ఆ దీవులకు వాళ్లే రారాజులు... | Private Islands Owned by Billionaires | Sakshi
Sakshi News home page

ఆ దీవులకు వాళ్లే రారాజులు...

Published Wed, Dec 2 2015 8:18 PM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM

ఆ దీవులకు వాళ్లే రారాజులు...

ఆ దీవులకు వాళ్లే రారాజులు...

సాక్షి:  వినోద, విహార కేంద్రాలకు నిలయాలు దీవులు. అందుకే అవి పర్యాటక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. వీటిలో కొన్ని స్వతంత్ర  దేశాలుగా ఉంటే, మరికొన్ని ఇతర దేశాల  ఆధీనంలో ఉన్నాయి. కానీ కొన్ని దీవులు మాత్రం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. అమ్మకానికి పెట్టిన ఎన్నో దీవుల్ని  ప్రపంచవ్యాప్తంగా పలువురు సొంతం  చేసుకున్నారు. ఆయా దీవుల్లోకి మరెవరికీ ప్రవేశం లేకుండా యజమానులే స్వాధీనంలో ఉంచుకుని, వాటికి రారాజులుగా  వెలిగిపోతున్నారు. అలా కొన్ని దీవుల్ని సొంతం చేసుకున్న వారి గురించి తెలుసుకుందాం...

 రోమన్ అబ్రామోవిక్ (హోలాండ్ దీవి)..
 ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసిన దీవుల్లో అతి ఖరీదైన దీవిని సొంతం చేసుకున్నది రోమన్ అబ్రామోవిక్ అనే రష్యా వ్యాపారవేత్త. మిల్‌హౌస్ ఎల్‌ఎల్‌సీ, చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్ సహా రష్యాలోని అనేక సంస్థలకు ఆయన అధిపతి. చాలామంది రోమన్ అబ్రామోవిక్‌ను ఆధునిక రోమన్ సామ్రాజ్యాధినేతగా అభివర్ణిస్తారు. ప్రపంచంలో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసేందుకే ఆయన ఇష్టపడతారు. ఇంతకీ ఆయన కొనుగోలు చేసిన దీవి ఖరీదెంతో తెలుసా.. మన కరెన్సీ ప్రకారం 2,600 కోట్ల రూపాయలు. ఆ దీవి పేరు హోలాండ్. అయితే ఇతరుల్లా దీన్ని సొంతానికి వాడుకోకుండా సాంస్కృతికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. దీనితోపాటు ఇతర దీవుల్ని కూడా రోమన్ కొనుగోలు చేశాడు.
 
 బిల్‌గేట్స్ (గ్రాండ్ బూగ్ కే)..
 ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఓ దీవిని సొంతం చేసుకున్నాడు. బెలిజ్ దేశంలోని సముద్ర తీరాన ఉన్న అతిపెద్ద ద్వీపాన్ని ఆయన దాదాపు 166 కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేశారు. ఈ దీవి విస్తీర్ణం మొత్తం 314 ఎకరాలు. ఈ దీవిలోని బీచ్‌లు అతి సుందరంగా ఉంటాయి. పలు రకాల సముద్ర జీవులకు కూడా ఈ దీవి నిలయం. ట్యూనికేట్స్, స్టార్‌ఫిష్, డాల్ఫిన్లు ప్రధాన ఆకర్షణలు. ఇక్కడి సముద్రపు నీరు చాలా దూరం వరకు పారదర్శకంగా కనిపిస్తుంది. స్కూబాడైవింగ్‌లాంటి జలక్రీడలకు కూడా ఈ దీవి అనువైనదని సమాచారం. ఈ దీవిని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఇతర పర్యాటకులెవరికీ ఇందులోకి ప్రవేశం లేదు. కేవలం బిల్‌గేట్స్, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే అప్పుడప్పుడు ఈ దీవిలో సేదతీరుతున్నారు.
 
 షకీరా (బాండ్స్ కే)..
 పాప్‌గాయనిగా ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న షకీరా కూడా ఓ దీవిని కొనుగోలు చేసింది. అంటే ఆ దీవికి ఆవిడే మహారాణి అన్నమాట. ప్రపంచంలో ఖరీదైన దీవుల్ని సొంతం చేసుకున్నవారి జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళ షకీరాయే. ఈమె ఫ్లోరిడాకు 125 మైళ్ల దూరంలోని బాండ్స్ కే అనే దీవిని కొనుక్కుంది. దాదాపు 110 కోట్ల రూపాయలతో దీన్ని సొంతం చేసుకుంది. ఈ దీవిలో ఐదు సుందరమైన బీచ్‌లున్నాయి. మరో మూడు సరస్సులు కూడా ఉన్నాయి. వీటితోపాటు కోరల్ రీఫ్స్, చేపల వేటకు అనువైన ప్రాంతాలు, అందమైన ప్రకృతి వంటి ఆకర్షణలెన్నో దీవిలో కనిపిస్తాయి. అయితే షకీరా సొంతంగా సేదతీరేందుకు మాత్రమే కాకుండా దీన్నో టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దీన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఇందులోని కొంత భాగాన్ని అమ్మకానికి పెట్టే యోచనలో ఉంది షకీరా.  
 
 మెల్ గిబ్సన్ (మ్యాగో దీవి)..
దీవుల కొనుగోలు విషయంలో అందరికంటే ముందు వరుసలో నిలిచేది హాలీవుడ్ తారలే. వీరిలో మెల్‌గిబ్సన్ ఒకరు. ఈయన కూడా ఓ ఐలాండ్‌ను కొనుగోలు చేశారు. దాదాపు 5,400 ఎకరాల విస్తీర్ణం కలిగిన మ్యాగో ఐలాండ్‌ను సొంతం చేసుకున్నారు. జపాన్‌కు చెందిన ఓ సంస్థ నుంచి 2005లో వంద కోట్ల రూపాయలు చెల్లించి ఈ దీవిని కైవసం చేసుకున్నారు. పసిఫిక్ సముద్రంలో ఉన్న అతిపెద్ద దీవి ఇదే. దీన్ని పర్యాటకులకోసం కాకుండా సొంతంగా వాడుకునేందుకే మెల్‌గిబ్సన్ ప్రాధాన్యమిస్తున్నారు.
 
 ఎడ్డీ మర్ఫీ(రూస్టర్ కే)..
 ప్రైవేట్ దీవిని కొనుగోలు చేసిన మరో హాలీవుడ్ నటుడు, దర్శకులు ఎడ్డీ మర్ఫీ. అత్యధిక పారితోషికం అందుకుంటున్న తారల్లో ఈయన కూడా ఒకరు. ఎడ్డీ బాల్యమంతా లాంగ్ అనే దీవిలోనే గడిచింది. అందువల్లే ఆయనకు దీవులంటే చాలా ఇష్టం. అందువల్లే 2007లో దాదాపు వంద కోట్లు చెల్లించి రూస్టర్ కే అనే దీవిని కొనుగోలు చేశాడు. ప్యారడైజ్ అనే మరో దీవికి సమీపంలోనే ఉండే రూస్టర్ దీవి ఇప్పటికీ ప్రజలకు ఓ మిస్టరీగానే ఉంది. ఎడ్డీ ఇంతకుముందు కూడా కొన్ని దీవులను కొనుగోలు చేశాడు. వాటన్నింటిలోకి రూస్టర్ చాలా అందమైన దీవి అని సమాచారం. ప్రస్తుతం ఎడ్డీ తన పరివారంతో సేదతీరేందుకు మాత్రమే దీన్ని వినియోగిస్తున్నారు. అయితే ఈ దీవిని అభివృద్ధి చేస్తే మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయట.
 
 బెర్నార్డ్ ఆర్నాల్ట్ (ఇండిగో దీవి)..
 ప్రపంచ కుబేరుల్లో ఒకడైన వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ కూడా దీవిని కొనుగోలు చేశాడు. బహమాస్ దీవుల సమూహంలోని ఇండిగో ఐలాండ్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. దాదాపు 232 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన ఈ దీవి మొత్తం విస్తీర్ణం 133 ఎకరాలు. ఈ దీవిని బెర్నార్డ్ సేదతీరేందుకు వినియోగిస్తాడు. అందమైన బీచ్‌లు కలిగిన దీవి పర్వతప్రాంతంలో బెర్నార్డ్ మరింత అందమైన విల్లాను నిర్మించుకున్నాడు. తన అభిరుచికి అనుగుణంగా టెన్నిస్ కోర్టులతో సహా ఇతర వసతులను సమకూర్చుకున్నాడు. ఇది కూడా పూర్తిగా బెర్నార్డ్ వ్యక్తిగత అవసరాలకోసమే వినియోగిస్తుండడంతో ఇతరులకు ఇక్కడికి ప్రవేశం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement