కొందుర్గు (రంగారెడ్డి జిల్లా): వరదనీరు తల్లీకొడుకుల హృదయాలను తల్లడిల్లేలా చేసింది. బేకరీలో పనికి వెళ్లిన ఓ తల్లి వర్షం కారణంగా మధ్యాహ్నమే తిరిగి ఇంటికి పయనంకాగా దారి మధ్యలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగుకి ఇవతలే ఆగిపోయింది. కాగా, తల్లి వాగు వద్దే ఆగిపోయిందని తెలుసుకుని కంగారుపడ్డ కొడుకు అక్కడకు చేరుకుని తల్లిరాక కోసం తల్లడిల్లిపోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చెర్కుపల్లికి చెందిన గుర్రంపల్లి చిన్నమ్మ శుక్రవారం యథావిధిగా షాద్‌నగర్‌లోని ఓ బేకరీలో పనికి వెళ్లింది. అయితే వర్షం కారణంగా మధ్యాహ్నమే తిరిగి ఇంటికి పయనమైంది. ఈ క్రమంలో కొందుర్గులో బస్సు దిగి నడుచుకుంటూ ఇంటికివెళ్తుండగా శివారులోని వాగు ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఆమె అక్కడే ఒడ్డున ఆగిపోయింది.
చిన్నమ్మ వాగు వద్ద ఉందని తెలుసుకున్న కుమారుడు రోహిత్ వాగు వద్దకు వచ్చి తల్లిరాకకోసం తల్లడిల్లిపోయాడు. సుమారు మూడు గంటల ఉత్కంఠ అనంతరం వాగు ఉధృతి తగ్గుముఖం పట్టడంతో చిన్నమ్మను స్థానికులు నెమ్మదిగా అవతలి ఒడ్డుకు చేర్చారు. దీంతో తల్లీకొడుకుల నిరీక్షణ ఫలించింది.
Comments
Please login to add a commentAdd a comment