సమస్య ఎదురైనప్పుడు సకాలంలో దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించకపోతే ఉన్నకొద్దీ అది జటిలంగా మారుతుంది. ఫిబ్రవరి 27న జరిగే నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని మొన్న సోమవారం పాలక నాగా పీపుల్స్ ఫ్రంట్, బీజేపీ, కాంగ్రెస్‌లతోసహా 11 రాజకీయ పక్షాలు, వివిధ గిరిజన మండళ్లకు ప్రాతి నిధ్యంవహించే హోహో, ఇతర పౌర సమాజ సంస్థలు నిర్ణయించడం దీన్నే సూచిస్తోంది. ఈ ఉమ్మడి ప్రకటన నుంచి రాష్ట్ర బీజేపీ విభాగం ఆ తర్వాత తప్పుకుని, సమావేశానికి పార్టీ తరఫున వెళ్లిన ఇద్దరు నేతలను సస్పెండ్‌చేసి ఉండొచ్చుగానీ... అంతమాత్రాన పరిస్థితి తీవ్రత తగ్గదు. దాదాపు రెండున్నరేళ్ల క్రితం నాగాలాండ్ సమస్యపై కేంద్రం కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా ఎన్నికల్లోగా పరిష్కారాన్ని ప్రకటించాలన్నదే వారి ఏకైక డిమాండు.
కేంద్రంలో అధికారంలోకొచ్చినవెంటనే ఎన్‌డీఏ ప్రభుత్వం నాగాలాండ్ సమస్యపై దృష్టి పెట్టి ఏడాది తిరగకుండానే 2015లో అక్కడి ప్రధాన మిలిటెంట్ సంస్థ నేషనల్ సోష లిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్–ఇసాక్, మ్యూవా (ఎన్‌ఎస్‌సీఎన్–ఐఎం) వర్గంతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు సర్వత్రా హర్షామోదాలు వ్యక్తమయ్యాయి. నిజాని కది పూర్తి స్థాయి ఒప్పందం కాదు. ఒప్పందానికి సంబంధించిన స్వరూపం (ఫ్రేమ్‌వర్క్) మాత్రమే. దీని ప్రాతిపదికన రాగలకాలంలో విస్పష్టమైన విధివిధానా లతో, సవివరమైన ఒప్పందం రూపొందుతుందని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రక టించింది. కానీ ఇంతకాలమైనా ఆ ఫ్రేమ్‌వర్క్‌లోని అంశాలూ బయటకు రాలేదు. ఆ ప్రాతిపదికన ఒప్పందమూ ఖరారు కాలేదు. పర్యవసానంగా ఇప్పుడీ సంక్షోభం ఏర్పడింది.
నాగాలాండ్ అసెంబ్లీ మొన్న డిసెంబర్ 14న ఎన్నికలకు ముందే నాగా రాజ కీయ సమస్యకు ‘గౌరవనీయమైన, ఆమోదయోగ్యమైన’ పరిష్కారాన్ని ప్రకటించా లని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసింది. ఆ తర్వాత జనవరిలో నాగా హోహో, ఇతర పౌర సమాజ సంస్థల ప్రతినిధులు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఎన్నికలను కొద్దికాలం వాయిదా వేసి ముందుగా పరిష్కారాన్ని ఖరారు చేయాలని కోరారు. 2015 నుంచి ఇప్పటివరకూ అనేక దఫాలు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకూ, ఎన్‌ఎస్‌సీఎన్(ఐఎం) ప్రతినిధులకూ మధ్య చర్చలు జరిగినా కొలిక్కిరాని వ్యవ హారం కొన్ని రోజుల వ్యవధిలో తేలిపోతుందని అనుకోవడం సహేతుకం కాకపో యినా నాగా ప్రతినిధులకు కేంద్రం కనీసం నచ్చజెప్పే ప్రయత్నం చేయాల్సింది. ఎన్‌ఎస్‌సీఎన్–ఐఎంతో ఒప్పందం కుదిరినప్పుడు న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో స్వయంగా నరేంద్రమోదీ పాల్గొన్నారు.
‘ఇది ఒక సమస్యకు అంతం పలకడం మాత్రమే కాదు... నూతన భవిష్యత్తు దిశగా వేస్తున్న ముందడుగు కూడా...’ అని ఆ రోజు ఆయన వ్యాఖ్యానించారు. ఒప్పందానికి ముందు నరేంద్ర మోదీ కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్‌తోసహా వివిధ పక్షాల నాయకులతో మాట్లా డారు. దురదృష్టవశాత్తూ అనంతరకాలంలో ఒప్పందం ఖరారుకు సంబంధించిన కార్యాచరణ కనబడలేదు. నాగాలాండ్ సమస్య అత్యంత క్లిష్టమైనదనడంలో సందేహం లేదు. ఇప్పుడున్న నాగాలాండ్‌కు తోడు నాగా ప్రజలు అధికంగా నివ సించే మణిపూర్‌లోని నాలుగు జిల్లాలు, అస్సాంలోని రెండు జిల్లాలు, అరుణా చల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలూ కలిపి విశాల నాగాలాండ్ కావాలని ఎన్‌ఎస్‌సీఎన్ (ఐఎం) కోరుతోంది. అంతేకాదు... మయన్మార్‌లో నాగాలు నివసించే ఒకటి రెండు ప్రాంతాలను కూడా దీంతో విలీనం చేయాలంటున్నది. ఈ ప్రాంతాల్లో తమ జాతి ప్రజలు 12 లక్షలమంది ఉన్నారని, వారు నిత్యం వివక్షను ఎదుర్కొంటున్నారని ఎన్‌ఎస్‌సీఎన్(ఐఎం) ఆరోపిస్తోంది.
నాగా ప్రజలు నివసించే ప్రాంతాలను భారత్‌లో విలీనం చేసి విశాల నాగాలాండ్ ఏర్పాటుకు సహకరించమని మయన్మార్‌ను కోరడం అసాధ్యం. వారి వరకూ ఎందుకు... అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లను ఒప్పించడం కూడా కష్టతరమైన విషయం. అందుకే ఎన్‌ఎస్‌సీఎన్(ఐఎం)తో ఒప్పందం కుదిరి నట్టు ప్రకటన వెలువడినప్పుడు అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఒప్పందం వివరాలేమిటో చెప్పాలని మణిపూర్, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల పార్టీలు, ఇతర సంస్థలు కోరినప్పుడు ఇప్పుడున్న భౌగోళిక సరిహద్దులు మారబోవని కేంద్రం హామీ ఇచ్చింది. అలా మారకుండా విశాల నాగాలాండ్ ఎలా సాధ్యమని అందరూ ఆశ్చర్యపోయారు. అటు ఎన్‌ఎస్‌సీఎన్(ఐఎం) నాయ కత్వం కూడా దీన్ని గురించి మాట్లాడలేదు. తమ దీర్ఘకాల డిమాండుకు ‘గౌర వనీయమైన పరిష్కారం’ లభించిందన్నదే వారి జవాబు.
సమస్య ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ముడిపడి ఉన్నది కనుక ఆ రాష్ట్రాల సీఎంలను కూడా చర్చల్లో భాగస్వాములను చేసి ఉంటే, నాగాల డిమాండులోని సహేతుకతను వారు గుర్తించేలా చేయగలిగితే బహుశా అలాంటి ‘గౌరవనీయమైన పరిష్కారం’ సాధ్యమయ్యేదేమో. ఒప్పందం ఖరారుకు ఇంత సమయం కూడా పట్టేది కాదేమో. ప్రస్తుతం అస్సాం, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లు బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలకు చెందిన భూభాగాన్ని నాగాలాండ్‌కు ధారదత్తం చేస్తారని ఏమాత్రం అనుమానాలు తలెత్తినా అక్కడ రాజకీయంగా తీవ్ర నష్టం చవిచూడాల్సివస్తుందని బీజేపీ అగ్ర నాయకత్వానికి తెలుసు. అందుకే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఆర్‌ఎన్ రవికి, నాగా ప్రతినిధులకు మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న చర్చల గురించి ఎవరూ నోరుజారలేదు.
బ్రిటిష్ వలస పాలకుల హయాంలో రగుల్కొని స్వాతంత్య్రా నంతరం కూడా కొనసాగుతూ దశాబ్దాలుగా ఎంతో హింసను చవిచూసిన నాగా లాండ్ విషయంలో అన్ని పక్షాలూ పట్టువిడుపులతో వ్యవహరించాలి. ఎన్నికలు సజావుగా సాగడానికి నాగాలాండ్ లోని పార్టీలనూ, సంస్థలనూ ఒప్పించేందుకు... అది సాధ్యపడకపోతే కొద్దికాలం వాటిని వాయిదా వేయడానికి కూడా కేంద్రం వెన కాడకూడదు. సమస్యపై ఒప్పందం కుదిరి, దానికి కొనసాగింపుగా చర్చలు సాగు తున్న ఈ దశలో ఎవరు మొండి పట్టుదలకు పోయినా సమస్య మళ్లీ మొదటి కొస్తుందని మరువకూడదు.
Comments
Please login to add a commentAdd a comment