హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పెద్ద హైడ్రామా చోటు చేసుకుంటోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తలకిందులుగా మారాయి. తమదే గెలుపని ధీమాతో ఉన్న కాంగ్రెస్‌కు ఫలితాలు ఊహించని షాక్‌నిచ్చాయి. 10 ఏళ్ల తర్వాత అధికారాన్ని చేపట్టబోతున్నామనే హస్తం ఆశలను ఫలితాలు ఆవిరి చేశాయి. మొదట కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యం కనబరిచినప్పటికీ.. అనూహ్యంగా బీజేపీ పుంజుకొని ఎవరూ ఊహించని విధంగా.. హ్యట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది.
హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ ఫలితాలు ఊహించలేదని, వీటిని తాము అంగీకరించడం లేదని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో జైరాం రమేష్ మాట్లాడుతూ.. హర్యానాలో ఫలితాలు పూర్తిగా ఊహించనివి అని తెలిపారు. పూర్తిగా ఆశ్చర్యం కలిగించాయని, ప్రతికూలమైనవని తెలిపారు.
‘ఫలితాలు వాస్తవికతకు విరుద్ధంగా ఉన్నాయి. హర్యానాలో ప్రజలు కోరుకున్న మార్పు, పరివర్తనకు వ్యతిరేకంగా ఉన్నాయి. నేఈ పరిస్థితుల్లో నేడు మనం చూసిన ఫలితాలను అంగీకరించడం సాధ్యం కాదు. హర్యానాలో మనం చూసింది తారుమారైన విజయం. ప్రజల అభీష్టాన్ని, పారదర్శక, ప్రజాస్వామ్య ప్రక్రియలకు ఓటమి. హర్యానా అధ్యాయం పూర్తి కాలేదు.
మూడు జిల్లాల్లో ఈవీఎం ట్యాంపరింగ్
"మధ్యాహ్నం అంతా, నేను ఎన్నికల కమిషన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాను. వారు నా ఫిర్యాదులకు సమాధానమిచ్చారు, వారి సమాధానానికి నేను ప్రత్యుత్తరం ఇచ్చాను. కనీసం మూడు జిల్లాల నుంచి లెక్కింపు ప్రక్రియ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పనితీరుపై మాకు చాలా తీవ్రమైన ఫిర్యాదులు అందాయి. వీటి సమాచారం సేకరిస్తున్నాం. నేడు లేదా రేపటికి దీనిని ఎన్నికల కమిషన్‌కు అందజేస్తాం.’ అని పేర్కొన్నారు.
అంతకముందు కూడా కౌంటింగ్ అప్‌డేట్‌లో జాప్యంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఈసీ వెబ్‌సైట్‌లో ఫలితాల అప్‌డేట్ లేదని, మందకొడిగా సాగుతోందని ఫిర్యాదు లేఖలో పేర్కొంది. మీడియాలో వస్తోన్న ఫలితాల సరళితో పోల్చినప్పుడు ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ ఆలస్యంగా ఉంటుందని తెలిపింది. వెబ్‌సైట్‌ను వాస్తవమైన, ఖచ్చితమైన గణాంకాలతో అప్‌డేట్ చేయాలంటూ తమ అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలని ఈసీని కోరింది. దీనివల్ల హానికరమైన తప్పుడు వార్తలను నివారించవచ్చని తెలిపింది.
అయితే కాంగ్రెస్ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. మీఆరోపణలు పూర్తిగా ఊహాజనితమని, బాధ్యతారహితంగా ఉన్నాయని పేర్కొంది. నిరాధార ఆరోపణలతో తప్పుదారి పట్టించవద్దని సమాధానమిచ్చింది. ప్రతి ఐదు నిమిషాలకు అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 25 రౌండ్లు అప్‌డేట్ అవుతున్నాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment