30 ఏళ్ళ తర్వాత చలనం తెప్పించారు!
శాస్త్రీయ పరిజ్ఞానం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. సైన్స్ కు అందని విషయమే ఉండదేమో అన్నంతటి విజ్ఞానాన్ని మన ముందుంచుతోంది. తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు అందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. మంచులో గడ్డ కట్టిపోయిన ఓ జీవిలో ముఫ్ఫై ఏళ్ళ తర్వాత చలనం తెప్పించిన తీరు... సృష్టికే ప్రతిసృష్టిగా నిలిచింది.
అంటార్కిటికానుంచి సేకరించి తెచ్చిన ఓ నీటి ఎలుగు (టార్డిగ్రేడ్) ను ఘనీభవింపజేసి... ముఫ్ఫై ఏళ్ళ తర్వాత విజయవంతంగా దానిలో చలనం తెప్పించగలిగామని.. జపాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోలార్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు. ఒక మిల్లీ మీటర్ కంటే తక్కువ పరిమాణంలో ఉండి, మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు, నీరు ఉండే ప్రాంతాల్లో ఈ జాతి జీవులు నివసిస్తుంటాయి. అవసరాన్ని బట్టి వాటి జీవక్రియ కార్యకలాపాలను అవే సమర్థించుకోగలిగే శక్తిని ఇవి కలిగి ఉంటాయి. అయితే ఇటువంటి ప్రత్యేకతలు కలిగిన ఈ టార్డిగ్రేడ్ ను అంటార్కిటికాలోని నాచు మొక్కల్లో గుర్తించి 1983 లో పరిశోధనలకోసం తెచ్చారు జపాన్ శాస్త్రవేత్తలు. తమ పరిశోధనల్లో భాగంగా దాన్ని 20 మైనస్ డిగ్రీల్లో భద్రపరిచి ఘనీభవింపజేశారు. తిరిగి 2014 లో దాన్నియధాస్థితికి తెచ్చి పరిశోధకులు సఫలమయ్యారని క్రైయో బయాలజీ పత్రిక వెల్లడించింది. అంతేకాదు సజీవంగా మారిన టార్డిగ్రేడ్ ఓ గుడ్డును కూడ పెట్లి, అది క్రమంగా కదలడం ప్రారంభించి, పదిహేను రోజులకల్లా ఆహారం తీసుకోవడం మొదలు పెట్టిందని, ఆ గుడ్డు క్రమంగా 19 గుడ్లును పెట్టిందని, వాటిలో 14 గుడ్లు పిల్లలుగా మారగా, వాటన్నింటిలో ఎటువంటి లోపాలు లేవని పరిశోధకులు చెప్పినట్లు ఆ పత్రిక నివేదించింది.
గతంలో జరిపిన పరిశోధనల్లో ఈ టార్డిగ్రేడ్ ను తొమ్మిది సంవత్సరాల తర్వాత చలనంలోకి తెచ్చారు. కానీ 30 ఏళ్ళ తర్వాత విజయవంతంగా పునర్జీవనం కల్పించడం ఇదే మొదటిసారి అని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రకృతి పరిమాణాత్మక విశ్లేషణలను ఉపయోగించి నిర్విహించిన ఈ ప్రస్తుత పరిశోధనలు టార్డిగ్రేడ్ దీర్ఘకాల మనుగడను కొంతవరకూ గుర్తించ గలిగిందని, మరిన్ని అధ్యయనాలు జరిపి నియంత్రిత పరిస్థితుల్లో వీటి మనుగడపై విశ్లేషణాత్మక వివరాలను తెలుసుకునే అవకాశం ఉందని ఈ పరిశోధనా పత్రికలో రచయితలు వెల్లడించారు.