ప్రతీకాత్మక చిత్రం
ప్రకృతి వైపరీత్యాల రూపంలో ఏర్పడుతున్న సంక్షోభాలను నిర్వహిం చడం కంటే వాటిని నివారించడం ఎంతో కీలకమైన అంశం. ఒక చిన్న రాష్ట్రమైన కేరళ ఇటీవల కనీవినీ ఎరుగని వరదల బారినపడి రూ. 21వేల కోట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. పశ్చిమకనుమల్లో పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన 3 ప్రాంతాల్లో 14 లక్షల చదరపుటడుగుల నేల క్షయమైపోవడంపై మాధవ్ గాడ్గిల్ నేతృత్వంలోని వెస్టర్న్ ఘాట్స్ ఎక్స్‌పర్ట్ ఎకాలజీ ప్యానెల్ చాలాకాలం క్రితమే తీవ్రంగా హెచ్చరించింది. ఈ కీలక ప్రాంతంలో నిర్మాణాలను, మైనింగ్ కార్యకలాపాలను తక్షణం నిషేధించాలని ప్యానెల్ సిఫార్సు చేసింది. కానీ దేశంలోని మిగతా రాష్ట్రాల్లో మాదిరే కేరళ ప్రభుత్వం మాధవ్ గాడ్గిల్ నివేదికను అలా తోసిపుచ్చింది. దీని ఫలితమే పెను వరద బీభత్సం.
భారతదేశం ప్రకృతి వైపరీత్యాలకు నిలయం. దేశ భూభాగంలో 70 శాతం మేరకు సునామీలకు, తుపానులకు నిలయంగా ఉంటోంది. దాదాపు 60 శాతం భూమి భూకంపాల బారిన పడుతుండగా, 12 శాతం వరదల బారిన పడుతోంది. కానీ పట్టణ భారత్‌లో మాత్రం బహుళ అంతస్థుల భవనాలను విచ్చలవిడిగా కడుతున్నారు. ఇవి భూమిపై వేస్తున్న అదనపు భారాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా భూకంపాలకు సంబంధించిన ఇంజనీరింగ్ కోర్సును దేశంలో అతికొద్ది యూనివర్సిటీలు మాత్రమే నిర్వహిస్తుండటం గమనార్హం.
ప్రకృతి బీభత్సం ఇంత ప్రమాదకర స్థాయిలో చెలరేగుతున్నప్పటికీ నష్ట నివారణ ప్రక్రియ ఇప్పటికీ దేశంలో శైశవదిశలోనే ఉంటోంది. దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలు కూడా రిస్క్ మేనేజ్‌మెంట్ రంగంలో నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి సైనిక బెటాలియన్ల ఏర్పాటుతోపాటు ప్రత్యేక బృందాలను ఎర్పర్చుకోవాలని కేంద్ర హోంశాఖ 2003లోనే ప్రతిపాదించింది. ప్రత్యేకించి కేరళ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి శిక్షణా సంస్థను నెలకొల్పుకోవాలని, పోలీసు బెటాలియన్లను సిద్ధం చేసుకోవాలని హోంశాఖ సూచిం చింది కానీ నేటికీ కేరళ ప్రభుత్వం స్పందించలేదు.
ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడంలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం. కేదార్‌నాథ్ విషాదం జరిగి ఏళ్లు గడిచిపోయినప్పటికీ ఉత్తరాఖండ్ రాష్ట్రం మూడు నుంచి ఆరు గంటల ముందే కారు మేఘాల గురించి, అతిభారీ వర్షాల గురించి హెచ్చరించే డాప్లర్ రాడార్ల వ్యవస్థను చాలా పరిమితంగానే కలిగి ఉంది. తగిన సంఖ్యలో హెలిపాడ్‌లు సరే సరి.. వరద తాకిడికి గురయ్యే ప్రాంతాల్లో నిర్మాణాలు ఎలా జరగాలో సూచించే మార్గదర్శక సూత్రాలు, వరద సమయాల్లో సురక్షిత ప్రాంతాలను గుర్తించే మ్యాప్‌లు కూడా తగినన్ని లేకపోవడం విచారకరం. పర్వతప్రాంతాల్లో భారీ డ్యామ్‌లకు ఆమోదముద్ర తెలిపినప్పటికీ జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ –ఎన్‌ఎమ్‌డీఏ– మూగపోయినట్లు కనిపిస్తోంది. భారత్‌లోని 5 వేల డ్యామ్‌లకు సంబంధించి అతి కొద్ది రాష్ట్రాలు మాత్రమే అత్యవసర కార్యాచరణ పథకాలతో సంసిద్ధంగా ఉన్నాయి. ఇంతవరకు 200 డ్యామ్‌లను మాత్రమే ఇవి కవర్ చేయడం గమనార్హం. మిగిలిన 4,800 డ్యాముల అతీగతీ లేదు. కేవలం 30 రిజర్వాయర్లు, బ్యారేజీలకు మాత్రమే వరద ప్రవాహం గురించిన అంచనాలు సిద్ధంగా ఉన్నాయి ప్రధాన నగరాల్లో వరద ప్రమాదాల గురించిన అంచనా, ఉపశమన చర్యల ప్రాజెక్టుల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదని కాగ్ దుయ్యబట్టింది కూడా.
ఇక వరద ప్రాంతాల్లో ధ్వంసమైన ఇళ్లకు చెల్లిస్తున్న నష్టపరిహార మొత్తం దేశమంతా ఒకే విధానంతో ఉండటం సమస్యలను రెట్టింపు చేస్తోంది. నష్టతీవ్రతకు అనుగుణంగా పరిహారం అందించకుండా సమానత్వ ప్రాతిపదికన రూళ్లకర్ర సిద్ధాం తాన్ని అమలు చేస్తే ప్రభావిత ప్రాంతాలు కోలుకోవడం చాలా కష్టం. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, మత్స్య పరిశ్రమలు, పశుసంపద, హస్తకళలు వంటి వాటికి జరిగిన నష్టంపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే అవి కుప్పగూలడం తథ్యం.
అన్నిటికంటే ముఖ్యంగా విపత్తులు సంభవిం చినప్పుడు సైన్యం, పారామిలటరీ బలగాలను మాత్రమే తరలించే పద్ధతి వల్ల రాష్ట్రాల్లో వరద సహాయక చర్యలు కుంటినడకతో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశం బలమైన విపత్తు నిర్వహణా సంస్థను తక్షణం నెలకొల్పాల్సిన అవసరముంది. ఇప్పుడు కావలసింది ప్రకృతి వైపరీత్యాల అత్యవసర నిర్వహణపై దృష్టి సారించడమే కానీ తాత్కాలిక చర్యలతో సరిపెట్టుకోవడం కాదు. ఈ విషయంలో రాష్ట్రాల స్వావలంబన చాలా ముఖ్యం.
వరుణ్‌గాంధీ
వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు
ఈ–మెయిల్ : fvg001@gmail.com
Comments
Please login to add a commentAdd a comment