ప్రైవేట్‌ ద్వీపంలో పర్యాటకం | Increasing tourist traffic worldwide | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ద్వీపంలో పర్యాటకం

Published Thu, Nov 14 2024 5:29 AM | Last Updated on Thu, Nov 14 2024 5:29 AM

Increasing tourist traffic worldwide

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పర్యాటక రద్దీ

ప్రశాంతత కోసం కొత్త అన్వేషణల్లో పర్యాటకులు 

ప్రైవేటు ఐలాండ్‌ టూరిజం వైపు మొగ్గు 

అంతర్జాతీయంగా ప్రైవేటు ఐలాండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు 

క్రూయిజ్‌ కంపెనీలు సైతం సొంతంగా ఐలాండ్స్‌ కొనుగోలు 

రోజుకు రూ.కోటికి పైగా అద్దె వసూలు

ప్రపంచ పర్యాటక రంగం కొత్త పుంతలుతొక్కుతోంది. నిత్య నూతన అన్వేషణలతో ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తోంది. పెరుగుతోన్న జనాభాకు తోడు ప్రసిద్ధి చెందిన గమ్యస్థానాల్లో పర్యాటక రద్దీ ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా స్పెయిన్, ఇటలీ, జపాన్, గ్రీస్‌ వంటి దేశాలు అధిక పర్యాటకంతో కిక్కిరిసిపోతున్నాయి. 

పెద్ద పర్యాటక దేశాల నుంచి చిన్నచిన్న పర్యాటక ప్రాంతాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. ఆమ్‌స్టర్‌డామ్‌ నుంచి వెనిస్, మొరాకో వరకు వేసవి సెలవుల్లో పర్యాటకుల రాక పెరగడంతో తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికులు నిరసనలు దిగడం గమనార్హం. ఈ క్రమంలోనే ప్రశాంత పర్యాటకానికి ప్రత్యామ్నాయంగా ‘ప్రైవేట్‌ ఐలాండ్‌’ టూరిజం విధానం ఊపందుకుంది.     – సాక్షి, అమరావతి

ప్రైవేటు ద్వీపాల్లో పెట్టుబడులు.. 
విహారయాత్రకు/కొంతకాలం బస చేసేందుకు ఒక ద్వీపాన్ని అద్దెకు తీసుకోవడం, కొనుగోలు చేయడాన్ని ప్రైవేటు ఐలాండ్‌ పర్యాటకంగా పరిగణిస్తారు. ఈ ద్వీపాల్లో చిన్నవిగా, ఏకాంత ద్వీపాల నుంచి విలాసవంతమైన సౌకర్యాలు, సకల హంగులతో భారీ ద్వీపాలు ఉంటున్నాయి. మాల్దీవులు, సీషెల్స్, బెలిజ్, బహామాస్, కరేబియన్, థాయిలాండ్, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాల్లో ఐలాండ్‌ టూరిజం ఎక్కువగా ఉంటోంది. 

తాజాగా అంతర్జాతీయంగా ప్రైవేట్‌ కంపెనీలు ప్రైవేట్‌ ఐలాండ్‌పై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. సెంట్రల్‌ అమెరికాలోని బెలిజ్, కరేబియన్‌ దీవుల్లోని బహామాస్‌ ద్వీపాలను కొనుగోలు చేసి అభివృద్ధి చేసి అమ్మకానికి ఉంచుతున్నాయి. వీటితో పాటు క్రూయిజ్‌ కంపెనీలు కూడా ప్రైవేట్‌ రిట్రీట్‌లలో పెట్టుబడులపై దృష్టి సారించాయి. 

నార్వేజియన్‌ క్రూయిస్‌ లైన్‌ సొంతంగా బెలీజ్, బహామాస్‌లో ద్వీపాలను కలిగి ఉంది. ఇక్కడ బీచ్‌లు, వాటర్‌ స్పోర్ట్స్, రిసార్ట్‌ సౌకర్యాలను అందిస్తోంది. రాయల్‌ కరేబియన్‌ క్రూయిజ్‌ కంపెనీ అయితే ఏటా 20 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి కోకోకే (బహామాస్‌) ప్రైవేటు ద్వీపం ఉంది.

అద్దె రూ.కోట్లలో.. 
ప్రైవేట్‌ ద్వీపం ఒక రోజుకు అద్దె రూ.కోట్లలో ఉంటోంది. అయితే ఇవి ధనికులకు మాత్రమే కాకుండా మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందుతున్నాయి. సెలవుల్లో ఇలాంటి దీవుల్లో గడిపేందుకు పర్యాటకులు ఎక్కువగా మెగ్గుచూపుతుండటమే విశేషం. 

ఫిలిప్పీన్స్‌లోని బన్వా ప్రైవేట్‌ ద్వీపానికి 2019లో ఒక రోజుకు రూ.83.96లక్షల అద్దె ఉండేది. అప్పట్లో ఇదే అత్యంత ఖరీదైన ప్రైవేట్‌ ఐలాండ్‌గా గుర్తింపు పొందింది. కోవిడ్‌ మహమ్మారి తర్వాత 2021లో పర్యాటకాన్ని పునరుద్ధరించిన నేపథ్యంలో అద్దెను రూ.37.78 లక్షలకు తగ్గించారు. 

ఇప్పుడు సగటున 3 రోజుల పాటు బుకింగ్‌ చేసుకుంటే రూ.1.13 కోట్లు చార్జ్‌ వేస్తున్నారు. సామాన్యులకు పనామా తీరంలోని ఇస్లా పలెన్‌క్యూ దగ్గరలోని రిసార్ట్, ప్రైవేట్‌ ద్వీపం ఒక్కో జంటకు (ద్వీపంలో చిన్న ప్రాంతం) రూ.83,964కే అద్దెకు ఇస్తోంది.

కొన్ని ద్వీప పర్యాటకం అద్దెలు ఇలా..
నెక్కర్‌ ఐలాండ్‌ (బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌)  
సందర్శకులు ఒక రోజుకు రూ.1.30 కోట్లు చెల్లించి మొత్తం ద్వీపాన్ని బుక్‌ చేసుకోవచ్చు. ఇందులో గరిష్టంగా 48 మంది అతిథులను ఆహ్వానించవచ్చు.

ముషా కే (ది బహామాస్‌)
ఈ ప్రత్యేకమైన ప్రైవేట్‌ రిట్రీట్‌ గరిష్టంగా 24 మంది అతిథులకు ఆతిథ్యం ఇస్తుంది. 700 ఎకరాల్లో విస్తరించి ఉన్న 40 ప్రైవేట్‌ బీచ్‌ల తాత్కాలిక నివాసంగా ఉంది. ఇందులో ద్వీపం అద్దె ధర ఒక రోజుకు రూ.47.85 లక్షలు.

రాయల్‌ ఐలాండ్‌ (బహామాస్‌)
430 ఎకరాల ప్రైవేట్‌ ఒయాసిస్‌. ఇందులో గడిపేందుకు ఒక్కరోజుకు ఒక్కో జంట రూ.15.53 లక్షలు చెల్లించాలి

కాలివిగ్నీ ద్వీపం (గ్రెనడా)
ఈ ద్వీపం అద్దె రోజుకు రూ.1.38కోట్లు. ఇందులో 25 సూట్‌లు, కాటేజీలు, సముద్రపు క్రీడలు అందుబాటులో ఉంటాయి. 40 మందికి ఆతిథ్యం ఇస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement