దీవులను కొందామా?
ఇల్లు, కారు.. కొనమన్నంత సులువుగా... ఏకంగా దీవినే కొనమంటున్నారేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా! మీరు చదివింది నిజమే! ఇల్లు, కారు ఇతర వస్తువులు కొన్నట్లుగానే డబ్బులుంటే ఏకంగా దీవులనే కొనుగోలు చేయవచ్చు. లేదంటే కొన్నాళ్ల వరకు వాటిని లీజుకు తీసుకోవచ్చు. ఇంకా కాదనుకుంటే ఆయా దీవులలోని నచ్చిన విల్లాను ఎంపిక చేసుకొని, సొంతం చేసుకోవచ్చు. తక్కువ కాలానికి అద్దెకు దొరికే విల్లా సదుపాయాలు కూడా దీవులలో ఎన్నో ఉన్నాయి. అలాంటి దీవుల కథాకమామీషు...
- వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు అనేక చిన్నా పెద్దా దీవులు సొంతంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా యూరప్ దీవులలోనూ, మాల్దీవులలోనూ మాల్యా రిసార్ట్స్ నడుపుతున్నారు.
- ఖతార్ రాజు షేక్ అహ్మద్ ఖలీప్ అలీకి సొంతంగా రెండు దీవులున్నాయి. హాలీవుడ్ నటుడు, వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్ బ్రిటిష్ వర్జిన్ దీవుల సముదాయంలోని నెకర్ ఐలాండ్‌ను సొంతం చేసుకున్నాడు.
మనకు అండమాన్, నికోబార్ దీవులు తెలుసు. మాల్దీవులు, కరేబియన్ దీవుల గురించి వినే వున్నాం. చుట్టూ నీళ్లు, మధ్యలో అందమైన ప్రకృతికి నెలవుగా తీరుగా ఉండే భూమి.. తీరాన ఇసుకతిన్నెలు, బారులు తీరినట్టుగా ఉండే పామ్ చెట్లు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆహ్లాదకరమైన వాతావరణానికి దీవులు పెట్టింది పేరు. అలాంటి చోటకు కొత్త దంపతులైతే హనీమూన్‌కి వెళతారు. ఇంకొందరు విశ్రాంతి కోసం వెళతారు. మరికొందరు దీవుల చుట్టూ ఉండే వాతావరణాన్ని పరిశోధించడానికి వెళతారు.
ఎవరెందుకు వెళ్లినా దీవులు ఎప్పుడూ కనువిందు చేస్తూ వెనక్కి తిరిగి వెళ్లనివ్వకుండా ఆకట్టుకుంటూనే ఉంటాయి. అలాంటి చోట కొన్ని రోజులపాటు ఆనందానుభూతులను సొంతం చేసుకొని, వదిలి రావాలంటే మనసొప్పదు. అలాగని మనది కాని చోట ఎన్నాళ్లని ఉంటాంలే అని సర్దుబాటూ అవసరం లేదు. మీకు నచ్చిన దీవిని కొనేసుకుంటే ఎన్నాళ్లైనా అక్కడే ఉండిపోవచ్చు. అవసరం లేదనుకుంటే అద్దెలకు ఇచ్చుకోవచ్చు. వ్యాపార లావాదేవీలు కొనసాగించవచ్చు. కొన్నవాటిని తిరిగి అమ్మకానికి పెట్టవచ్చు. ఏదైనా ఒక దీవిని కొనాలనే ఆలోచన మీకుంటే చాలు ప్రపంచ స్థిరాస్తుల విపణిలో అందమైన దీవులు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. సంపన్న వర్గాలు విలాసవంతమైన జీవనం కోసం దీవులను కొనుగోలు చేస్తుంటారు.
ఆహ్లాదం కోసం కొనుగోళ్లు...
అనేకమంది శ్రీమంతులు ఇప్పుడు దీవుల మీద దృష్టిసారిస్తున్నారు. వాటిని కొనుగోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో మనసుకు నచ్చినట్టుగా గడపడం కోసం విలాసవంతులు దీవులను ఎంచుకుంటున్నారు. కొందరు తమ స్థోమతను బట్టి కొన్నేళ్లపాటు అద్దెకు తీసుకుంటే, దీవులు నచ్చితే ఎంత మొత్తమైనా పెట్టుబడిగా పెట్టి కొనుగోలు చేసి, పూర్తిగా తమ సొంతం చేసుకునేవారు కొందరుంటారు. అమెరికాలోని సంగీత దిగ్గజాలు ఫెయిత్ హిల్, టిమ్ మెక్‌గ్రోకి ఇలాగే బహమాస్‌లోని ఎక్స్‌మాస్ దీవిని కొనుగోలు చేశారు. దీంట్లో వీరు ఇటీవలే 15,000 చదరపు అడుగులలో అధునాతనమైన ఇంటిని నిర్మించుకున్నారు.
ఆకర్షణీయమైన పెట్టుబడి...
చిన్న చిన్న దీవులు పెద్ద ఆదాయానికి మార్గాలవుతున్నాయి. ఆకర్షణీయమైన పెట్టుబడిగా పలువురిని ఆకర్షిస్తున్నాయి. ద్వీపాలను కొనుగోలు చేసేవారిలో నూటికి 98 శాతం వ్యాపార దృక్కోణంలోనే చూస్తారు. ఇతర ఆస్తులపై పెట్టుబడి పెట్టినట్టుగానే దీవుల మీదా పెట్టుబడి పెడతారు. తమ సొంతం చేసుకున్న దీవులలో అద్భుతమైన వేసవి విడుదులు, హోటళ్లు నిర్మించి, వాటిని విహారయాత్రకు వచ్చేవారికి అద్దెలకు ఇస్తారు. ఇది లాభసాటి వ్యాపారంగా ఉండటంతో ప్రముఖ వ్యాపారవేత్తలు ఏయే దీవులు టూరిస్టులను ఆకర్షించే విధంగా ఉన్నాయో శోధిస్తారు.
ఉత్తమం అనదగ్గ వాటిని వేలం పాటల ద్వారా తమ సొంతం చేసుకునే వేటలో ఉంటారు. అయితే మరికొంత మంది దీంట్లో కూడా వైవిధ్యాన్ని చూపుతున్నారు. లండన్‌కి చెందిన ప్రపంచప్రసిద్ధ వన్యప్రాణుల ఫొటోగ్రాఫర్ పీటర్ బియార్డ్ మాత్రం తన పెంపుడు చిరుత పిల్లల కోసం కిందటేడాది కోటికి పైగా డాలర్లు వెచ్చించి మరీ యూరప్‌లో ఓ దీవిని సొంతం చేసుకున్నాడు. ఇండో కెనడియన్ బిలియనీర్ అయిన బాబ్ ధిల్లన్ కైతే ఏకంగా 2,300 ఎకరాలు గల మాసివ్ దీవి ఉంది. మధ్య అమెరికాలో ఉన్న ఈ దీవి పగడపు దిబ్బలలో ప్రపంచంలోనే విస్తీర్ణంలో రెండవదిగా పేరుగాంచింది.
అభివృద్ధి వైపు పరిశీలన...
కొన్ని దీవులు 2 నుంచి 12 ఎకరాలలోనే ఉంటాయి. వీటిని అతి చిన్న ద్వీపాలుగా పిలుస్తారు. 12 - 24 ఎకరాలలో ఉండేవి మధ్యస్థం. వీటిని ఎంచుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. 24 నుంచి 37 ఎకరాల వరకు ఉండేవి పెద్ద దీవులు. 37 నుంచి 50కి ఎకరాలకు పైగా ఉన్న దీవులలో పెద్ద భవనాలు, విల్లాలకు అనుకూలంగా ఇక్కడి భూమి ఉంటుంది. ఇలాంటి చోట అద్దెలకు, లీజులకు భవనాలు ఉంటాయి. వీటితో పాటు దీవి స్థలాకృతి, ఓడలకు వేసే లంగరుకు అనుకూలత, చుట్టుపక్కల పేరెన్నికగన్న బీచ్‌లు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారు.
నాట్ ఫర్ సేల్...
మన దేశంలో అండమాన్, నికోబార్ దీవులు ఉన్నాయి. బంగాళఖాతంలో తళతళ మెరిసేటి దృశ్యాలతో అత్యంత సుందరంగా ఉండే పగడపు దిబ్బలు ఉన్నాయి. భారతదేశ ప్రధాన భూభాగంలో తూర్పున 700 కి.మీ పొడవునా వ్యాపించి ఉన్న ఈ దీవులు నీలిరంగులో స్వచ్ఛంగా కనిపించే నీటితో, ఇసుక తిన్నెలతో కనువిందుచేస్తాయి. ఇవి మన కేంద్రపాలిత ప్రాంతాలు కాబట్టి వీటి కొనుగోళ్లకు, అమ్మకాలకు అనుమతించరు. అయితే వీటిలో స్థిరాస్తులను కొనుగోలు చేయవచ్చు.
ప్రైవేట్ దీవులు సముద్రపు నీటిలో భూభాగానికి దూరంగా ఉంటాయి. ఇవి వ్యక్తి లేదా సంస్థల చేతుల్లో ఉంటాయి. కొన్ని దీవులు స్థానిక ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. గడచిన రెండేళ్లలో దీవుల కొనుగోళ్లు అమ్మకాలలో వృద్ధి రేటు రెట్టింపు అవుతూ వస్తోంది. వీటిని కొనుగోళ్లకు పెట్టినప్పుడు సొంతం చేసుకునేవీలుంటుంది. దీవుల అమ్మకాలు, కొనుగోళ్లలో ‘ప్రైవేట్ ఐల్యాండ్ ఆన్‌లైన్ డాట్ కామ్’ పేరెన్నిక గన్నది. ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
- కూర్పు: ఎన్.ఆర్.