ఏదైనా అత్యంత భయానక ప్రకృతి విపత్తు వస్తేనో, ఏదైనా పెద్ద ఆస్టరాయిడ్ ఢీకొంటేనో.. భూమ్మీది జీవరాశిలో చాలా వరకు నామరూపాలు లేకుండా పోవడం ఖాయం. కానీ ఓ ఐదు రకాల జీవులు మాత్రం బతికి ఉండగలుగుతాయట. వాటికి ఉన్న ప్రత్యేక లక్షణాలు, కఠిన పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అవేమిటో తెలుసుకుందామా..
టాప్‌లో టార్డిగ్రేడ్‌లు..
జీవులన్నింటిలో అత్యంత కఠిన పరిస్థితులను తట్టుకుని బతకగలిగే అతి చిన్న జీవులు టార్డిగ్రేడ్లు. నీటిలో జీవిస్తుండటం, ఎలుగుబంటిని పోలి ఉండటంతో వీటిని వాటర్ బేర్‌లు అని కూడా పిలుస్తారు. 150 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలను, మైనస్ 70 డిగ్రీల వరకు తీవ్ర చలిని ఇవి తట్టుకోగలవు. ఆక్సిజన్, ఆహారం, నీళ్లు లేని పరిస్థితుల్లోనూ వారాలకు వారాలు బతికేస్తాయి. అందుకే ప్రళయమొచ్చినా బతికే జీవుల్లో టార్డిగ్రేడ్లు టాప్‌లో ఉన్నాయి.
బొద్దింకలూ బతికేస్తాయి..
మనను నానా చికాకు పెట్టే బొద్దింకలను అంత ఈజీగా తీసుకోవద్దు. ఎందుకంటే ఎన్నో విపత్కర పరిస్థితులను తట్టుకునే శక్తి వాటి సొంతం. డైనోసార్లతో కలిసి జీవించిన బొద్దింకలు.. భూమిని ఆస్టరాయిడ్ ఢీకొన్నప్పుడు డైనోసార్లు అంతమైపోయినా బతకగలిగాయి. మట్టిలో, రాళ్లలో, మరెక్కడైనా దూరిపోయి దాక్కోవడం, ఏది దొరికితే దాన్ని తిని బతికేయడం, చాలా వరకు విషపదార్థాలను, రేడియేషన్‌ను కూడా తట్టుకోగలగడం వీటి స్పెషాలిటీ. అందుకే ఎంత తీవ్ర విపత్తు వచ్చినా బొద్దింకలు బతికే అవకాశాలు ఎక్కువట.
రాబందులను తక్కువగా చూడొద్దు
భూమ్మీద ప్రకృతి విపత్తు వచ్చే స్థాయిని బట్టి కొన్ని రకాల జంతువులకు లాభమూ జరుగుతుంది. అలాంటివాటిలో రాబందులు ఒకటి. ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనడం వంటివి జరిగితే.. గాల్లో అంతెత్తున, చాలా దూరం ప్రయాణించి తప్పించుకోగలవు. విపత్తుల మరణించే జంతువుల మాంసాన్ని తింటూ బతికేయగలవు. కుళ్లిన మాంసంలో పెరిగే బ్యాక్టీరియాను, ఇతర సూక్ష్మజీవులను కూడా డైజెస్ట్ చేయగల యాసిడ్లు రాబందుల జీర్ణాశయంలో ఉత్పత్తి అవుతాయి.
షార్క్‌లకు విపత్తులంటే లెక్కే లేదు..
భూమ్మీది పురాతన జీవుల్లో షార్క్ చేపల జాతి కూడా ఒకటి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. భూమ్మీద చెట్లు ఏర్పడకముందే సముద్రాల్లో షార్క్‌ల జాతి ఉద్భవించి జీవిస్తున్నాయి. తర్వాత జరిగిన ప్రకృతి ఉత్పాతాల్లో డైనోసార్లు సహా ఎన్నో జీవజాతులు అంతరించినా షార్క్‌లు మాత్రం బతికేస్తూనే ఉన్నాయి. సముద్రాల్లో అత్యంత లోతున, ఎలాంటి వెలుగు ప్రసరించని చోట, తీవ్ర పీడనాన్ని తట్టుకుని బతకగలగడం షార్క్‌ల స్పెషాలిటీ. ఇప్పుడు మరో విపత్తు వచ్చినా అవి తట్టుకుని బతికేయగలవు మరి.
ఎంపరర్ పెంగ్విన్లకూచాన్స్ ఎక్కువే..
అంటార్కిటికా ఖండంలో ఉండే అత్యంత శీతల పరిస్థితులను, గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకుని జీవిస్తున్న జంతువులు ఎంపరర్ పెంగ్విన్‌లు. వాటి శరీరంలో గణనీయంగా కొవ్వు ఉంటుంది. కొన్నివారాల పాటు ఆహారం లేకున్నా బతికేయగలవు. పైగా అవి ఉన్న ప్రాంతాల్లో విపత్తులు ఏర్పడే అవకాశాలూ తక్కువని, నిక్షేపంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ప్రళయమొచ్చినా..ఈ ఐదూ బతికేస్తాయట!
Published Sun, Jun 16 2024 5:07 AM | Last Updated on Sun, Jun 16 2024 5:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment