Private Islands
-
ప్రైవేట్ ద్వీపంలో పర్యాటకం
ప్రపంచ పర్యాటక రంగం కొత్త పుంతలుతొక్కుతోంది. నిత్య నూతన అన్వేషణలతో ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తోంది. పెరుగుతోన్న జనాభాకు తోడు ప్రసిద్ధి చెందిన గమ్యస్థానాల్లో పర్యాటక రద్దీ ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా స్పెయిన్, ఇటలీ, జపాన్, గ్రీస్ వంటి దేశాలు అధిక పర్యాటకంతో కిక్కిరిసిపోతున్నాయి. పెద్ద పర్యాటక దేశాల నుంచి చిన్నచిన్న పర్యాటక ప్రాంతాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. ఆమ్స్టర్డామ్ నుంచి వెనిస్, మొరాకో వరకు వేసవి సెలవుల్లో పర్యాటకుల రాక పెరగడంతో తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికులు నిరసనలు దిగడం గమనార్హం. ఈ క్రమంలోనే ప్రశాంత పర్యాటకానికి ప్రత్యామ్నాయంగా ‘ప్రైవేట్ ఐలాండ్’ టూరిజం విధానం ఊపందుకుంది. – సాక్షి, అమరావతిప్రైవేటు ద్వీపాల్లో పెట్టుబడులు.. విహారయాత్రకు/కొంతకాలం బస చేసేందుకు ఒక ద్వీపాన్ని అద్దెకు తీసుకోవడం, కొనుగోలు చేయడాన్ని ప్రైవేటు ఐలాండ్ పర్యాటకంగా పరిగణిస్తారు. ఈ ద్వీపాల్లో చిన్నవిగా, ఏకాంత ద్వీపాల నుంచి విలాసవంతమైన సౌకర్యాలు, సకల హంగులతో భారీ ద్వీపాలు ఉంటున్నాయి. మాల్దీవులు, సీషెల్స్, బెలిజ్, బహామాస్, కరేబియన్, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో ఐలాండ్ టూరిజం ఎక్కువగా ఉంటోంది. తాజాగా అంతర్జాతీయంగా ప్రైవేట్ కంపెనీలు ప్రైవేట్ ఐలాండ్‌పై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. సెంట్రల్ అమెరికాలోని బెలిజ్, కరేబియన్ దీవుల్లోని బహామాస్ ద్వీపాలను కొనుగోలు చేసి అభివృద్ధి చేసి అమ్మకానికి ఉంచుతున్నాయి. వీటితో పాటు క్రూయిజ్ కంపెనీలు కూడా ప్రైవేట్ రిట్రీట్‌లలో పెట్టుబడులపై దృష్టి సారించాయి. నార్వేజియన్ క్రూయిస్ లైన్ సొంతంగా బెలీజ్, బహామాస్‌లో ద్వీపాలను కలిగి ఉంది. ఇక్కడ బీచ్‌లు, వాటర్ స్పోర్ట్స్, రిసార్ట్ సౌకర్యాలను అందిస్తోంది. రాయల్ కరేబియన్ క్రూయిజ్ కంపెనీ అయితే ఏటా 20 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి కోకోకే (బహామాస్) ప్రైవేటు ద్వీపం ఉంది.అద్దె రూ.కోట్లలో.. ప్రైవేట్ ద్వీపం ఒక రోజుకు అద్దె రూ.కోట్లలో ఉంటోంది. అయితే ఇవి ధనికులకు మాత్రమే కాకుండా మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందుతున్నాయి. సెలవుల్లో ఇలాంటి దీవుల్లో గడిపేందుకు పర్యాటకులు ఎక్కువగా మెగ్గుచూపుతుండటమే విశేషం. ఫిలిప్పీన్స్‌లోని బన్వా ప్రైవేట్ ద్వీపానికి 2019లో ఒక రోజుకు రూ.83.96లక్షల అద్దె ఉండేది. అప్పట్లో ఇదే అత్యంత ఖరీదైన ప్రైవేట్ ఐలాండ్‌గా గుర్తింపు పొందింది. కోవిడ్ మహమ్మారి తర్వాత 2021లో పర్యాటకాన్ని పునరుద్ధరించిన నేపథ్యంలో అద్దెను రూ.37.78 లక్షలకు తగ్గించారు. ఇప్పుడు సగటున 3 రోజుల పాటు బుకింగ్ చేసుకుంటే రూ.1.13 కోట్లు చార్జ్ వేస్తున్నారు. సామాన్యులకు పనామా తీరంలోని ఇస్లా పలెన్క్యూ దగ్గరలోని రిసార్ట్, ప్రైవేట్ ద్వీపం ఒక్కో జంటకు (ద్వీపంలో చిన్న ప్రాంతం) రూ.83,964కే అద్దెకు ఇస్తోంది.కొన్ని ద్వీప పర్యాటకం అద్దెలు ఇలా..నెక్కర్ ఐలాండ్ (బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్) సందర్శకులు ఒక రోజుకు రూ.1.30 కోట్లు చెల్లించి మొత్తం ద్వీపాన్ని బుక్ చేసుకోవచ్చు. ఇందులో గరిష్టంగా 48 మంది అతిథులను ఆహ్వానించవచ్చు.ముషా కే (ది బహామాస్)ఈ ప్రత్యేకమైన ప్రైవేట్ రిట్రీట్ గరిష్టంగా 24 మంది అతిథులకు ఆతిథ్యం ఇస్తుంది. 700 ఎకరాల్లో విస్తరించి ఉన్న 40 ప్రైవేట్ బీచ్‌ల తాత్కాలిక నివాసంగా ఉంది. ఇందులో ద్వీపం అద్దె ధర ఒక రోజుకు రూ.47.85 లక్షలు.రాయల్ ఐలాండ్ (బహామాస్)430 ఎకరాల ప్రైవేట్ ఒయాసిస్. ఇందులో గడిపేందుకు ఒక్కరోజుకు ఒక్కో జంట రూ.15.53 లక్షలు చెల్లించాలికాలివిగ్నీ ద్వీపం (గ్రెనడా)ఈ ద్వీపం అద్దె రోజుకు రూ.1.38కోట్లు. ఇందులో 25 సూట్లు, కాటేజీలు, సముద్రపు క్రీడలు అందుబాటులో ఉంటాయి. 40 మందికి ఆతిథ్యం ఇస్తుంది. -
ఇక్కడ ఒక్క రాత్రికి రూ. 58 లక్షలు
పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకునే ప్రాంతం మాల్దీవులు. 26 ద్వీపాల సముహమైన మాల్దీవ్స్‌లో సహజమైన బీచ్‌లు, చల్లటి వాతావరణంతో స్వర్గాన్ని తలపిస్తుంది. అంతేగాక ఇక్కడ ప్రతి ఐలాండ్‌లోని రిసార్టులు స్వీమ్మింగ్ ఫూల్స్‌తో, బెడ్రూం విల్లాలు మాల్దీవులకు మరింత ఆకర్షణ. అయితే ఇక్కడ విడిది చేయాలంటే పర్యాటకులు ఒక్కరోజుకు వేల రూపాయల నుంచి లక్షల్లో చెల్లించాల్సి ఉంటుంది. అందుకే సాధారణ ప్రజలతో పోలిస్తే సెలబ్రెటీలే ఎక్కువగా ఇక్కడకు వెళుతుంటారు. లాక్డౌన్లో దాదాపు 8 నెలల పాటు సెలబ్రిటీలు ఇంటికే పరిమితమయ్యారు. అనంతరం లాక్డౌన్ ఎత్తివేయడంతో సెలబ్రెటీలంతా రిఫ్రెష్మెంట్ కోసం మాల్దీవులకు క్యూ కడుతున్నారు. దీంతో పర్యటకులను మరింత ఆకట్టుకునేందుకు వాల్డోర్ఫ్ ఆస్టోరియా మాల్దీవులు ఇథాఫుషిలో కొత్తగా ఓ ప్రైవేటు లగ్జరీ రిసార్టును నిర్మించారు. ప్రస్తుతం ఈ రిసార్టు పర్యాటకులు తెగ ఆకట్టుకుంటోంది. అయితే దీని ఖరీదు విని మాత్రం చాలా మంది నోళ్లు వెల్లబెడుతున్నారు. 32,000 చదరపు మీటర్ల అభయారణ్య ద్వీపమైన మాల్దీవులలోనే ఇది అతిపెద్ద ప్రైవేట్ ద్వీపం. లగ్జరీ రూమ్‌లతో అన్ని రకాల హంగు ఆర్భాటాలతో నిర్మించిన ఈ రిసార్టులో విడిది చేయాలంటే ఒక్క రాత్రికి సుమారు 58 లక్షల రూపాయలు చెల్లించాలంట. (చదవండి: చైనా దూకుడు: మరో అద్భుతానికి శ్రీకారం) అంత ఖరీదైన ఈ ద్వీపంలో మూడు బీచ్ విల్లాలతో కూడిన లగ్జరీ బెడ్రూమ్లు, రెండు ఓవర్ వాటర్ బెడ్రూమ్లు, రెసిడెన్సీ బెడ్రూంలతో పాటు స్వీమ్మింగ్ ఫూల్స్ ఉన్నాయి. వినోదం కోసం ఒక ప్రైవేట్ క్లబ్‌హౌస్ కూడా ఉంది. అదే విధంగా స్వంత ప్రత్యేక పాక బృందం, వాటర్‌స్పోర్ట్స్, డైవింగ్, యాచ్ ట్రిప్స్, ధ్యానం, యోగా సెంటర్లు, పిల్లలకు ప్రత్యేకంగా స్వీమ్మింగ్ పూల్, గేమింగ్ ఏరియాతో పాటు పూర్తిస్థాయి జిమ్ కూడా ఉంది. ఇథాఫుషి - ప్రైవేట్ ద్వీపంలో నిర్మించిన లగ్జరీ కొత్త రిసార్టును ఈ వారంలోనే ప్రారంభించారు. ఇక్కడ ఒకేసారి దాదాపు 24 మంది పర్యటకులు విడిది చేయవచ్చు. ఈ ద్వీపానికి వెళ్లాలంటే పడవలో 40 నిమిషాల్లో లేదా విమానంలో 15 నిమిషాల్లో ద్వీపానికి చేరుకోవచ్చు. అన్ని సౌకర్యాలతో నిర్మించిన ఈ ద్వీపానికి మీరు కూడా వెళ్లాలనుకుంటున్నారా. మరి అక్కడ ఉండాలంటే ఒక్క రాత్రికి 58,49,600 రూపాయలు (80,000 అమెరికా డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఆలోచించుకోండి. (చదవండి: చెత్త రికార్డు సృష్టించనున్న ట్రంప్) -
ఆ దీవులకు వాళ్లే రారాజులు...
సాక్షి: వినోద, విహార కేంద్రాలకు నిలయాలు దీవులు. అందుకే అవి పర్యాటక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. వీటిలో కొన్ని స్వతంత్ర దేశాలుగా ఉంటే, మరికొన్ని ఇతర దేశాల ఆధీనంలో ఉన్నాయి. కానీ కొన్ని దీవులు మాత్రం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. అమ్మకానికి పెట్టిన ఎన్నో దీవుల్ని ప్రపంచవ్యాప్తంగా పలువురు సొంతం చేసుకున్నారు. ఆయా దీవుల్లోకి మరెవరికీ ప్రవేశం లేకుండా యజమానులే స్వాధీనంలో ఉంచుకుని, వాటికి రారాజులుగా వెలిగిపోతున్నారు. అలా కొన్ని దీవుల్ని సొంతం చేసుకున్న వారి గురించి తెలుసుకుందాం... రోమన్ అబ్రామోవిక్ (హోలాండ్ దీవి).. ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసిన దీవుల్లో అతి ఖరీదైన దీవిని సొంతం చేసుకున్నది రోమన్ అబ్రామోవిక్ అనే రష్యా వ్యాపారవేత్త. మిల్‌హౌస్ ఎల్ఎల్సీ, చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్ సహా రష్యాలోని అనేక సంస్థలకు ఆయన అధిపతి. చాలామంది రోమన్ అబ్రామోవిక్ను ఆధునిక రోమన్ సామ్రాజ్యాధినేతగా అభివర్ణిస్తారు. ప్రపంచంలో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసేందుకే ఆయన ఇష్టపడతారు. ఇంతకీ ఆయన కొనుగోలు చేసిన దీవి ఖరీదెంతో తెలుసా.. మన కరెన్సీ ప్రకారం 2,600 కోట్ల రూపాయలు. ఆ దీవి పేరు హోలాండ్. అయితే ఇతరుల్లా దీన్ని సొంతానికి వాడుకోకుండా సాంస్కృతికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. దీనితోపాటు ఇతర దీవుల్ని కూడా రోమన్ కొనుగోలు చేశాడు. బిల్‌గేట్స్ (గ్రాండ్ బూగ్ కే).. ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఓ దీవిని సొంతం చేసుకున్నాడు. బెలిజ్ దేశంలోని సముద్ర తీరాన ఉన్న అతిపెద్ద ద్వీపాన్ని ఆయన దాదాపు 166 కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేశారు. ఈ దీవి విస్తీర్ణం మొత్తం 314 ఎకరాలు. ఈ దీవిలోని బీచ్‌లు అతి సుందరంగా ఉంటాయి. పలు రకాల సముద్ర జీవులకు కూడా ఈ దీవి నిలయం. ట్యూనికేట్స్, స్టార్ఫిష్, డాల్ఫిన్లు ప్రధాన ఆకర్షణలు. ఇక్కడి సముద్రపు నీరు చాలా దూరం వరకు పారదర్శకంగా కనిపిస్తుంది. స్కూబాడైవింగ్లాంటి జలక్రీడలకు కూడా ఈ దీవి అనువైనదని సమాచారం. ఈ దీవిని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఇతర పర్యాటకులెవరికీ ఇందులోకి ప్రవేశం లేదు. కేవలం బిల్‌గేట్స్, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే అప్పుడప్పుడు ఈ దీవిలో సేదతీరుతున్నారు. షకీరా (బాండ్స్ కే).. పాప్గాయనిగా ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న షకీరా కూడా ఓ దీవిని కొనుగోలు చేసింది. అంటే ఆ దీవికి ఆవిడే మహారాణి అన్నమాట. ప్రపంచంలో ఖరీదైన దీవుల్ని సొంతం చేసుకున్నవారి జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళ షకీరాయే. ఈమె ఫ్లోరిడాకు 125 మైళ్ల దూరంలోని బాండ్స్ కే అనే దీవిని కొనుక్కుంది. దాదాపు 110 కోట్ల రూపాయలతో దీన్ని సొంతం చేసుకుంది. ఈ దీవిలో ఐదు సుందరమైన బీచ్‌లున్నాయి. మరో మూడు సరస్సులు కూడా ఉన్నాయి. వీటితోపాటు కోరల్ రీఫ్స్, చేపల వేటకు అనువైన ప్రాంతాలు, అందమైన ప్రకృతి వంటి ఆకర్షణలెన్నో దీవిలో కనిపిస్తాయి. అయితే షకీరా సొంతంగా సేదతీరేందుకు మాత్రమే కాకుండా దీన్నో టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దీన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఇందులోని కొంత భాగాన్ని అమ్మకానికి పెట్టే యోచనలో ఉంది షకీరా. మెల్ గిబ్సన్ (మ్యాగో దీవి).. దీవుల కొనుగోలు విషయంలో అందరికంటే ముందు వరుసలో నిలిచేది హాలీవుడ్ తారలే. వీరిలో మెల్గిబ్సన్ ఒకరు. ఈయన కూడా ఓ ఐలాండ్‌ను కొనుగోలు చేశారు. దాదాపు 5,400 ఎకరాల విస్తీర్ణం కలిగిన మ్యాగో ఐలాండ్‌ను సొంతం చేసుకున్నారు. జపాన్‌కు చెందిన ఓ సంస్థ నుంచి 2005లో వంద కోట్ల రూపాయలు చెల్లించి ఈ దీవిని కైవసం చేసుకున్నారు. పసిఫిక్ సముద్రంలో ఉన్న అతిపెద్ద దీవి ఇదే. దీన్ని పర్యాటకులకోసం కాకుండా సొంతంగా వాడుకునేందుకే మెల్గిబ్సన్ ప్రాధాన్యమిస్తున్నారు. ఎడ్డీ మర్ఫీ(రూస్టర్ కే).. ప్రైవేట్ దీవిని కొనుగోలు చేసిన మరో హాలీవుడ్ నటుడు, దర్శకులు ఎడ్డీ మర్ఫీ. అత్యధిక పారితోషికం అందుకుంటున్న తారల్లో ఈయన కూడా ఒకరు. ఎడ్డీ బాల్యమంతా లాంగ్ అనే దీవిలోనే గడిచింది. అందువల్లే ఆయనకు దీవులంటే చాలా ఇష్టం. అందువల్లే 2007లో దాదాపు వంద కోట్లు చెల్లించి రూస్టర్ కే అనే దీవిని కొనుగోలు చేశాడు. ప్యారడైజ్ అనే మరో దీవికి సమీపంలోనే ఉండే రూస్టర్ దీవి ఇప్పటికీ ప్రజలకు ఓ మిస్టరీగానే ఉంది. ఎడ్డీ ఇంతకుముందు కూడా కొన్ని దీవులను కొనుగోలు చేశాడు. వాటన్నింటిలోకి రూస్టర్ చాలా అందమైన దీవి అని సమాచారం. ప్రస్తుతం ఎడ్డీ తన పరివారంతో సేదతీరేందుకు మాత్రమే దీన్ని వినియోగిస్తున్నారు. అయితే ఈ దీవిని అభివృద్ధి చేస్తే మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయట. బెర్నార్డ్ ఆర్నాల్ట్ (ఇండిగో దీవి).. ప్రపంచ కుబేరుల్లో ఒకడైన వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ కూడా దీవిని కొనుగోలు చేశాడు. బహమాస్ దీవుల సమూహంలోని ఇండిగో ఐలాండ్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. దాదాపు 232 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన ఈ దీవి మొత్తం విస్తీర్ణం 133 ఎకరాలు. ఈ దీవిని బెర్నార్డ్ సేదతీరేందుకు వినియోగిస్తాడు. అందమైన బీచ్‌లు కలిగిన దీవి పర్వతప్రాంతంలో బెర్నార్డ్ మరింత అందమైన విల్లాను నిర్మించుకున్నాడు. తన అభిరుచికి అనుగుణంగా టెన్నిస్ కోర్టులతో సహా ఇతర వసతులను సమకూర్చుకున్నాడు. ఇది కూడా పూర్తిగా బెర్నార్డ్ వ్యక్తిగత అవసరాలకోసమే వినియోగిస్తుండడంతో ఇతరులకు ఇక్కడికి ప్రవేశం లేదు. -
దీవులను కొందామా?
ఇల్లు, కారు.. కొనమన్నంత సులువుగా... ఏకంగా దీవినే కొనమంటున్నారేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా! మీరు చదివింది నిజమే! ఇల్లు, కారు ఇతర వస్తువులు కొన్నట్లుగానే డబ్బులుంటే ఏకంగా దీవులనే కొనుగోలు చేయవచ్చు. లేదంటే కొన్నాళ్ల వరకు వాటిని లీజుకు తీసుకోవచ్చు. ఇంకా కాదనుకుంటే ఆయా దీవులలోని నచ్చిన విల్లాను ఎంపిక చేసుకొని, సొంతం చేసుకోవచ్చు. తక్కువ కాలానికి అద్దెకు దొరికే విల్లా సదుపాయాలు కూడా దీవులలో ఎన్నో ఉన్నాయి. అలాంటి దీవుల కథాకమామీషు... - వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు అనేక చిన్నా పెద్దా దీవులు సొంతంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా యూరప్ దీవులలోనూ, మాల్దీవులలోనూ మాల్యా రిసార్ట్స్ నడుపుతున్నారు. - ఖతార్ రాజు షేక్ అహ్మద్ ఖలీప్ అలీకి సొంతంగా రెండు దీవులున్నాయి. హాలీవుడ్ నటుడు, వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్ బ్రిటిష్ వర్జిన్ దీవుల సముదాయంలోని నెకర్ ఐలాండ్‌ను సొంతం చేసుకున్నాడు. మనకు అండమాన్, నికోబార్ దీవులు తెలుసు. మాల్దీవులు, కరేబియన్ దీవుల గురించి వినే వున్నాం. చుట్టూ నీళ్లు, మధ్యలో అందమైన ప్రకృతికి నెలవుగా తీరుగా ఉండే భూమి.. తీరాన ఇసుకతిన్నెలు, బారులు తీరినట్టుగా ఉండే పామ్ చెట్లు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆహ్లాదకరమైన వాతావరణానికి దీవులు పెట్టింది పేరు. అలాంటి చోటకు కొత్త దంపతులైతే హనీమూన్‌కి వెళతారు. ఇంకొందరు విశ్రాంతి కోసం వెళతారు. మరికొందరు దీవుల చుట్టూ ఉండే వాతావరణాన్ని పరిశోధించడానికి వెళతారు. ఎవరెందుకు వెళ్లినా దీవులు ఎప్పుడూ కనువిందు చేస్తూ వెనక్కి తిరిగి వెళ్లనివ్వకుండా ఆకట్టుకుంటూనే ఉంటాయి. అలాంటి చోట కొన్ని రోజులపాటు ఆనందానుభూతులను సొంతం చేసుకొని, వదిలి రావాలంటే మనసొప్పదు. అలాగని మనది కాని చోట ఎన్నాళ్లని ఉంటాంలే అని సర్దుబాటూ అవసరం లేదు. మీకు నచ్చిన దీవిని కొనేసుకుంటే ఎన్నాళ్లైనా అక్కడే ఉండిపోవచ్చు. అవసరం లేదనుకుంటే అద్దెలకు ఇచ్చుకోవచ్చు. వ్యాపార లావాదేవీలు కొనసాగించవచ్చు. కొన్నవాటిని తిరిగి అమ్మకానికి పెట్టవచ్చు. ఏదైనా ఒక దీవిని కొనాలనే ఆలోచన మీకుంటే చాలు ప్రపంచ స్థిరాస్తుల విపణిలో అందమైన దీవులు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. సంపన్న వర్గాలు విలాసవంతమైన జీవనం కోసం దీవులను కొనుగోలు చేస్తుంటారు. ఆహ్లాదం కోసం కొనుగోళ్లు... అనేకమంది శ్రీమంతులు ఇప్పుడు దీవుల మీద దృష్టిసారిస్తున్నారు. వాటిని కొనుగోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో మనసుకు నచ్చినట్టుగా గడపడం కోసం విలాసవంతులు దీవులను ఎంచుకుంటున్నారు. కొందరు తమ స్థోమతను బట్టి కొన్నేళ్లపాటు అద్దెకు తీసుకుంటే, దీవులు నచ్చితే ఎంత మొత్తమైనా పెట్టుబడిగా పెట్టి కొనుగోలు చేసి, పూర్తిగా తమ సొంతం చేసుకునేవారు కొందరుంటారు. అమెరికాలోని సంగీత దిగ్గజాలు ఫెయిత్ హిల్, టిమ్ మెక్గ్రోకి ఇలాగే బహమాస్‌లోని ఎక్స్‌మాస్ దీవిని కొనుగోలు చేశారు. దీంట్లో వీరు ఇటీవలే 15,000 చదరపు అడుగులలో అధునాతనమైన ఇంటిని నిర్మించుకున్నారు. ఆకర్షణీయమైన పెట్టుబడి... చిన్న చిన్న దీవులు పెద్ద ఆదాయానికి మార్గాలవుతున్నాయి. ఆకర్షణీయమైన పెట్టుబడిగా పలువురిని ఆకర్షిస్తున్నాయి. ద్వీపాలను కొనుగోలు చేసేవారిలో నూటికి 98 శాతం వ్యాపార దృక్కోణంలోనే చూస్తారు. ఇతర ఆస్తులపై పెట్టుబడి పెట్టినట్టుగానే దీవుల మీదా పెట్టుబడి పెడతారు. తమ సొంతం చేసుకున్న దీవులలో అద్భుతమైన వేసవి విడుదులు, హోటళ్లు నిర్మించి, వాటిని విహారయాత్రకు వచ్చేవారికి అద్దెలకు ఇస్తారు. ఇది లాభసాటి వ్యాపారంగా ఉండటంతో ప్రముఖ వ్యాపారవేత్తలు ఏయే దీవులు టూరిస్టులను ఆకర్షించే విధంగా ఉన్నాయో శోధిస్తారు. ఉత్తమం అనదగ్గ వాటిని వేలం పాటల ద్వారా తమ సొంతం చేసుకునే వేటలో ఉంటారు. అయితే మరికొంత మంది దీంట్లో కూడా వైవిధ్యాన్ని చూపుతున్నారు. లండన్‌కి చెందిన ప్రపంచప్రసిద్ధ వన్యప్రాణుల ఫొటోగ్రాఫర్ పీటర్ బియార్డ్ మాత్రం తన పెంపుడు చిరుత పిల్లల కోసం కిందటేడాది కోటికి పైగా డాలర్లు వెచ్చించి మరీ యూరప్‌లో ఓ దీవిని సొంతం చేసుకున్నాడు. ఇండో కెనడియన్ బిలియనీర్ అయిన బాబ్ ధిల్లన్ కైతే ఏకంగా 2,300 ఎకరాలు గల మాసివ్ దీవి ఉంది. మధ్య అమెరికాలో ఉన్న ఈ దీవి పగడపు దిబ్బలలో ప్రపంచంలోనే విస్తీర్ణంలో రెండవదిగా పేరుగాంచింది. అభివృద్ధి వైపు పరిశీలన... కొన్ని దీవులు 2 నుంచి 12 ఎకరాలలోనే ఉంటాయి. వీటిని అతి చిన్న ద్వీపాలుగా పిలుస్తారు. 12 - 24 ఎకరాలలో ఉండేవి మధ్యస్థం. వీటిని ఎంచుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. 24 నుంచి 37 ఎకరాల వరకు ఉండేవి పెద్ద దీవులు. 37 నుంచి 50కి ఎకరాలకు పైగా ఉన్న దీవులలో పెద్ద భవనాలు, విల్లాలకు అనుకూలంగా ఇక్కడి భూమి ఉంటుంది. ఇలాంటి చోట అద్దెలకు, లీజులకు భవనాలు ఉంటాయి. వీటితో పాటు దీవి స్థలాకృతి, ఓడలకు వేసే లంగరుకు అనుకూలత, చుట్టుపక్కల పేరెన్నికగన్న బీచ్‌లు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. నాట్ ఫర్ సేల్... మన దేశంలో అండమాన్, నికోబార్ దీవులు ఉన్నాయి. బంగాళఖాతంలో తళతళ మెరిసేటి దృశ్యాలతో అత్యంత సుందరంగా ఉండే పగడపు దిబ్బలు ఉన్నాయి. భారతదేశ ప్రధాన భూభాగంలో తూర్పున 700 కి.మీ పొడవునా వ్యాపించి ఉన్న ఈ దీవులు నీలిరంగులో స్వచ్ఛంగా కనిపించే నీటితో, ఇసుక తిన్నెలతో కనువిందుచేస్తాయి. ఇవి మన కేంద్రపాలిత ప్రాంతాలు కాబట్టి వీటి కొనుగోళ్లకు, అమ్మకాలకు అనుమతించరు. అయితే వీటిలో స్థిరాస్తులను కొనుగోలు చేయవచ్చు. ప్రైవేట్ దీవులు సముద్రపు నీటిలో భూభాగానికి దూరంగా ఉంటాయి. ఇవి వ్యక్తి లేదా సంస్థల చేతుల్లో ఉంటాయి. కొన్ని దీవులు స్థానిక ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. గడచిన రెండేళ్లలో దీవుల కొనుగోళ్లు అమ్మకాలలో వృద్ధి రేటు రెట్టింపు అవుతూ వస్తోంది. వీటిని కొనుగోళ్లకు పెట్టినప్పుడు సొంతం చేసుకునేవీలుంటుంది. దీవుల అమ్మకాలు, కొనుగోళ్లలో ‘ప్రైవేట్ ఐల్యాండ్ ఆన్లైన్ డాట్ కామ్’ పేరెన్నిక గన్నది. ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. - కూర్పు: ఎన్.ఆర్.