
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల వెల్లడి తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింస, అల్లర్లకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించిన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తొమ్మిది కేసులను నమోదుచేసింది. హింసాత్మక ఘటనలపై దర్యాప్తు నిమిత్తం నాలుగు ప్రత్యేక బృందాలను సీబీఐ ఆయా చోట్లకు పంపినట్లు గురువారం విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బెంగాల్ ప్రభుత్వం తమకు అప్పజెప్పిన కేసులతోపాటు మరికొన్ని కేసుల నమోదు ప్రక్రియను సీబీఐ కొనసాగిస్తోంది. పలు హత్యలు, అత్యాచారాలు జరిగాయన్న ఆరోపణలపై ఐదుగురు జడ్జిల కలకత్తా హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు కేసుల విచారణ బాధ్యతలను సీబీఐ తీసుకుంది.
మే 2న ఎన్నికల ఫలితాలొచ్చాక జరిగిన హింసపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుని హైకోర్టు గతంలో ఈ ఆదేశాలిచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీపై అధికార తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. పలు వినతుల నేపథ్యంలో కేసుల దర్యాప్తునకు బెంగాల్ పోలీసుల నేతృత్వంలో సిట్ ఏర్పాటుకు హైకోర్టు గతంలో ఆదేశించింది. సీబీఐ, సిట్ వేర్వేరుగా 6 వారాల్లోగా దర్యాప్తు నివేదికలను సమర్పించాలని హైకోర్టు సూచించింది. కేసులు ఉపసంహరించుకోండంటూ బెదిరించారని, చాలా హత్యలను సహజ మరణాలుగా చిత్రీకరించి కనీసం ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయించలేదని హైకోర్టుకు బాధితులు గతంలో విన్నవించుకున్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించనందునే స్వతంత్ర దర్యాప్తు అవసరమనే నిర్ణయానికొచ్చామని కోర్టు వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment