మహాప్రాణులకు మళ్లీ జీవం! | Extinct animals coming back to life | Sakshi
Sakshi News home page

మహాప్రాణులకు మళ్లీ జీవం!

Published Sun, Nov 3 2024 7:45 AM | Last Updated on Sun, Nov 3 2024 9:29 AM

Extinct animals coming back to life

డైనోసార్లు, మామత్‌లు వంటి ప్రాణులను ఇప్పటి వరకు సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాల్లోనూ, టీవీ సిరీస్‌లలోను మాత్రమే చూశాం. ఇలాంటి ప్రాణుల్లో కొన్ని త్వరలోనే మన కళ్ల ముందు సజీవంగా కనిపించనున్నాయి. సహస్రాబ్దాల కిందట అంతరించిపోయిన ప్రాణులు మొదలుకొని, మన కళ్ల ముందే కనుమరుగైపోయిన చాలా ప్రాణులు తిరిగి ప్రాణం పోసుకోనున్నాయి. అంతరించిపోయిన ప్రాణుల పునరుత్థానానికి ఇప్పటి శాస్త్రవేత్తలు సాగిస్తున్న ప్రయత్నాలపై ఒక విహంగ వీక్షణమే ఈ కథనం.

పన్యాల జగన్నాథదాసు
ఈ భూమ్మీద తొలి జీవకణం ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలీదు. భూమ్మీద మనుషులు పుట్టక ముందే ఎన్నో జీవజాతులు ప్రాణం పోసుకున్నాయి. వాటిలో కొన్ని జీవజాతులు ఆదిమానవుల కాలంలోనే అంతరించిపోయాయి. మన కాలంలోనూ మరికొన్ని జీవజాతులు అంతరించిపోయాయి. ఇంకొన్ని జీవజాతులు ప్రమాదం అంచుల్లో అంతరించిపోయే దశకు చేరువగా ఉన్నాయి. ఒకప్పుడు భూమ్మీద సంచరించిన డైనోసార్లు, మామత్‌లు వంటి వాటి గురించి పుస్తకాల ద్వారా, సైన్స్‌ఫిక్షన్‌ సినిమాల ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతున్నామే తప్ప వాటిని ఈ భూమ్మీద సజీవంగా చూసిన మనుషులెవరూ ఇప్పుడు లేరు. 

శతాబ్దాల కిందటే అంతరించిన కొన్ని జీవజాతులు సమీప భవితవ్యంలోనే తిరిగి మన కళ్ల ముందు కనిపించనున్నాయి. అంతరించిపోయిన ప్రాణుల పునరుజ్జీవానికి శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా కొనసాగిస్తున్న ప్రయోగాల్లో కొన్ని ఒక కొలిక్కి వచ్చాయి. మరో నాలుగేళ్లలోనే మామత్‌కు మళ్లీ ప్రాణం పోయనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే రీతిలో మరిన్ని జీవులకూ పునర్జీవం కల్పించనున్నట్లు చెబుతున్నారు. అంతరించిపోయిన జీవులకు తిరిగి ప్రాణం పోసే ప్రక్రియను ‘జైవ పునరుత్థానం’గా (బయో రిసరెక్షన్‌) అభివర్ణిస్తున్నారు.

మరో నాలుగేళ్లలోనే మామత్‌ పునరుత్థానం
ఎప్పుడో మంచుయుగంలో అంతరించిపోయిన ప్రాణి మామత్‌. ఏనుగులాంటి భారీ జంతువు ఇది. దీనికి ఏనుగులాగానే తొండం, దంతాలతో పాటు ఒంటి నిండా దట్టంగా రోమాలు ఉండేవి. భూమ్మీద మంచు యుగం 26 లక్షల ఏళ్ల కిందటి నుంచి 11 వేల ఏళ్ల కిందటి వరకు కొనసాగింది. ఆ కాలంలోనే మామత్‌ భూమ్మీద సంచరించేది. మంచుయుగం ముగిసిన తర్వాత మామత్‌ జనాభా క్రమంగా క్షీణించింది. నాలుగు వేల ఏళ్ల కిందట ఇది పూర్తిగా అంతరించిపోయింది. సహస్రాబ్దాల కిందటే అంతరించిపోయిన మామత్‌కు పునర్జీవం కల్పించేందుకు శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మామత్‌ 2028 నాటికల్లా పునరుత్థానం చెందుతుందని, అప్పటికల్లా దీనికి మళ్లీ ప్రాణం పోయనున్నామని అమెరికన్‌ స్టార్టప్‌ కంపెనీ ‘కలోసల్‌ బయోసైన్సెస్‌’కు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల ప్రకటించారు.

‘కలోసల్‌ బయోసైన్సెస్‌’ అమెరికాలోని తొలి డీ–ఎక్స్‌టింక్షన్‌ కంపెనీ. మామత్‌ పునరుత్థానం కోసం దీనికి చెందిన అత్యంత కీలకమైన జన్యువులను సేకరించామని ఈ కంపెనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రాణుల పునరుత్థానం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కంపెనీకి ‘పేపాల్‌’ సహ వ్యవస్థాపకుడు పీటర్‌ థీల్, సెలబ్రిటీ మోటివేషనల్‌ స్పీకర్‌ టోనీ రాబిన్స్‌ వంటి ప్రముఖులే కాకుండా, అమెరికన్‌ గూఢచర్య సంస్థ సీఐఏ కూడా భారీ స్థాయిలో నిధులు సమకూరుస్తున్నట్లు అమెరికన్‌ వార్తా సంస్థ ‘ది ఇంటర్‌సెప్ట్‌’ వెల్లడించింది. ‘తొలి మామత్‌కు 2028 ద్వితీయార్ధం నాటికల్లా ప్రాణం పోయాలని లక్ష్యం నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం అదే పనిలో పురోగతిలో కొనసాగుతున్నాం.

అంతరించిపోయిన జీవుల్లో మొదటిగా పునరుత్థానం పొందే ప్రాణి మామత్‌ మాత్రమే కాగలదు. దీని గర్భధారణ వ్యవధి ఇరవైరెండు నెలలు. మామత్‌ జన్యువుల్లో 99.5 శాతం జన్యువులు ఆసియన్‌ ఏనుగుల్లో ఉన్నాయి. జన్యు సవరణ, మూలకణాల అనుసంధానం ప్రక్రియల ద్వారా ఆడ ఆసియన్‌ ఏనుగు అండానికి ఫలదీకరణ జరిపి మామత్‌కు పునరుత్థానం కల్పించనున్నాం’ అని కలోసల్‌ బయోసైన్సెస్‌ సీఈవో బెన్‌ లామ్‌ తెలిపారు.

‘జురాసిక్‌ పార్క్‌’ మాదిరిగా కాదు 
స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ దర్శకత్వంలోని సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా ‘జురాసిక్‌ పార్క్‌’ చాలామంది చూసే ఉంటారు. ఇదే పేరుతో మైకేల్‌ క్రైటన్‌ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో ఒక పారిశ్రామికవేత్త క్లోనింగ్‌ ద్వారా పునర్జీవం కల్పించిన డైనోసార్లతో ఒక థీమ్‌ పార్కు ఏర్పాటు చేస్తాడు. డైనోసార్ల బాగోగులను చూసుకునే ఒక వ్యక్తిని వెలాసిరేప్టర్‌ జాతికి చెందిన డైనోసార్‌ చంపేస్తుంది. ఇందులో క్లోనింగ్‌ కోసం అంతరించిన డైనోసార్ల డీఎన్‌ఏ ఉపయోగించినట్లుగా ఉంది. కలోసల్‌ బయోసైన్సెస్‌ జరుపుతున్న ప్రయోగాల్లో మాత్రం డీఎన్‌ఏను నేరుగా ఉపయోగించడం లేదు. ‘ జురాసిక్‌ పార్క్‌లో మాదిరిగా మేము మామత్‌ డీఎన్‌ఏను తీసుకుని, దాంతో ఆసియన్‌ ఏనుగు జన్యువుల రంధ్రాలను పూడ్చే పని చేయడం లేదు. సవరించిన మామత్‌ జన్యువులను, మూలకణాలను ఆరోగ్యకరమైన ఆడ ఆసియన్‌ ఏనుగు అండంలోకి ప్రవేశపెట్టి ఫలదీకరణ జరపనున్నాం’ అని బెన్‌ లామ్‌ వివరించారు.

దశాబ్ద కాలంగా సంఘటిత కృషి 
అంతరించిపోయిన ప్రాణుల పునరుత్థానికి దాదాపు దశాబ్ద కాలంగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సంఘటితంగా కృషి చేస్తున్నారు. ప్రాణుల పునరుత్థాన ప్రయోగాల కోసం ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌కు (ఐయూసీఎన్‌) చెందిన స్పీసీస్‌ సర్వైవల్‌ కమిషన్‌ 2014లో డీ ఎక్స్‌టింక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇందులో వివిధ దేశాలకు చెందిన తొమ్మిదివేల మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఈ టాస్క్‌ఫోర్స్‌లోని శాస్త్రవేత్తలు అంతరించిపోయిన ప్రాణుల్లో వేటికి పునరుత్థానం కల్పిస్తే, పర్యావరణానికి ఎక్కువగా మేలు కలుగుతుందో గుర్తించడంతో పాటు ప్రాణుల పునరుత్థాన ప్రయోగాల కోసం ఎంపిక చేసుకున్న ప్రక్రియల సాధ్యాసాధ్యాలపై తమ విశ్లేషణలను అందిస్తారు. మామత్‌తో పాటు మరికొన్ని అంతరించిపోయిన ప్రాణులకు కూడా తిరిగి ప్రాణం పోయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అంతరించిన ప్రాణులకు చెందిన జన్యుపదార్థాలను సేకరించి, వివిధ దశల్లో ప్రయోగాలు చేస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.

క్వాగా
ఇది జీబ్రా జాతికి చెందిన జంతువు. జీబ్రాలా క్వాగాకు ఒంటి నిండా చారలు ఉండవు. తల నుంచి ఛాతీ భాగం వరకు చారలు ఉంటాయి. ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. తల నుంచి ముదురు రంగులో ఉండే ఛారలు ఛాతీ భాగం వద్దకు వచ్చే సరికి మసకబారుతాయి. క్వాగాలు ఒకప్పుడు దక్షిణాఫ్రికాలో విరివిగా కనిపించేవి. చిట్టచివరి క్వాగా 1878లో మరణించినట్లుగా రికార్డులు ఉన్నాయి. అంతరించిపోయిన క్వాగాకు తిరిగి ప్రాణం పోసేందుకు 1987లో ‘క్వాగా ప్రాజెక్టు’ ప్రారంభమైంది. జీబ్రా జాతుల్లోని బర్షెల్స్‌ జీబ్రాలో క్వాగా జన్యువులు అధిక శాతం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. బర్షెల్స్‌ జీబ్రా ద్వారా క్వాగా పునరుత్థానానికి వారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

ఎలిఫంట్‌ బర్డ్‌
ఎగరలేని భారీ పక్షుల్లో ఎలిఫంట్‌ బర్డ్‌ ఒకటి. మడగాస్కర్‌లో ఈ పక్షులు విరివిగా ఉండేవి. స్థానికులు ఇష్టానుసారం వీటిని వేటాడి తినేయడంతో దాదాపు వెయ్యేళ్ల కిందటే ఇవి అంతరించిపోయాయి. మడగాస్కర్‌లో పరిశోధనలు సాగిస్తున్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు ఎలిఫంట్‌ బర్డ్‌ గుడ్ల శిలాజాలు దొరికాయి. వాటి నుంచి వారు ఎలిఫంట్‌ బర్డ్‌ జన్యు పదార్థాలను సేకరించగలిగారు. ఎలిఫంట్‌ బర్డ్‌ పక్షుల్లో ఎనిమిది జాతులు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. డోడో మాదిరిగానే ఎలిఫంట్‌ బర్డ్‌కు కూడా తిరిగి ప్రాణం పోసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

స్టెల్లర్స్‌ సీ కౌ
ఇది తిమింగలంలాంటి భారీ జలచరం. ఒకప్పుడు అలాస్కా, రష్యాల మధ్య బేరింగ్‌ సముద్రంలో కమాండర్‌ దీవుల చుట్టూ కనిపించేది. పర్యావరణ మార్పులు, విచ్చలవిడిగా సాగిన వేట ఫలితంగా స్టెల్లర్స్‌ సీ కౌ జాతి పద్దెనిమిదో శతాబ్దిలో అంతరించిపోయింది. చివరిసారిగా ఇది 1768లో కనిపించినట్లుగా రికార్డులు ఉన్నాయి. జర్మన్‌ ప్రకృతి శాస్త్రవేత్త జార్జ్‌ విల్హెల్మ్‌ స్టెల్లర్‌ 1741లో ఈ జలచరం గురించి తన రచనల్లో విపులంగా వర్ణించాడు. అందువల్ల దీనికి అతడి పేరు మీదుగా ‘స్టెల్లర్స్‌ సీ కౌ’ అనే పేరు వచ్చింది. బేరింగ్‌ దీవి తీరంలో స్టెల్లర్స్‌ సీ కౌ పూర్తి అస్థిపంజరం 1987లో శాస్త్రవేత్తలకు దొరికింది. దీని ఆధారంగా జన్యు పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు స్టెల్లర్స్‌ సీ కౌకు పునరుత్థానం కల్పించడం సాధ్యమేనని, ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నామని చెబుతున్నారు.

ఐరిష్‌ ఎల్క్‌
జింక జాతుల్లో అతిపెద్ద జంతువు ఇది. సహస్రాబ్దాల కిందట భూమ్మీద సంచరించేది. ఐర్లండ్‌ నుంచి సైబీరియాలోని బైకాల్‌ సరస్సు వరకు గల ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఉండేది. పర్యావరణ కారణాల వల్ల, మనుగడకు సంబంధించిన పరిమితుల వల్ల ఐరిష్‌ ఎల్క్‌ జాతి ఏడువేల ఏళ్ల కిందటే అంతరించింది. ప్రస్తుతం భూమ్మీద మనుగడ సాగిస్తున్న జింక జాతుల్లో ఐరిష్‌ ఎల్క్‌ జన్యువుల్లో ఎక్కువ శాతం జన్యువులు ఉన్న జాతి ఫ్యాలో డీర్‌ అని శాస్త్రవేత్తలు గుర్తించారు. పంతొమ్మిదో శతాబ్ది నుంచి సాగిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలకు ఐర్లండ్‌లో ఐరిష్‌ ఎల్క్‌ అస్థిపంజరాలు విరివిగా దొరికాయి. వీటి ఆధారంగా ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఫ్యాలో డీర్‌ ద్వారా ఐరిష్‌ ఎల్క్‌కు పునర్జీవం కల్పించవచ్చనే అంచనాతో ఆ దిశగా ప్రయోగాలు చేస్తున్నారు.

వూలీ రైనోసరస్‌
ఇది ఖడ్గమృగం జాతికి చెందిన భారీ జంతువు. ఖడ్గమృగం శరీరం నున్నగా ఉంటే, దీనికి మాత్రం ఒంటి నిండా దట్టంగా రోమాలు ఉంటాయి. ఈ జంతువు సహస్రాబ్దాల కిందటే అంతరించిపోయింది. పర్యావరణ మార్పుల ఫలితంగా దాదాపు 8,700 ఏళ్ల కింద వూలీ రైనోసరస్‌ అంతరించిపోయినట్లు శాస్త్రవేత్తల అంచనా. మామత్‌కు ఏనుగు ద్వారా పునర్జీవం కల్పించే ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగానే, వూలీ రైనోసరస్‌కు ఖడ్గమృగం ద్వారా పునర్జీవం కల్పించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్నారు.

ఆరోక్స్‌
ఇది గోజాతికి చెందిన పురాతన జంతువు. ఇవి మిగిలిన జాతుల ఎద్దులు, ఆవుల కంటే భారీగా ఉంటాయి. నాలుగేళ్ల కిందటి వరకు ఆసియా, యూరోప్, ఉత్తరాఫ్రికా ప్రాంతాల్లో ఇవి విరివిగా ఉండేవి. ఆ తర్వాత పదిహేడో శతాబ్దం ప్రారంభం నాటికి ఇవి పూర్తిగా అంతరించిపోయాయి. ఆరోక్స్‌ జాతికి తిరిగి ప్రాణం పోయడానికి శాస్త్రవేత్తలు 2009 నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికీ మనుగడలో ఉన్న పురాతన గోజాతుల్లో ఆరోక్స్‌ డీఎన్‌ఏ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆరోక్స్‌ డీఎన్‌ఏ ఎక్కువ శాతం ఉన్న గోజాతులను ప్రత్యేకంగా ఎంపిక చేసి, వాటి ద్వారా ఆరోక్స్‌ జాతికి పునరుత్థానం కల్పించడానికి ప్రయోగాలు చేస్తున్నారు.

టాస్మానియన్‌ టైగర్‌
పెద్దపులి మాదిరిగానే దీని ఒంటి మీద చారలు ఉంటాయి గాని, ఇది తోడేలు జాతికి చెందిన జంతువు. ఒకప్పుడు టాస్మానియా ప్రాంతంలో విరివిగా సంచరించిన ఈ జంతువుకు ఒంటి మీద చారల కారణంగా ‘టాస్మానియన్‌ టైగర్‌’ అనే పేరు వచ్చింది. కొందరు దీనిని ‘టాస్మానియన్‌ వూల్ఫ్‌’ అని కూడా అంటారు. ఈ జంతువు దాదాపు శతాబ్దం కిందట అంతరించిపోయింది. దాదాపు 110 ఏళ్ల కిందట చనిపోయిన టాస్మానియన్‌ టైగర్‌ అస్థిపంజరం నుంచి శాస్త్రవేత్తలు దీని ఆర్‌ఎన్‌ఏను సేకరించారు. ఈ ఆర్‌ఎన్‌ఏను ఇథనాల్‌లో భద్రపరచారు. దీని ద్వారా టాస్మానియన్‌ టైగర్‌కు తిరిగి ప్రాణం పోయడానికి కలోసల్‌ బయోసైన్సెస్‌ కంపెనీ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ యూనివర్సిటీకి చెందిన ‘థైలాసైన్‌ ఇంటిగ్రేటెడ్‌ జెనెటిక్‌ రిస్టరేషన్‌ రీసెర్చ్‌ లాబ్‌ శాస్త్రవేత్తల సహకారంతో ప్రయోగాలు సాగిస్తోంది.

వూలీ రైనోసరస్‌
ఇది ఖడ్గమృగం జాతికి చెందిన భారీ జంతువు. ఖడ్గమృగం శరీరం నున్నగా ఉంటే, దీనికి మాత్రం ఒంటి నిండా దట్టంగా రోమాలు ఉంటాయి. ఈ జంతువు సహస్రాబ్దాల కిందటే అంతరించిపోయింది. పర్యావరణ మార్పుల ఫలితంగా దాదాపు 8,700 ఏళ్ల కింద వూలీ రైనోసరస్‌ అంతరించిపోయినట్లు శాస్త్రవేత్తల అంచనా. మామత్‌కు ఏనుగు ద్వారా పునర్జీవం కల్పించే ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగానే, వూలీ రైనోసరస్‌కు ఖడ్గమృగం ద్వారా పునర్జీవం కల్పించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్నారు.

ది గ్రేట్‌ ఆక్‌
ఇది చూడటానికి పెంగ్విన్‌లా కనిపించే ఎగరలేని పక్షి. వేటగాళ్ల తాకిడి వల్ల ది గ్రేట్‌ ఆక్‌ పక్షిజాతి పంతొమ్మిదో శతాబ్దిలో అంతరించిపోయింది. చిట్టచివరి ది గ్రేట్‌ ఆక్‌ పక్షిని 1844 జూలైలో వేటగాళ్లు చేజిక్కించుకుని, చంపి తినేసినట్లు రికార్డులు ఉన్నాయి. స్పెయిన్‌ ఉత్తర తీరం నుంచి కెనడా వరకు అట్లాంటిక్‌ తీర ప్రాంతమంతటా ఈ పక్షులు ఒకప్పుడు విరివిగా ఉండేవి. ధ్రువపు ఎలుగుబంట్లు ఈ పక్షులను తినేవి. వాటి కంటే ఎక్కువగా మనుషులు వేటాడి తినేవారు. ది గ్రేట్‌ ఆక్‌ పునరుత్థానం కోసం శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. టెక్సస్‌లోని ఏ అండ్‌ ఎం యూనివర్సిటీ, ఆస్ట్రేలియన్‌ యానిమల్‌ హెల్త్‌ లేబొరేటరీ వంటి సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ దిశగా ప్రయోగాలు కొనసాగిస్తున్నారు.

శాస్త్రవేత్తల ప్రయోగాలు ఫలించినట్లయితే, అంతరించిపోయిన జీవరాశుల్లో కనీసం కొన్ని అయినా తిరిగి ప్రాణం పోసుకోగలవు. వాటి వల్ల భూమ్మీద జీవవైవిధ్యం మాత్రమే కాకుండా, ప్రకృతి సమతుల్యత కూడా మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరించిపోయిన జీవుల పునరుత్థానం కోసం సూక్షా్మతి సూక్ష్మస్థాయిలో సాగిస్తున్న జన్యు ప్రయోగాలు, మూలకణాల ప్రయోగాల వల్ల మానవాళిని పట్టి పీడించే ఎన్నో వ్యాధులకు చికిత్స మార్గాలను కూడా కనుగొనే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement