
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్‌లో వరద తాకిడితో పలు ప్రాంతాలు దెబ్బతినడంతో రాష్ట్ర ప్రభుత్వం వరదలను ప్రకృతి విలయంగా ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సాయం, పునరావాసం కోసం ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రూ 100 కోట్ల సాయం ప్రకటించారు. వరదలను ప్రకృతి విలయంగా పరిగణిస్తూ తదనుగుణంగా సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలను ముమ్మరం చేసేందుకు అవసరమైన నోటిఫికేషన్ సత్వరం జారీ చేయాలని ఫైనాన్షియల్ కమిషనర్ (రెవెన్యూ)ను సీఎం ఆదేశించారు. గతంలో పంట నష్టాలకు గురైన రైతులకు పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని విడుదల చేయాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు.వరదల్లో నష్టపోయిన రైతాంగంతో పాటు నిర్వాసితులనూ తక్షణమే ఆదుకుంటామని సీఎం అమరీందర్ సింగ్ బాధితులకు భరోసా ఇచ్చారు.