
దేశంలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. అయితే పంజాబ్‌లో సంభవించిన వరదలు ఒక విచిత్ర ఘటనకు కారణంగా నిలిచాయి. 35 ఏళ్ల క్రితం తల్లికి దూరమైన కుమారుడు వరదల కారణంగా తల్లిని కలుసుకున్నాడు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న వాలంటీర్ జగజీత్‌సింగ్ తన తల్లిని కలుసుకున్నాడు. ఈ నేపధ్యంలో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
తండ్రి మరణంతో..
జగజీత్ సింగ్ పటియాలాలోని బోహర్‌పూర్ గ్రామంలో వరద బాధితులను ఆదుకునే పనుల్లో పాల్గొన్నాడు. ఈ నేపధ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను బయటకు తీసుకువచ్చి, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాడు. ఈ సందర్భంగా అతను తన తల్లి హర్జీత్ కౌర్‌ను కలుసుకున్నాడు. జగజీత్‌కు 6 నెలల వయసు ఉన్నప్పుడు అతని తండ్రి మరణించాడు. అనంతరం అతని తల్లి రెండో వివాహం చేసుకుంది.
మూడు దశాబ్దాల తరువాత..
రెండేళ్ల తరువాత జగజీత్ సింగ్ తాత, నాయనమ్మలతో పాటు వారుంటున్న ప్రాంతానికి వెళ్లిపోయాడు. అయితే అతని తాత జగజీత్ సింగ్‌తో నీ తల్లిదండ్రులు ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారని చెప్పడంతో, అదే నిజమని భావిస్తూ అతను పెరిగి పెద్దయ్యాడు. అయితే ఇప్పుడు మూడు దశాబ్దాల తరువాత తల్లిని కలుసుకున్న జగజీత్ పట్టలేనంత ఆనందానికి లోనయ్యాడు. చెట్టంత ఎదిగిన తన కుమారుడిని చూసిన ఆ తల్లి ఎంతగానో మురిసిపోయింది.
‘ఆ సంగతి ఇంతవరకూ తెలియదు’
ఈ సందర్భంగా జగజీత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ‘నా జీవిత కథ ఇప్పుడు అందరి ముందు ఉంది. పటియాలాలోని పలు ప్రాంతాలు వరదలకు ప్రభావితమయ్యాయి. నా తల్లి బతికివుందనే సంగతి నాకు ఇంత వరకూ తెలియదు. నేను జూలై 19న పటియాలో ఉన్నాను. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాను. ఆ సమయంలో మా అత్త నాకు కాల్ చేసింది.
‘ఆ క్షణంలో భూమి కంపించినట్లయ్యింది’
మా అమ్మమ్మ, తాత ఇల్లు పటియాలాలోని బోహర్‌పూర్ గ్రామంలో ఉందని తెలిపింది. దీంతో నేను బోహర్‌పూర్ చేరుకున్నాను. అమ్మమ్మ ప్రీతమ్ కౌర్‌ను కలుసుకున్నాను. అప్పుడు ఆమెను పలు ప్రశ్నలు అడిగాను. తాను వారి కుమార్తె హర్‌జీత్ కౌర్ కుమారుడినని తెలిపింది. హర్‌జీత్ మొదటి భర్త కారణంగా తాను పుట్టానని వివరించింది. దీంతో నాకు కిందనున్న భూమి కంపించినట్లయ్యింది. 35 ఏళ్ల పాటు తల్లికి దూరమైన దురదృష్టవంతుడినని లోలోనే కుమిలిపోయాను. అయితే ఇప్పుడు ఆ భగవంతుడే తనకు తల్లిని దగ్గర చేశాడని జగజీత్ సింగ్ ఆనందంగా తెలిపాడు. అమ్మమ్మ, తాతయ్య.. నాన్నమ్మ, తాత కుటుంబాల మధ్య ఏవో వివాదాల కారణంగా మాటలు లేవని, అందుకే ఇంతకాలం తల్లిని కలుసుకోలేకపోయానని జగజీత్ వివరించాడు.
ఇది కూడా చదవండి: చేతులతో మలం ఎత్తుతూ.. ఏటా ఎంతమంది మరణిస్తున్నారంటే..?