కేదార్‌నాథ్‌లో 2013 సంవత్సరం వరదల విలయతాండవం చోటుచేసుకున్న తర్వాత, 11 వేల అడుగుల కంటే ఎత్తులో ఉన్న పూడిపోయిన ఆలయ గర్భగుడి పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు. సుప్రసిద్ధ భూగర్భ శాస్త్రవేత్త డాక్టర్ నవీన్ జుయల్ ఆలయ పునర్మిర్మాణంపై తీవ్రంగా హెచ్చరించారు. ఈ ప్రాంతంలో భారీ నిర్మాణం, పెద్దమొత్తంలో సిమెంట్ లేక ఇనుమును ఉపయోగిస్తే కేదార్‌నాథ్ పరిసరాల్లో భవిష్యత్తులో మరిన్ని విపత్తులు చెలరేగుతాయని హెచ్చరించారు. వేసవిలో మంచు కరిగేటప్పుడు భూ ఉపరితలానికి పైనున్న నేల కిందికి జారిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కానీ పర్యావరణ హెచ్చరికలపై, శాస్త్రీయ వాదనలపై దృష్టి సారించడానికి బదులుగా ఎన్నికల్లో గెలుపు కోసం పరుగుపందెమే ఇప్పుడు ముఖ్యమవుతోంది.
కేదార్‌నాథ్‌లో డాక్టర్ జుయల్, ఇతర నిపుణులు పర్యటనలు ప్రారంభిస్తున్నప్పుడు, కేదార్‌నాథ్, ఉత్తరాఖండ్ కొండల చుట్టూ వెల్లువగా ప్రకృతి విపత్తుల ఘటనలు పెరుగుతూ వచ్చాయి. అక్కడ నిర్మాణపనులు పెరిగినప్పుడే విపత్తులు కూడా పెరగడం కాకతాళీయంగా కొట్టిపారేయలేం. ఈ ఒక్క ఏడాదిలోనే ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విపత్తుల కారణంగా 250 మంది ప్రజలు చనిపోయారు. పైగా ఇవి కలిగించిన ఆర్థిక నష్టాలు తక్కువేమీ కాదు. (చదవండి: ఆ చట్టాలు నేటికీ వివక్షాపూరితమే!)
కేదార్‌నాథ్ ప్రాంతంలో చేపడుతున్న ప్రతి అభివృద్ధి ప్రాజెక్టూ జాతీయ భద్రతతో, మతపరమైన విశ్వాసాలతో ముడిపడి ఉంది. ఈ నెల మొదట్లో కేదార్‌నాథ్ పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ ‘పర్వతాల్లో నీళ్లు, పర్వతాల్లో యువత’ అనే పాత సామెతను ఉపయోగించారు. తన ప్రభుత్వం ఈ రెండింటినీ (నీరు, యువత) అభివృద్ధి పథకాలతో కాపాడటానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. అయితే జీవితాలను నిలబెట్టడానికి బదులుగా పర్వతాల్లోని నీరు వేగంగా నిర్మించిన డ్యాముల్లో ఇరుక్కుపోయి ఉంది. వరదల రూపంలో పదేపదే విపత్తులకు కారణమవుతోంది.
రాష్ట్రంలో 225 కోట్ల రూపాయలతో అభివృద్ధి పథకాలను ప్రకటిస్తూ, ఈ శతాబ్ది మూడోదశాబ్దం ఉత్తరాఖండ్‌దే అవుతుందనీ, గత వందేళ్లలో ఎన్నడూ చూడని విధంగా వచ్చే పదేళ్లలోనే రాష్ట్రానికి పర్యాటకులు వెల్లువెత్తుతారనీ మోదీ ఘనంగా ప్రకటించారు. రాష్ట్రంలో అనేకమంది ప్రజలకు మతపరమైన, ప్రకృతిపరమైన పర్యాటకం ఒక్కటే ఏకైక ఆధారం అనేది నిజం. కానీ ఉత్తరాఖండ్‌లో ప్రోత్సహిస్తున్న ప్రణాళికలు కొంతమంది కాంట్రాక్టర్లకు, కంపెనీలకు మాత్రమే లబ్ధి కలిగిస్తాయి. వీటి నుంచి సామాన్య ప్రజానీకం పొందేది ఏమీ లేదు. (చదవండి: కాలుష్య నియంత్రణ వ్యయమూ పెట్టుబడే!)
పర్యావరణ నియమాలను నిర్లక్ష్యపర్చడం, విచక్షణారహితంగా అడవులను నరికేయడం కారణంగా ఈ యాత్రామార్గంలో నిర్మాణ పనులు తరుచుగా వార్తల్లోకి ఎక్కుతున్నాయి. చార్‌ధామ్ యాత్రా మార్గాన్ని అన్ని వాతావరణాల్లో పనిచేసే రహదారిగా పేర్కొన్నారు. కానీ నాణ్యతా లోపం వల్ల కట్టిన రహదారి ఎప్పుడో మాయమైపోయింది. నదీ ఉపరితలాలను ఆక్రమించడం, అక్రమ నిర్మాణాలు, పేలవమైన నగర నిర్వహణ వంటివి విపత్తులకు కారణాలు. ఢిల్లీ–మీరట్ హైవే లేదా ఉత్తరాఖండ్‌లో ముంబై–పుణే హైవే వంటి రహదారుల నిర్మాణం అన్ని వాతావరణాల్లో పనిచేసేవిధంగా ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇది పర్వత ప్రాంత భౌగోళికతకు దూరంగా లేదు. అందుకనే ప్రతి ఏటా ఈ రోడ్లు వరదల్లో కొట్టుకుపోతుంటాయి. ప్రజాధనం వృథా అయిపోతుంటుంది. పర్యావరణానికి మాత్రం కోలుకోలేని నష్టం జరుగుతుంటుంది. సరిహద్దు ప్రాంతాలకు నాణ్యమైన రహదారులు కావాలి తప్ప వెడల్పాటి రహదారులు అవసరం లేదు. పైగా అత్యంత సున్నిత ప్రాంతాల్లో రహదారులను నిర్మించడమే కాకుండా, సొరంగాలు కూడా తవ్వడం మరీ ప్రమాదకరం.
కేదార్‌నాథ్‌కి కేబుల్ కార్లలో నేరుగా చేరుకోవాలన్న ప్రధాని మోదీ ఆలోచన పర్యావరణ పరిరక్షణకు భిన్నంగా ఉంది. పైగా ఆధ్యాత్మిక యాత్రల స్ఫూర్తికి అది దూరంగా ఉంటుంది. కేదార్ మార్గ్ ప్రయాణంలో ప్రకృతి నిసర్గ సౌందర్యం నుంచి నడుచుకుంటూ పోతూ చివరి గమ్యాన్ని చేరుకున్నప్పుడు కఠిన ప్రయాణాన్ని అధిగమించిన భావన మనసు నిండా వ్యాపిస్తుంది. కానీ కేదారనాథ్‌లో ఇప్పుడు హెలికాప్టర్లు రొదపెడుతున్నాయి. న్యాయస్థానాల ఆంక్షలను ఈ హెలికాప్టర్లు ప్రత్యక్షంగా ఉల్లంఘిస్తున్నాయి. నిరంతరం ఇవి పెట్టే రొద, శబ్దాలు కేదార్ రక్షిత లోయలోని పక్షులు, జంతువుల ఉనికికి ప్రమాదకరంగా మారుతున్నాయి. నడకదారిలో యాత్ర మెల్లగా సాగిపోతున్నప్పుడు యాత్రికులు అక్కడక్కడా కూర్చుంటూ మరింత ఎక్కువ సమయం ఈ ప్రాంతంలో ఆహ్లాదంగా గడిపేవారు. స్థానిక దుకాణదారులు, దాబా యజమానులు, టీ విక్రేతలు, వ్యాపారులు, సరకులు మోసే వారు, ఇంకా అనేకమంది లబ్ధి పొందేవారు. దీనికి భిన్నంగా హెలికాప్టర్లు, హైవే వల్ల కొన్ని ఎంచుకున్న కంపెనీలకు, ట్రావెల్ ఏజెంట్లకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది.
గ్లాస్గోలో కాప్–26 వాతావరణ సదస్సు జరుగుతున్నప్పుడు ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆ సదస్సు నుంచి తిరిగొచ్చిన ప్రధాని పర్యావరణ హిత జీవన శైలి అనే నినాదాన్ని ఇచ్చారు. కానీ ప్రకృతిని వట్టి నినాదాల ద్వారా మాత్రమే కాపాడలేమని పదేపదే రుజువవుతోంది. ప్రకృతిని ఛిన్నాభిన్నం చేసే ప్రతి ఒక్క ప్రయత్నమూ, నేటి, రేపటి తరాలను బలి తీసుకుంటుందని మరవరాదు.
– హృదయేష్ జోషీ
రచయిత, సంపాదకుడు
Comments
Please login to add a commentAdd a comment