సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో ఈ శతాబ్దంలోనే ఎన్నడు ఎరగనంతగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారం నాడు ఆ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ, 500 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కేరళ వరదలను ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలని అదే రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్‌కు సోషల్ మీడియాలో అనూహ్య మద్దతు లభిస్తోంది. ఇంతకు జాతీయ విపత్తు అంటే ఏమిటీ? అలా ప్రకటించడం వల్ల ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయం కన్నా ఎక్కువ సహాయం లభిస్తుందా? ప్రకృతి వైపరీత్యాల వల్లగానీ, మానవ తప్పిదాల వల్లగానీ, ప్రమాదాల వల్లగానీ అపార ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించినప్పుడు వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు 2005లో అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ‘డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్’ను తీసుకొచ్చింది. అయితే అందులో ఫలానాది జాతీయ విపత్తు, రాష్ట్ర స్థాయి లేదా జిల్లాస్థాయి విపత్తు లేదా స్థానిక విపత్తు అని వివరించి చెప్పేందుకు ఎలాంటి నిబంధనలుగానీ, ఎలాంటి మార్గదర్శకాలుగానీ లేవు.
‘ఏ ప్రాంతంలోనైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల, మానవ తప్పిదాల వల్ల, ప్రమాదాల వల్ల అపార ప్రాణ, ఆస్తి నష్టాలు లేదా మానవులకు కష్టాలు, పర్యావరణకు నష్టాలు ఏర్పడి, వాటిని నివారించడం ఆ ప్రాంతం అధికార యంత్రాంగానికి సాధ్యమయ్యే పరిస్థితి లేకుంటే వాటిని ప్రళయంగా, బీభత్సంగా, ఘోర ప్రమాదంగా భావిస్తాం’ అని మాత్రమే చట్టంలో నిర్వచనం ఉంది. ఈ చట్టం పరిధిలో ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్’ అనే ప్రభుత్వ విభాగం ఒకటి పనిచేస్తోంది. అది కూడా కార్యనిర్వహణా విభాగంలా కాకుండా సలహా సంఘంగానే పనిచేస్తోంది. రాష్ట్ర సంక్షోభ నిరోధక సలహా సంఘాలతో సలహా సంప్రదింపులకే పరిమితం అవుతోంది.
‘జాతీయ విపత్తు’ను నిర్వహించడానికి లేదా పిలవడానికి చట్టపరంగా,కార్యనిర్వాహకపరంగా ఎలాంటి నియమ నిబంధనలు, కనీసం సూచనలు కూడా లేవని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్’ ప్రకృతి వైపరీత్యాల విభాగం అధిపతి అనిల్ గుప్తా తెలిపారు. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని, కేంద్రం కేవలం సలహాలకే పరిమితం అవుతుందని ఆయన చెప్పారు. సంక్షోభ పిరిస్థితుల్లో కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు.
2016లో ప్రణాళిక విడుదల
‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్’ విభాగం 2016లో ఓ ప్రణాళికను విడుదల చేసింది. అందులో ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, ఘోర ప్రమాదాలతో ఏర్పడే విపత్తు పరిస్థితులను మూడు రకాలుగా విభజించారు. ఓ ప్రాంతంలో విపత్తు పరిస్థితులు ఏర్పడి, వాటిని ఎదుర్కోవడం అక్కడి పాలనా యంత్రంగంకు సాధ్యమయ్యే పరిస్థితి ఉంటే దాన్ని ఒకటవ నెంబర్ విపత్తుగా, ఆ ప్రాంతం పాలనా యంత్రాంగానికి సాధ్యమయ్యేది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో సాధ్యమయ్యే పరిస్థితులను రెండో విపత్తుగా, ఇక రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో ఎదుర్కొనే పరిస్థితి లేకపోతే దాన్ని మూడవ విపత్తుగా ఆ ప్రణాళిక నిర్వచించింది. దీన్ని మనం కావాలనుకుంటే జాతీయ విపత్తుగా పిలచుకోవచ్చు.
ఎలాంటి సహాయం అందుతుంది?
మూడవ విపత్తు కింద కేంద్రం ఎలాంటి సహాయ సహకారాలు అందించాలో ఎక్కడా ఓ నిర్వచనంగానీ నిబంధనగానీ లేదు. దేశవ్యాప్తంగా ఇంతవరకు ఎన్నో విపత్తులు సంభవించినా తాము అది ఏ స్థాయి విపత్తో ఇంతవరకు ఎన్నడూ పేర్కొన లేదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్’ నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ డివిజన్’ అధిపతి సూర్య ప్రకాష్ తెలిపారు. విపత్తు పరిస్థితులు ఎదుర్కొంటున్న రాష్ట్రం విజ్ఞప్తి మేరకే కేంద్రం స్పందిస్తుందని, ఎంత ఆర్థిక సహాయం చేయాలి, ఎలాంటి సహాయం చేయాలో స్పష్టం చేసే మార్గదర్శకాలేవీ లేవని అన్నారు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందనే విషయాన్నే పరిగణలోకి తీసుకొని కేంద్రం స్పందన ఉండటం సహజమని ఆయన వివరించారు.
అందుకేనా ఈ వ్యత్యాసం?
2013లో ఉత్తరాఖండ్‌లో భారీ వరదలు సంభవించి 5,700 మంది మరణిస్తే అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. 2015లో తమిళనాడులో వరదలు సంభవించి ప్రాణహాని అంతగా లేకపోయినా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 939.6 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. కేరళలో శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా వరదలు ముంచెత్తి ఇప్పటికే 400 మందికిపైగా మరణిస్తే మోదీ ప్రభుత్వం ముందుగా వంద కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మాత్రమే ప్రకటించింది. కేరళలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం ఉందన్న కారణంగానే మోదీ ప్రభుత్వం అంత తక్కువ ఆర్థిక సహాయాన్ని ప్రకటించిందంటూ విమర్శలు వెల్లువెత్తడంతో మోదీ స్వయంగా కేరళ వరద ప్రాంతాలను గగన మార్గంలో సందర్శించి అదనంగా 500 కోట్ల రూపాయల ఆర్థిక సహాయన్ని ప్రకటించారు.
ఆర్థిక సహాయాన్ని అందించడంలోనే కాకుండా వరదలను జాతీయ విపత్తుగా పేర్కొనడంలోనూ రాజకీయాలు ఉన్నాయి. 2017లో గుజరాత్, బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సంభవించిన వర్షాలను ప్రభుత్వంగానీ, ప్రతిపక్షంగానీ జాతీయ విపత్తుగా వర్ణించలేదు. అంతకుముందు మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో జమ్మూ కశ్మీర్‌లో సంభవించిన వరదలను ‘జాతీయ స్థాయి విపత్తు’గా మోదీనే వర్ణించారు. బిహార్‌లో సంభవించిన వరదలకన్నా ప్రాణ నష్టం అతి తక్కువగా ఉన్నప్పటికీ ఆయన అలా వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేరళ వరదలను కూడా ‘జాతీయ విపత్తు’గా పేర్కొని 500 కోట్ల రూపాయల సహాయాన్ని మరింతగా పెంచాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయగా, ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. హతవిధి! ‘జాతీయ విపత్తు’కే విపత్తు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment