమె మరో దోవను ఎంచుకున్నారు. యూపీని నాలుగు రాష్ట్రాలుగా విడగొట్టాలని కోరుతూ అసెంబ్లీ చివరి సమావేశంలో తీర్మానం ఆమోదింపజేశారు. ప్రజల్లో ప్రాంతీయ ఆకాంక్షలను పెంచితే అది తనకు ఉపయోగపడుతుందని ఆమె విశ్వసించారు. కానీ, ఆమె కోరుకున్న స్పందన కరువైంది. ఓటర్లు సమాజ్‌వాదీవైపే మొగ్గుచూపారు.
ఎన్నికల్లో వాగ్దానాలు చేయడం, ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించడం ఉత్తరప్రదేశ్‌కో, తమిళనాడుకో పరిమితమైన ధోరణి మాత్రమే కాదు. అలాగే, వాగ్దానాలు చేసిన పార్టీలన్నీ గెలుస్తాయనిగానీ, గెలిచినవారంతా గద్దెనెక్కాక ఆ హామీలను నిలుపుకుంటారనిగానీ చెప్పడానికి లేదు. మద్యపాన నిషేధం, కిలో రెండు రూపాయల పథకంవంటి వాగ్దానాలతో 1995 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అధినేత ఎన్టీఆర్ వాటి అమలు ప్రారంభించిన కొన్నాళ్లకే చంద్రబాబువల్ల పదవి కోల్పోయారు. తాను గద్దెనెక్కాక చంద్రబాబు ఆ రెండు వాగ్దానాలకూ తిలోదకాలిచ్చారు. ప్రపంచీకరణ, ఉదారవాద విధానాలే అన్నిటినీ శాసిస్తున్న తరుణంలో సామాన్య ప్రజల తక్షణ ప్రయోజనాలకూ, దీర్ఘకాలిక అభివృద్ధికీ మధ్య సమతూకాన్ని పాటిస్తూ సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలుచేసినవారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. 2004లో రైతులకు ఉచిత విద్యుత్ వాగ్దానం చేసినప్పుడు అది ఆచరణ సాధ్యంకాదని కాంగ్రెస్‌లోనే ఎందరో వాదించారు.
స్వయంగా ఆర్ధికవేత్త అయిన ప్రధాని మన్మోహన్‌సింగ్ ఈ పథకం అమలుపై ఎన్నో అనుమానాలు వ్యక్తంచేశారు. కానీ, వైఎస్ దాన్ని అయిదేళ్లూ సమర్ధవంతంగా అమలుచేశారు. అదే సమయంలో రాష్ట్రంలో విద్యుదుత్పాదనా సామర్ధ్యాన్ని పెంచడానికి ప్రణాళికలు వేశారు. విద్యుత్ చార్జీలను పెంచబోమన్న హామీని కూడా ఆయన అదేవిధంగా నిలుపుకున్నారు. ఎన్నికల వాగ్దానాల్లో లేని ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్‌వంటి పథకాలనెన్నిటినో ఆయన అమలు చేశారు. అందువల్లే 2009 ఎన్నికల్లో చంద్రబాబు నగదు బదిలీ పథకంనుంచి నిరుద్యోగ భృతివరకూ...ఉచిత బియ్యం పథకంనుంచి కలర్ టీవీల వరకూ ఎన్నో వాగ్దానాలు చేశారు. అయితే, ప్రజలు తెలుగుదేశాన్ని తిరస్కరించి, కొత్తగా ఒక్క వాగ్దానమూ చేయని వైఎస్‌వైపే మొగ్గుచూపారు.
రాజకీయ పార్టీలు విధానాలు, కార్యక్రమాలు రూపొందించుకోవడం చిన్న విషయమేమీ కాదు. ఆ విధానాలైనా, కార్యక్రమాలైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేకపోతే, వారిని మెప్పించలేకపోతే ఆ పార్టీలు తమ లక్ష్యసాధనలో విజయం సాధించలేవు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయడం, వాటి పరిష్కారానికి పథకాలు రూపకల్పన చేయడం, ప్రజల ఆదరణను పొందడం ఒక సృజనాత్మక ప్రక్రియ. హామీలివ్వడంలో పార్టీలు అప్పుడప్పుడు హద్దు మీరుతున్నాయనడంలో నిజం లేకపోలేదుగానీ...దానికి విరుగుడు ఈ సృజనాత్మక ప్రక్రియపై ఆంక్షలు విధించడం కాదు. ఎన్నికల ప్రచారంలో పార్టీల వాగ్దానాలపై విస్తృతమైన చర్చ జరుగుతుంది. వాగ్దానాలకంటే ముందు అవి చేసిన వారెవరన్న అంశాన్ని ప్రజలు ప్రధానంగా చూస్తారు. వారి విశ్వసనీయత, సమర్ధత ఏపాటివో అంచనా వేసుకుంటారు. అనర్హులనుకున్నవారిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు. అంతేతప్ప ఆ వ్యామోహంలోపడి కొట్టుకుపోరు. పార్టీల వాగ్దానాలు కట్టుదాటుతున్నాయని ఆదుర్దా పడేవారు మన ఓటర్ల రాజకీయ పరిణతిని తక్కువ అంచనా వేస్తున్నామని మరిచిపోతున్నారు.
‘ఉచితం’పై ఏకాభిప్రాయం!
Published Wed, Aug 14 2013 1:17 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
Advertisement
Advertisement