పడవ మునగడంతో మృతిచెందిన దుర్గాప్రసాద్ (ఫైల్)
కృష్ణాజిల్లా, తాడేపల్లి రూరల్(మంగళగిరి): అధికారం ముసుగులో బరితెగిస్తున్నారు.. నది గర్భాన్ని దోచుకుంటున్నారు.. నిబంధనలకు తిలోదకాలుస్తున్నారు.. అడ్డగోలుగా తవ్వకాలకు పాల్పడుతున్నారు.. ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు..
వివరాలు.. రాజధాని పరిధిలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. మూడు రోజుల క్రితం తుళ్లూరు మండలం లింగాయపాలెంలో యువకుడు మృతి చెందాడు. అయినా క్వారీని యథాతథంగా నిర్వహించారు. దీంతో ఓ పడవ ప్రమాదవశాత్తు శుక్రవారం నీటిలో మునిగిపోయింది. ఆ సమయంలో పడవలో ఐదుగురు కార్మికులు ఉన్నారు. కృష్ణానది ఒడ్డున వంద మీటర్ల దూరంలో పడవ మునిగిపోవడంతో, కార్మికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఎలాగోలా ప్రమాదం నుంచి బయటపడ్డారు. బుధవారం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలేనికి చెందిన పి.దుర్గాప్రసాద్ మృతి చెందిన ఘటన మర్చిపోకముందే ఇసుకరీచ్‌లో పడవ మునగడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా ఈ విషయాన్ని బయటకు చెబితే మీ అంతు చూస్తామని ఇసుక మాఫియా, టీడీపీ నాయకులు బెదిరించడంతో, జరిగిన ఘటనలను బయటకు చెప్పడానికి కార్మికులు భయపడుతున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
కనిపించని రెవెన్యూ సిబ్బంది..
టీడీపీ నాయకులు ఆధీనంలో ఉన్న ఏ ఇసుకరీచ్‌లో కూడా అధికారులు, రెవెన్యూ సిబ్బంది కనిపించరు. నామాత్రంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిబంధనలకు విరుద్ధంగా టన్నుల కొద్దీ ఇసుక తరలిస్తున్నా పట్టించుకునే వారు కనిపించడం లేదు. వారికి అనుమతించిన సామర్థ్యం కంటే ఎక్కువ తరలించడం, కేటాయించిన స్థలంలో కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు.
సర్టిఫికెట్‌లు, లైసెన్స్‌లు ఎక్కడ..?
నది, సముద్రం, పెద్ద పెద్ద చెరువుల్లో పడవలు నడపాలంటే కాకినాడ పోర్టులో తర్ఫీదు పొంది, లైసెన్స్ పొందాల్సి ఉంది. ప్రస్తుతం ఇసుక రీచ్‌లో పడవలు నడుపుతున్న డ్రైవర్లకు ఒక్కరికి కూడా లైసెన్స్‌లు లేవు. బుధవారం మునిగిన పడవ డ్రైవర్‌కు లైసెన్స్ లేదని కార్మికులు చెబుతున్నారు. పడవలకు సంబంధించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కాకినాడ పోర్టులో తీసుకోవాల్సి ఉంది. లింగాయపాలెం, ఉద్దండరాయపాలెం, రాయపూడి, పెనుమాక క్వారీల్లో నడిపే పడవల్లో ఒక్క పడవకు కూడా లైసెన్స్‌లు లేవు. ఈ ఇసుకరీచ్‌లన్నీ సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది.
పోర్టు అధికారి ఏమన్నారంటే..
కృష్ణానది ఎగువ ప్రాంతంలో తిరుగుతున్న పడవల ఫిట్‌నెస్ గురించి వివరణ కోరగా మచిలీపట్నం పోర్టు ఫిట్‌నెస్ అధికారి దుర్గానాగమల్లేశ్వరరావు స్పందిస్తూ ఆ బాధ్యత మా ఒక్కరిదే కాదని, పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ శాఖలకు కూడా ఉందని, వారు గుర్తించి మాకు వివరాలు అందించాలని చెప్పారు. ప్రస్తుతానికి ఏడు ఇసుక పడవలకు మాత్రమే అనుమతులు ఇచ్చామన్నారు. మాకన్నా ఎక్కువ బాధ్యత కాకినాడ పోర్టు వారికి ఉందని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment