చెప్పింది ఒకటి..అమలు చేస్తున్నది ఇంకొకటి | peoples are concern on compensation | Sakshi
Sakshi News home page

చెప్పింది ఒకటి..అమలు చేస్తున్నది ఇంకొకటి

Published Tue, Nov 18 2014 2:02 AM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

చెప్పింది ఒకటి..అమలు చేస్తున్నది ఇంకొకటి - Sakshi

చెప్పింది ఒకటి..అమలు చేస్తున్నది ఇంకొకటి

ప్రకృతి వైపరీత్యం వల్ల పంటలు దెబ్బతింటే ప్రభుత్వం రైతులకు పరిహారం ప్రకటిస్తుంది. కానీ ఆ పరిహారాన్ని పొందాలంటే అంతోఇంతో పండిన పంటను పూర్తిగా తమకు జమ చేయాలని నిబంధన విధిస్తుందా!? లేదే!...కానీ మత్స్యకార మెకనైజ్డ్ బోట్లకు పరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వం అలాంటి అసంబద్ధ నిబంధన విధించింది. పరిహారం విషయంలో సీఎం చంద్రబాబు చెప్పింది ఒకటి... జీవోలో వచ్చింది మరొకటి... అమలు చేస్తున్న తీరు ఇంకొకటి... వెరసి అసలే తుపానుతో దెబ్బతిన్న బోట్ ఆపరేటర్లు ప్రభుత్వ వైఖరితో నిండామునుగుతున్నారు.
 
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : మత్స్యకారులు, బోట్ ఆపరేటర్లకు పరిహారం విషయంలో సీఎం చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నా... పరిహారం మాత్రం ప్రభుత్వ ఖజానా దాటి బాధితులకు చేరడం లేదు. ‘తుపానుతో దెబ్బతిన్న ప్రతి బోటుకు పరిహారం చెల్లిస్తాం’ అని ఆయన ప్రకటించారు. దెబ్బతిన్న ప్రతి బోటుకు రూ.6 లక్షలు పరిహారం చెల్లిస్తామని చెప్పారు. కానీ ఆయనమాటలకు ఏమాత్రం పొంతనలేకుండా ప్రభుత్వం జీవో 13ను జారీ చేసింది. దెబ్బతిన్న బోట్లకు పరిహారం విషయంలో అందులో మూడు కేటగిరీలుగా విభజించారు. నీటమునిగి పూర్తిగా దెబ్బతిన్న మెకనైజ్డ్  బోట్లకే రూ.6 లక్షలు పరిహారం చెల్లిస్తామని చెప్పారు.

తీవ్రంగా దెబ్బతిని మరమ్మతులు చేయాల్సిన మెకనైజ్డ్ బోట్లకు రూ.3 లక్షలు పరిహారం చెల్లిస్తామని... స్వల్పంగా దెబ్బతిన్న బోట్లకు రూ.50 వేలు పరిహారంగా ఇస్తామని జీవోలో పేర్కొన్నారు. ఈ జీవోపైనే బోట్ ఆపరేటర్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దెబ్బతిన్న ప్రతి బోటుకు రూ.6 లక్షలు చెల్లిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.... కానీ అందుకు విరుద్ధంగా పరిహారాన్ని రూ.6 లక్షలు, రూ.3లక్షలు, రూ.50 వేలు చొప్పున కేటగిరీలుగా విభజించడమేమిటని ప్రశ్నించారు. పోనీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో అయినా యథాతథంగా అమలు చేస్తున్నారా అంటే అదీ లేదు. జీవో అమలు విషయం వచ్చేసరికి కొత్త షరతులు విధించడంతో బోట్ ఆపరేటర్లు హతాశులయ్యారు. పూర్తిగా దెబ్బతిన్న బోటుకు రూ.6లక్షలు పరిహారం చెల్లించాలంటే ఆ బోటును, దాని లెసైన్స్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని నిబంధన విధించారు.

రూ.6 లక్షల కోసం రూ.30 లక్షల బోటు ఇవ్వాలా!
బోట్లకు పరిహారం విషయంలో ప్రభుత్వం విధించిన నిబంధనతో బోట్ ఆపరేటర్లు అవాక్కయ్యారు. ఎందుకంటే ఒక మెకనైజ్డ్ బోటు ధర రూ.30 లక్షలు నుంచి రూ.35 లక్షల వరకు ఉంది. కానీ ఎంత దెబ్బతిన్నప్పటికీ రూ.6 లక్షల కోసం ఆ బోటును, దాని లెసైన్స్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేయాలనడం పూర్తిగా అసంబద్ధం.

ప్రభుత్వం ఇస్తోంది నష్టపరిహారమే తప్ప... కొత్త బోటు కొనుగోలుకు డబ్బు చెల్లించడం లేదు. అలాంటప్పుడు దెబ్బతిన్న బోటును ప్రభుత్వానికి సరెండర్ చేయాలనడం పూర్తిగా అసమంజసం.ప్రభుత్వం రూ.6 లక్షలు ఇచ్చినా దెబ్బతిన్న బోటును మరమ్మతు చేసుకోవాలంటే బోట్ ఆపరేటర్ మరో రూ.8 లక్షలు వరకు ఖర్చు చేయాలి. ఏకంగా కొత్త బోటు కొనుగోలు చేయాలంటే మరో రూ.25 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే దెబ్బతిన్న బోట్లను సరెండర్ చేస్తేనే రూ.6 లక్షలు ఇస్తామని ప్రభుత్వం మెలికపెట్టడం బోట్ ఆపరేటర్లను విస్మయపరుస్తోంది.

10 వేల మంది జీవితాలతో చెలగాటం
హుద్‌హుద్ తుపానుతో విశాఖపట్నం ఫిషింగ్‌హార్బర్‌లో 64 మెకనైజ్డ్ బోట్లు నీటమునిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటిలో 53 బోట్లను క్రేన్ల సహాయంతో వెలికితీశారు. ఆ బోట్లు బా గా దెబ్బతిన్నాయి. ఇంకా 11 బోట్లను వెలుపలికి తీయడం సాధ్యం కాలేదు. కాగా ఈ వెలుపలికి తీసిన ఈ బోట్లకు పరిహారం చెల్లించాలంటే వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలి. కానీ ఇందుకు బోట్ ఆపరేటర్లు ససేమిరా అంటున్నారు. ఒక్కో బోటు ఖరీదు రూ.30 లక్షలు కా గా మునిగిపోయిన సమయంలో ఒక్కో బోటు లో వీహెచ్‌ఎఫ్ సెట్, వలలు, ఇంజిన్, కనీసం 5వేల లీటర్ల డీజిల్, 15-20 రోజులకు సరిపడా వంటదినుసులు ఉన్నాయి.

కానీ ప్రభుత్వం ఇచ్చే రూ.6లక్షల పరిహారం కోసం ఆ బో ట్లను సరెండర్ చేస్తే ఇక తాము నిండామునిగిపోయినట్లేనని వాపోతున్నారు. ప్రభుత్వం రూ.6 లక్షలు ఇచ్చినా తా ము మరో రూ.8 లక్షలు వరకు వెచ్చిం చి బోట్లను మరమ్మతులు చేసుకోవా ల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వానికి పరిహారం చెల్లించే ఉద్దేశం లేదని స్పష్టం కావడంతో బోట్ ఆపరేటర్లు ప్రైవే టు అప్పులు చేసి బోట్లకు మరమ్మతలు చే యించుకుంటున్నారు.

ఇప్పటికే నెలరోజులై ఉపాధి లేకుండాపోయింది. దాంతో అప్పోస ప్పో చేసి బోట్లను బాగుచేసుకుని సముద్రంలో వేటకు వెళితే తప్పా జీవనం గడిచే పరిస్థితి లేదు. ఒక్కో బోటు ప్రత్యక్షంగా 8 మంది మత్స్యకారులకు, పరోక్షంగా కొన్ని వందలమంది జీవనోపాధి పొందుతున్నారు. విశాఖపట్నంలో మెకనైజ్డ్ బోట్ల పరిశ్రమ కనీసం 10వేలమందికి జీవనోపాధి కల్పిస్తోంది. అంతమంది జీవితాలతో ముడిపడిన పరిశ్రమకు పరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వం దొంగాట ఆడుతుండటం విస్మయపరుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement