సాక్షి, అమరావతి: జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ఏ ప్రాణి.. ఎక్కడ.. ఎలా జీవిస్తోందనే సమాచారం సేకరించేందుకు శాస్త్రవేత్తలు కొత్త పద్ధతులను అన్వేషిస్తున్నారు. ఇప్పటివరకు కెమెరా ట్రాపింగ్, లైన్ ట్రాన్‌సెక్టు్టలను ఉపయోగించి జంతువుల కదలికలను ట్రాక్ చేయడం ద్వారా వన్యప్రాణుల ఉనికిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ట్రాకింగ్ నిర్ధిష్ట ప్రాంతం, ప్రత్యేకించి డిజైన్ చేసిన ట్రయల్స్‌గా మాత్రమే ఉంటోంది.
ఇందులో ఖరీదైన పరికరాల వాడకం, శ్రమతో కూడుకోవడంతో పాటు ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఒక ప్రాంతంలోని అన్ని జాతులను గుర్తించడం సాధ్యపడటం లేదు. దట్టమైన వర్షారణ్యాల్లో ఈ రకమైన ట్రాకింగ్ కష్టతరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ జీవ వైవిధ్య శాస్త్రవేత్తల బృందం అడవుల్లో జంతువుల డీఎన్‌ఏ నమూనాల సేకరణ ద్వారా జీవ వైవిధ్యాన్ని సులభంగా, తక్కువ ఖర్చుతో గుర్తించవచ్చని ఓ అధ్యయనంలో పేర్కొంది.
గాలిలోకి కణాలుగా జంతు డీఎన్‌ఏ
ఉగాండాలోని కిబలే జాతీయ పార్కులోని వర్షారణ్యంలో అంతర్జాతీయ పరిశోధన బృందం మొక్కలు, చెట్ల ఆకులపై జంతువులు డీఎన్ఏలను కనుగొంది. జంతువులు తమ డీఎన్‌ఏను గాలిలోకి కణాలుగా విడుదల చేస్తున్నట్టు.. అది కాస్తా అడవిలోని వృక్ష సంపదపై సన్నని మైనం పొర మాదిరిగా అల్లుకుంటున్నట్టు పరిశోధనలో తేలింది. ఆకులపైన స్వాబ్ నమూనాలను కాటన్ బడ్స్ ద్వారా సేకరించి డీఎన్‌ఏ సీక్వెన్సింగ్ పరీక్ష ద్వారా జాతుల వివరాలను తెలుసుకోవడంతోపాటు జీవ వైవిధ్యాన్ని మ్యాప్ చేయవచ్చని పరిశోధన బృందం చెబుతోంది.
పర్యావరణంలోని మార్పులను అర్థం చేసుకుంటూ జీవ వైవిధ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి, అటవీ జనాభాను పర్యవేక్షించడానికి డీఎన్‌ఏ పరీక్షా విధానం ఎంతగానో ఊతమిస్తోంది. కోవిడ్ తర్వాత డీఎన్‌ఏ సీక్వెన్సింగ్ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందడం కూడా కలిసి వస్తోంది. ఆకులను శుభ్రపరచడానికి టెక్నాలజీ, ఖరీదైన పరికరాలు, ఎక్కువ శిక్షణ అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వైల్డ్‌లైఫ్ అథారిటీలో పని చేసే సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర జీవ శాస్త్రవేత్తలు దీనిని సులభంగా నిర్వహించవచ్చు. వాస్తవంగా పర్యావరణంలో సేకరించే డీఎన్‌ఏ చాలా పెద్దస్థాయిలో జీవ వైవిధ్య పర్యవేక్షణకు దోహదపడుతుంది. వర్షాధార పరిస్థితుల్లో, అత్యంత వేడి పరిస్థితుల్లో మాత్రమే ఆకులపై డీఎన్‌ఏ త్వరగా క్షీణిస్తుంది తప్ప మిగిలిన సందర్భాల్లో పరిశోధనలకు అనుకూలంగా ఉండటంతో ఈ పద్ధతిపై అంచనాలు పెరుగుతున్నాయి.
గంటలో 50కి పైగా జాతుల గుర్తింపు
కిబలే జాతీయ పార్కు గొప్ప జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ‘ప్రైమేట్ క్యాపిటల్’ (కోతి జాతులు) నిలయంగా ఉంది. ఇందులో అంతరించిపోతున్న రెడ్ కోలోబస్ కోతి, చింపాజీలతో సహా 13 జాతులు ఇందులో ఉన్నాయి. ఇక్కడ పరిశోధకులు కేవలం ఒక గంటలో 24 కాటన్ బడ్స్ ద్వారా ఆకులపై స్వాబ్ నమూనాలను సేకరించారు. వాటి విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపగా.. ఏకంగా 50 రకాల క్షీరదాలు, పక్షులు, ఒక కప్ప జాతులను గుర్తించడం గమనార్హం.
ప్రతి మొక్క ఆకులపై దాదాపు 8 జంతు జాతులను కనుగొన్నారు. వీటిల్లో పెద్దవైన అంతరించిపోతున్న ఆఫ్రికన్ ఏనుగు నుంచి చిన్న జాతులైన సన్‌బర్డ్ వరకు భారీ జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించాయి. డీఎన్ఏల ద్వారా ఒక మీటరు పొడవాటి రెక్కలుండే గబ్బిలాలు, బయటకు కనిపించని పర్వత కోతులు, బూడిద, ఎరుపు వర్ణాల కోతులు, సుంచు ఎలుకలు, అనేక రకాల చిలుకలు ఉన్నట్టు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment