సాక్షి, అమరావతి: చంద్రబాబు ఎగ్గొట్టిన పాత బకాయిలను సైతం చెల్లించి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తుంటే ఈనాడు రామోజీ మాత్రం పరిహారం చెల్లింపుల్లో కోతలు విధించారంటూ అబద్ధాలను అచ్చేశారు. నిజంగానే పరిహారం భారాన్ని తగ్గించుకోవాలనుకుంటే గత సర్కారు ఎగ్గొట్టిన పాత బకాయిలతో సహా ప్రభుత్వం ఎందుకు చెల్లిస్తుంది? రైతులపై పైసా భారం పడకుండా దేశానికే ఆదర్శంగా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలియదా?
ఆరోపణ: గతంలో స్వచ్ఛందంగా చేరేవారు..
వాస్తవం: 2016 నుంచి అమలవుతున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎం ఎఫ్‌బీవై)లో చేరాలంటే నోటిఫై చేసిన పంటలకు రుణం తీసుకున్నప్పుడు తప్పనిసరిగా ప్రీమియం వసూలు చేసే వారు. ఇష్టపూర్వకంగా చేరాలంటే ప్రీమియం చెల్లింపులు తలకు మించిన భారంగా పరిణవిుంచాయి.
నమోదు ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటంతో మెజార్టీ రైతులకు పంటల బీమా అందని ద్రాక్షగా మారింది. మంజూరైన పరిహారం రుణ ఖాతాలకు సర్దుబాటు చేయడంతో సరిపుచ్చడంతో నష్టపోయిన రైతుకు భరోసా లభించేది కాదు. పైగా ఏనాడూ ఖరీఫ్ సీజన్ పరిహారాన్ని మరుసటి ఏడాది ఆగస్టు లోపు చెల్లించిన దాఖలాలు లేవు.
ఆరోపణ: రైతులకు భారంగా ఉచిత పంటల బీమా
వాస్తవం: పంటల బీమా అన్నదాతలకు గుదిబండ కాకూడదన్న సంకల్పంతో డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఖరీఫ్ 2019 సీజన్ కోసం కేవలం రూపాయి మాత్రమే ప్రీమియంతో పథకాన్ని అమలు చేయగా రైతుల వాటా రూ.468 కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.503 కోట్లు కలిపి మొత్తం రూ.971 కోట్లను తానే భరిస్తూ బీమా కంపెనీలకు చెల్లించింది.
అవగాహన లేనందున కొద్దిమంది రైతులు బీమా పరిధిలోకి రాలేదని గుర్తించిన ప్రభుత్వం 2020 ఖరీఫ్ నుంచి పైసా కూడా భారం పడకుండా పూర్తిగా ఉచితంగా పంటల బీమాను వర్తింప చేసింది. ఇందుకు పీఎంఎఫ్‌బీవై నిబంధనలు అడ్డంకిగా మారడంతో ఆ పథకం నుంచి బయటకొచ్చి 2020–21, 2021–22 సీజన్లలో సొంతంగానే బీమా పరిహారం చెల్లించింది. 2022–23 నుంచి పీఎం ఎఫ్‌బీవైతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది.
ఆరోపణ: 2022–23 ఖరీఫ్‌లో కోతలు ఎందుకు విధించారు?
వాస్తవం: దేశంలో ఏ కంపెనీ అయినా ఒక జిల్లాలో కనీసం 5 వేల ఎకరాల్లో సాగయ్యే నోటిఫైడ్ పంటలకు మాత్రమే బీమాను వర్తింప చేస్తున్నాయి. ఇలా ఖరీఫ్–2022–23లో 21, రబీ 2023–24లో 17 పంటలను నోటిఫై చేశారు. గతేడాది అక్టోబర్ 31 నాటికి ఈ – క్రాప్ ప్రాథమిక డేటా ఆధారంగా ఖరీఫ్ 2022లో తొలుత 34.70 లక్షల మంది రైతులు సాగు చేసిన 70.80 లక్షల ఎకరాల్లోని పంటల వివరాలను కేంద్రానికి పంపగా డూప్లికేషన్, సాంకేతిక కారణాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఈ – కేవైసీ ప్రామాణికంగా 33.02 లక్షల మంది రైతులు సాగు చేసిన 68.20 లక్షల ఎకరాల పంటల వివరాలను డిసెంబర్‌లో తిరిగి కేంద్రానికి పంపారు. ఇప్పటివరకు 64.60 లక్షల ఎకరాల్లో పంటలు, 29.3 లక్షల మంది రైతుల వివరాలను నేషనల్ క్రాప్ ఇన్‌స్రూెన్స్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు.
ఆరోపణ: కప్ క్యాప్ మోడల్‌తో రైతులకు అన్యాయం..
వాస్తవం: పరిహారం తగ్గిన సందర్భాలలో అధిక ప్రీమియం వసూలు ద్వారా బీమా కంపెనీలు భారీగా ప్రయోజనం పొందుతున్నాయనే విమర్శల నేపథ్యంలో ప్రీమియం రేట్లను హేతుబద్ధీకరించగా కేంద్రం సూచించిన ఫార్మాట్లలో విజయవంతమైన కప్ అండ్ క్యాప్ (80–110 మోడల్‌ను 2023–24 సీజన్ నుంచి దిగుబడి ఆధారిత పంటల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఖరీఫ్ సీజన్‌లో 9 క్లస్టర్ల పరిధిలో దిగుబడి ఆధారిత పంటలకు ఈ విధానం అమలు చేస్తోంది.
110 శాతం కన్నా ఎక్కువ నష్టం సంభవిస్తే ఆ మేరకు సొంతంగా భరిస్తూ అదనపు పరిహారాన్ని రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే జమ చేస్తుంది. పరిహారం చెల్లింపులో ఎలాంటి కోతలు ఉండవు. మరోవైపు వాతావరణ ఆధారిత పధకానికి పాత పద్ధతిలోనే టెండర్లను ఖరారు చేశారు. దేశవ్యాప్తంగా అత్యల్ప ప్రీమియం రేట్లకు టెండర్లను ఖరారు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం విడ్డూరం.
ఆరోపణః గతంలో ఘనంగా పంటల బీమా..
వాస్తవం: టీడీపీ హయాంలో 2016–18 మధ్య పీఎంఎఫ్‌బీవై పథకంలో చేరిన 74 లక్షల మంది రైతులు తమ వాటాగా రూ.871.26 కోట్ల ప్రీమియం చెల్లించగా 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల పరిహారం లభించింది. అయితే గత నాలుగున్నరేళ్లలో రైతులపై పైసా భారం పడకుండా 54,48,344 మందికి రూ.7,802.05 కోట్ల పరిహారాన్ని జమ చేశారు.
టీడీపీ హయాంతో పోలిస్తే 23.63 లక్షల మంది రైతులు, రూ.4,390.85 కోట్లు అదనంగా లబ్ధి పొందారు. అంతేకాకుండా చంద్రబాబు 6.19 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల పంటల బీమా పరిహారాన్ని సైతం చెల్లించి రైతుల పట్ల సీఎం జగన్ తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. టీడీపీ హయాంలో 2.32 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పిస్తే గత నాలుగున్నరేళ్లలో 3.98 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ వర్తించింది.
నాడు 74.40 లక్షల మందికి బీమా రక్షణ కల్పిస్తే నేడు 1.71 కోట్ల మందికి బీమా రక్షణ దక్కుతోంది. అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకాన్ని పలు సందర్భాల్లో కేంద్రంతో పాటు అంతర్జాతీయ సంస్థలు సైతం ప్రశంసిస్తుంటే ఈనాడు రామోజీ భరించలేకపోతున్నారు!
Comments
Please login to add a commentAdd a comment