పొట్టకూటి కోసం 9 మంది మత్స్యకారులు ఎప్పటిలానే సముద్రంలో వేటకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఒకరు వేరే బోటులో వెళ్లిపోగా మిగిలిన ఎనిమిది మంది సోనాబోటులో గమ్యానికి బయలుదేరారు. ఇంతలో వాతావరణంలో మార్పులతో కడలి కల్లోలంగా మారింది. దీంతో వారు వస్తున్న బోటు ప్రమాదానికి గురైంది. అర్ధరాత్రి.. నడిసంద్రంలో ఎటు వెళుతున్నారో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉండగా.. ముగ్గురు మత్స్యకారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దూకేసి గుప్పెడుపేట తీరానికి చేరుకున్నారు. మరో నలుగురు బోటులోనే ఉండిపోయారు. ఈ బోటు అలల ఉద్ధృతికి గుప్పెడుపేట–ఉమిలాడ గ్రామాల్లోని తీరానికి కొట్టుకొచ్చింది. స్థానికులు ఆరు గంటల పాటు తీవ్రంగా శ్రమించి వీరిని ప్రాణాలతో రక్షించారు.
పోలాకి: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారులు బర్రి తాతయ్య, వాసుపల్లి నరసింహ, మైలపల్లి శ్రీను, బర్రి అమ్మోరు, బర్రి ఎర్రయ్య, గనగళ్ల తాతయ్య, బర్రి మసేను, గోవింద అప్పన్న ఈనెల 9వ తేదీ సోమవారం విశాఖపట్నం నుం చి సోనాబోటులో సముద్రంలో వేటకు బయలుదేరారు. అక్కడి నుంచి బారువా తీరం వరకు వచ్చి 20వ తేదీ శుక్రవారం ఉదయాన్నే విశాఖకు తిరుగు పయనమయ్యారు. వీరిలో ఒకరు అదే ప్రాంతానికి చెందిన వేరే బోటులో వెళ్లిపోయారు. మిగిలిన 8 మంది సోనాబోటులో ప్రయాణిస్తున్నారు.
వారిలోని బర్రి తాతయ్య, వాసుపల్లి నరసింహ, బర్రి మసేను, గోవింద అప్పన్న, మైలపల్లి శ్రీను విశ్రాంతి తీసుకోవడానికి బోటులోని గదిలోకి వెళ్లిపోయారు. బర్రి అమ్మోరు, బర్రి ఎర్రయ్య, గనగళ్ల తాతయ్య బోటుపైనే ఉండిపోయారు. శుక్రవారం సాయంత్రం జీపీఎస్ పని చేయకపోవటంతో బోటు గతి తప్పింది. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల సమయంలో పోలాకి మండలంలోని గుప్పెడుపేట గ్రామం వైపు వస్తుండగా అలల ఉద్ధృతికి బోటు బోల్తాపడింది. బోటుపై ఉన్న బర్రి అమ్మోరు, బర్రి యర్రయ్య, గనగళ్ల తాతయ్య సముద్రంలోకి దూకి ఈదుకుంటూ గుప్పెడుపేట ఒడ్డుకు శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చేరుకున్నారు.
అక్కడకు 2 కిలోమీటర్ల దూరంలోని సంతబొమ్మాళి మండలంలోని ఉమిలాడ తీరానికి.. ప్రమాదానికి గురైన సోనాబోటు ఉదయం 6 గంటలకు కొట్టుకొచ్చి ంది. బర్రి తాతయ్య, మైలపల్లి శ్రీను, వాసుపల్లి నర్సింహ, బర్రి మసీను, గోవింద అప్పన్న లోపలే చిక్కుకున్నారు. దీనిని గుర్తించిన స్థానికులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. 35 టన్నుల బరువైన బోటును సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు పెద్ద క్రేన్ అవసరం ఉన్నా.. అలాంటి ఏర్పాటు జరగలేదు. స్థానికులే చొరవతీసుకుని దాదాపు 6 గంటల పాటు శ్రమించి యంత్రాల సాయంతో బోటును కట్ చేసి నలు గురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చే ర్చారు. బోటులోని మైలపల్లి శ్రీను(22) అనే ఒక మత్య్సకారుడి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.
అధికారుల మధ్య సమన్వయలోపం
అత్యవసర పరిస్థితిలో అధికారుల మధ్య సమన్వయ లోపంతో సహాయక చర్యలు డీలా పడ్డాయి. ఫైర్ సిబ్బంది గానీ అత్యవసర సేవా విభాగాలకు చెందిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గానీ హాజరుకాలేదు. ఇక పోలీసులు, మెరైన్, మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకున్నా అక్కడి పరిస్థితులను బట్టి చేసేదిలేక చేతులెత్తేశారు. గుప్పెడుపేట వైద్యాధికారి బలగ మురళి క్షతగాత్రులకు ప్రథమచికిత్స అందించి 108లో రిమ్స్‌కు తరలించారు. మత్స్యశాఖ డీడీ కృష్ణమూర్తి, టెక్కలి ఆర్డీవో వెంకటేశ్వరరావు, భావనపాడు మెరైన్‌సీఐ సాయిసత్యారావు, టెక్కలి సీఐ శ్రీనివాసరావు, పోలాకి తహసీల్దార్ జె.రామారావు, తదితరులు సహాయక చర్యలను పర్యవేక్షించారు.
హడావుడే తప్ప అధికారులు చేసిందేం లేదు
సంఘటనా స్థలంలో అధికారులు హడావుడే తప్ప చేసిందేం లేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్రేన్ తెప్పించలేకపోయారు. ఇక్కడి యువకులు సాహసం చేయకపోతే నిండు ప్రాణాలు నీటిలో కలిసిపోయేవి. బాధిత మత్స్యకారులను, బోటు యజమానిని ప్రభుత్వం ఆదుకోవాలి.
– లండ యర్రయ్య, మత్స్యకారసంఘ నాయకుడు, గుప్పెడుపేట
గంగమ్మ తల్లే కాపాడింది
రాత్రి బోటు పల్టీ కొట్టిన తర్వాత ఎవరికి వారు నడిసముద్రంలో విడిపోయాం. ఆ గంగమ్మ తల్లే మమ్మల్ని కాపాడింది. ఈ ప్రాంత వాసులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. నేను ముందు ఒడ్డుకు వచ్చాను. అదే బోటులో మా నాన్న బర్రి తాతయ్య కూడా ఉన్నారు. ఇద్దరం క్షేమంగా బయటపడ్డాం.
– బర్రి యర్రయ్య,
మత్స్యకారుడు, చింతపల్లి
Comments
Please login to add a commentAdd a comment