
మడ అడవుల పెంపకానికి ప్రణాళిక
సముద్ర తీరం వెంట 1,030 హెక్టార్లలో పెంపకం
ఉపాధి హామీ పథకం రాష్ట్ర డెరైక్టర్ కరుణ
పాలకాయతిప్ప సమీపంలో పరిశీలన
కోడూరు : కృష్ణా, గోదావరి జిల్లాల్లో ప్రకృతి విపత్తుల సమయంలో తీరప్రాంతాల ప్రజలకు రక్షణ కల్పించేందుకు 1,030 హెక్టార్లలో మడ అడవుల పెంపకానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఉపాధి హామీ పథకం రాష్ట్ర డెరైక్టర్ కరుణ తెలిపారు. కోడూరు మండల పరిధిలోని పాలకాయతిప్ప సమీపంలో సముద్రపు కరకట్ట లోపలి భాగంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం కింద పెంచుతున్న మడ అడవులను సోమవారం అధికార యంత్రాంగంతో కలిసి ఆమె పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లా కోరింగ సముద్ర తీరం నుంచి కృష్ణాజిల్లా నాగాయలంక మండలం నాచుగుంట వరకు ఉన్న 1,030 హెక్టార్ల భూమిని మడ అడవులు పెంచేందుకు ప్రభుత్వం తరఫున గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి అటవీ శాఖకు అప్పగించనున్నట్టు ఆమె తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ సంవత్సరం జూలై నుంచి ఇప్పటివరకు తీరం వెంట 30 హెక్టార్లలో మడ అడవుల పెంపకం చేపట్టినట్టు చెప్పారు. నాచుగుంట సమీపంలో 468, పాలకాయతిప్ప సమీపంలో 302, సంగమేశ్వరం సమీపంలో 268 హెక్టార్ల అటవీ శాఖ భూముల్లో ఇప్పటికే మడ అడవులు పెంచేందుకు ప్రణాళిక రూపొందించినట్లు కరుణ తెలిపారు.
తొలి విడతలో 250 హెక్టార్లలో...
తొలి విడతలో పాలకాయతిప్ప సమీపంలోని సముద్ర తీర భూముల్లో 250 హెక్టార్లలో ఈ మడ అడువుల పెంపకం సాగుతుందని కరుణ చెప్పారు. దీనికి సంబంధించి నెల రోజుల్లో ఉత్తర్వులు విడుదలవుతాయన్నారు. ఇప్పటి వరకు మడ అడవుల పెంపకం పనులు బయట ప్రాంతాలవారితో చేయిస్తున్నారని, ఈ పనులను తమ గ్రామస్తులతో చేయించాలని పాలకాయతిప్ప గ్రామస్తులు ఆమె దృష్టికి తీసుకురాగా, ఇకపై చేపట్టే పనుల్లో సమీప గ్రామ కూలీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కరుణ అధికారులకు సూచించారు. సముద్రంలో జీవించే జీవాలకు తీరం వెంట పెంచే మడ అడవులు నివాస స్థలాలుగా ఉండడంతో పాటు ప్రజలను విపత్తుల నుంచి రక్షించేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయని కరుణ పేర్కొన్నారు. సముద్ర తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు మడ చెట్టు కిందకు వస్తాయని, వీటి ద్వారా తాబేళ్లకు రక్షణ ఇవ్వడంతో పాటు వాటి సంఖ్య పెంచేందుకు కూడా ఈ మడ అడవులు ఎంతో దోహదపడతాయని ఆమె తెలిపారు. ముందుగా పాలకాయతిప్ప సమీపంలోని సముద్ర తీర భూముల్లో మడ మొక్కలను పథకం జిల్లా పీడీ మాధవిలత ఆధ్వర్యంలో నాటారు. అనంతరం మడ మొక్కల పెంపకాన్ని పడవపై వెళ్లి పరిశీలించారు. హైదరాబాద్ కమిషనరేట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అధికారి ఎంవీవీఎస్ మూర్తి, డ్వామా అడిషనల్ పీడీ ఎ.సురేష్, ఏపీడీ దేవానందరావు, ఎంపీడీవో కె.మణికుమార్, అటవీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.