
ఏథెన్స్: గ్రీస్ సమీపంలోని మెస్సేనియా పైలోస్ తీరంలో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో 78 మంది మృతి చెందగా సుమారు 500 మంది గల్లంతై ఉంటారని అదే ప్రమాదంలో ప్రాణాలు దక్కించుకున్న ఇద్దరు యువకులు సిరియాకు చెందిన హసన్(23) పాకిస్తాన్ కు చెందిన రాణా(24) తెలిపారు. ఈ పడవలో 15 మంది సిబ్బంది, మొత్తంగా 700 మంది శరణార్థులు ప్రయాణిస్తున్నారని వారన్నారు.
లిబియా నుండి అనేక మంది అక్రమ రవాణాదారులు చాలా ఏళ్లుగా శరణార్థులను ఇలా తరలిస్తూ ఉన్నారని, అక్కడ తనకు చాలా తక్కువ వేతనం లభిస్తుండటంతో జర్మనీ వెళ్లాలన్న ఆలోచనతో ప్రయాణమయ్యానని హసన్ అన్నాడు.
మరో శరణార్థి రాణా తానూ ఇటలీ వెళ్లడం కోసం లిబియా అక్రమార్కులకు చాలా పెద్ద మొత్తంలో చెల్లించానని, కానీ వారు మాకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా చాలీచాలని నీళ్లు, ఆహారం ఇచ్చి నాలుగు రోజులు ప్రయాణంలో సర్దుకోమని చెప్పారన్నాడు.
పడవలో ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. మూడో రోజు పడవలోకి ఒక పక్క నుండి నీళ్లు రావడంతో జనమంతా కంగారుగా రెండో పక్కకు కదిలారు. అంతే క్షణాల్లో పడవ నీటమునిగింది. గ్రీస్ కోస్ట్ గార్డ్ బృందం వచ్చి కాపాడేంతవరకు మాకైతే ఏమీ తెలియలేదని వాళ్లిద్దరూ తెలిపారు.
బోటులో సుమారుగా 500 మంది ప్రయాణిస్తున్నారని వారిలో 79 మంది మృతదేహాలను మాత్రమే గుర్తించామని 104 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారని మిగిలిన వారు గల్లంతై ఉంటారని వారు ప్రాణాలతో దొరికే అవకాశాలున్నాయని గ్రీస్ కోస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇతర బోట్లతో పాటు డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని వారు తెలిపారు.
ఇది కూడా చదవండి: 3 వేల ఏళ్లయినా ‘కత్తి’లా ఉంది!
Comments
Please login to add a commentAdd a comment