ప్రధాని నరేంద్ర మోదీ ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : నాగాలాండ్ రాష్ట్రానికి ఫిబ్రవరి 27వ తేదీన జరుగనున్న ఎన్నికల్లో పోటీ చేయరాదని పాలకపక్ష నాగా పీపుల్స్ ఫ్రంట్, దాని మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ సహా పది రాజకీయ పార్టీలు నిర్ణయించడం, అందుకు అనుగుణంగా ఓ అంగీకార పత్రంపై సోమవారం సంతకాలు కూడా చేయడం తెల్సిందే. ఆ మరుసటి రోజే పార్టీ అధిష్టానం ఒత్తిడి మేరకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మాట మార్చింది. ఇలాంటి విషయాల్లో నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని, కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు తాము రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా రాష్ట్ర నాయకులు ప్రకటించారు.
ఎన్నికల్లో పోటీ చేయమంటూ నిర్ణయం తీసుకున్న వివిధ పార్టీల సమావేశానికి హాజరైన ఇద్దరు బీజేపీ నేతలను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలిమ్ (ఐ–ఎం)తో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గతంలో చేసుకున్న శాంతి ఒప్పందాన్ని అమలు చేసే వరకు ఎన్నికలను వాయిదా వేయడం మంచిదని నాగాలాండ్ ట్రైబల్ హొహోస్, పౌర సంఘాల కోర్ కమిటీ పిలుపునివ్వగా సోషలిస్ట్ కౌన్సిల్ సహా పలు పార్టీలు ఆమోదం తెలిపాయి. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న నాగాల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నాగాల గ్రూపులతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం వివరాలేమిటీ ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. వాటిని అమలు చేయాలని మాత్రం అన్ని పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్రంలోని పార్టీ అధిష్టానికి నచ్చచెప్పేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఢిల్లీకి వెళుతోంది. జనవరి 31వ తేదీన ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాగా, ఎన్నికలకు నిరసనగా ఫిబ్రవరి ఒకటవ తేదీన నిర్వహించిన నాగాలాండ్ బంద్ విజయవంతమైంది. అన్ని నాగాలాండ్ పార్టీలను కాదని భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే రాష్ట్రంలో హింసాకాండ ప్రజ్వరిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలాగా రాష్ట్ర పార్టీ శాఖలపై పెత్తనం చెలాయించమని చెప్పుకునే బీజేపీ అధిష్టానం రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించకపోతే అందుకు తగిన మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment