గిలకలదిండి హార్బర్ వద్ద మట్టి మేట వేసిన దృశ్యం
కృష్ణాజిల్లా, మచిలీపట్నం సబర్బన్: పూడిక దశకు చేరుకున్న గిలకలదిండి సముద్రపు మొగ సముద్రపు మత్య్స వేటకు ప్రధాన అడ్డంకిగా మారింది. అర మీటరు లోతు మాత్రమే ఉన్న నీళ్లలో వేట కు వెళ్లలేక బోట్లన్నీ హార్బర్ వద్దే నిలిచిపోవడం మత్య్సకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మూడేళ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నా పాలకులు పట్టించుకోకపోవడం తమ పాలిట శాపంగా మారిందని తీరంలోని మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా తీర ప్రాంతంలో సముద్రపు మత్య్సవేట కు ప్రసిద్ధి చెందిన గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ నేడు వెలవెలబోతోంది. ఇక్కడి నుంచి బయలుదేరి సముద్రంలో వేట కొనసాగించే 180 మెకనైజ్డ్ బోట్లు, 220 మోటరైజ్డ్ బోట్లు హార్బర్ వద్దే నిలిచిపోతున్నాయి. ఫలితంగా వందలాది టన్నుల చేపలు, రొయ్యలు, పీతల సేకరణకు బ్రేక్‌పడి ఎగుమతులు జరగకపోవడంతో మత్య్సకారులు పడుతున్న ఆర్ధిక ఇబ్బందులు వర్ణణా తీతం. మచిలీపట్నంతో పాటు గుంటూరు, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన మత్య్సకారులు దీనిపై ఆధారపడ్డారు. ప్రస్తుతం బోట్లపై పని చేసే డ్రైవర్‌లు, కలాసీలు అత్యధికంగా నిజాంపట్నం, అమలాపురం ప్రాంతాలకు చెందిన వారే.
పూడిపోయిన మొగ
గిలకలదిండి హార్బర్ నుంచి సముద్రం వరకు సుమారు 1.5 మీటర్ల దూరం. ఐదు నుంచి ఏడు రోజులు సముద్రంలో వేట సాగించే మోటరైజ్డ్ బోట్లు, రెండుమూడు రోజులు వేట సాగించే మోటరైజ్డ్ బోట్లు హార్బర్ నుంచి ఈ మార్గం ద్వారానే సముద్రంలోకి వెళ్లాల్సి ఉం టుంది. తీసుకొచ్చిన మత్య్స ఉత్పత్తులను హార్బర్‌లోనే వేలం పాటల ద్వారా విక్రయాల జరుగుతాయి. ఈ ప్రాంతంలో ఉన్న మత్య్సకా రుల వ్యాపారం అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యం తో 20 ఏళ్ల క్రితం పూడిపోయిన సముద్రపు మొగను డ్రెజ్జింగ్ చేశారు. అయితే ఆలల తాకిడి కారణంగా క్రమక్రమంగా మొగ పూడికదశకు చేరుకుంటోంది. మూడేళ్లుగా ఈ పరిణా మాలు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా మోటరైజ్డ్ బోటు సముద్రంలోకి వేటకు వెళ్లాలంటే కనీసం రెండు మీటర్లు లోతు తప్పనిసరి. అంతకన్నా తక్కువ లోతు ఉంటే బోటు అడుగు భాగం మట్టిలో కూరుకుపోతుంది. ప్రస్తుతం సముద్రపు మొగ వద్ద అర కిలోమీటరు దూరం మట్టి తీవ్ర స్థాయిలో మేట వేసిందని కలాసీలు చెబుతున్నారు. అంతేకుండా రోజురోజుకీ తీర ప్రాంత పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో సముద్రంలో ఇసుక దిబ్బలు ఏర్పడినట్లు మత్య్సకారులు చెబుతున్నారు. సముద్రం పాటు సమయంలో స్పష్టంగా కనిపిస్తున్న ఈ దిబ్బలు సముద్రపు వేటకు ప్రతికూలంగా మారుతున్నాయి. గతంలో 50 మీటర్లు మాత్రమే మొగ పూడిపోవడంతో పోటు సమయం చూసుకుని బోట్లు వేటకు వెళ్లేవి. అయితే ప్రస్తుతం అత్యధిక దూరం పూడిపోవడంతో హార్బర్ వద్దే రోజుల తరబడి బోట్లు నిలిచిపోతున్నాయి. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి ఇలా నెలకు నాలుగుసార్లు వచ్చే తీవ్ర పోటు నీటిని ఆధారంగా చేసుకునే బోట్లు వేటకు వెళ్తున్నాయి. ఇదిలా ఉంటే వేట ముగిం చుకుని తిరుగు ప్రయాణంలో తీవ్ర పోటు నీటి కోసం రెండుమూడు రోజులు మొగ వద్దే వేచి ఉండాల్సి ఉంటున్నామని మత్య్సకారులు వాపోతున్నారు. పోటు సమయం చూసుకోకుండా ముందుకు నడిపిన కారణంగా ఇప్పటి వరకు ఐదు బోట్లు మేట వేసిన మట్టిలో కూరుకుపోయాయి. అత్యధిక లోతులోకి కూరుకుపోవడంతో బోటు అడుగు భాగం పూర్తిగా దెబ్బతిని పనికిరాకుండా పోయినట్లు పలువురు బోటు యజమానులు చెబుతున్నారు.
అంచనాలతో సరి
తీవ్రస్థాయిలో మేట వేసిన మట్టిని డ్రెజ్జింగ్ చేసి తొలగించాలని మత్య్సశాఖ అధికారులు రెండేళ్ల క్రితమే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మేటను తొలగించేందుకు రూ. 255 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి తెలిపారు. మొగ వద్ద ఉన్న పరిస్థితులను మత్య్సశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాంశంకర్ నాయక్ స్వయంగా పరిశీలించారు. అప్పట్లోనే పర్యావరణ అనుమతులు, నిధుల విడుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా బందరు పోర్టు నిర్మాణ అంశం మొగ డ్రెజ్జింగ్ పనులకు ప్రధాన అడ్డంకిగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొగ డ్రెజ్జింగ్ పనులు చేపడితే పోర్టు నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తుతాయంటూ ఏంయూడీఏ అధికారులు డ్రెజ్జింగ్‌ను అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇబ్బందుల్లో మత్య్సకారులు
మచిలీపట్నంలోని వేలాది మత్య్సకార కుటుం బాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా గిలకలదిండి హార్బర్ పైనే ఆధారపడి జీవిస్తుంటారు. వేలాది టన్నుల చేపలు, రొయ్యలును ప్రాసెసింగ్ చేయడం, వలల మరమ్మతులు, ఐస్ విక్రయాలు జరపుతూ కొందరు జీవనోపాధి సాగిస్తుంటే మరికొందరు ఎండు చేపల విక్రయాల ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. సముద్రపు వేటకు అంతరాయం ఏర్పడిన నాటి నుంచి వేలాధి కుటుంబాలు రోడ్డున పడ్డాయని మత్య్సకారులు వాపోతున్నారు.
నడపడానికి కూడా ఇబ్బందే
దాదాపు అర కిలోమీటరు పాటు మొత పూడిపోయింది. పాటు సమయంలో నేల కనిపిస్తుంది. నెలకు నాలుగుసార్లు వచ్చే అత్యధిక పోటు నీళ్లను చూసుకుని బోట్లను సముద్రంలోకి తీసుకెళ్తున్నాం. కొన్నిసార్లు బోట్లు మట్టిలో కూరుకుపోతున్నాయి. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం. వేటకు వెళ్లి వారానికి ఒకసారి వస్తాం. వేట ముగించుకుని వచ్చేపుడు రెండుమూడు రోజులు మొగ దగ్గరే ఉండాల్సి వస్తోంది. నాతో పాటు చాలా మంది డ్రైవర్లు ఇతర ప్రాంతాల వారే. మేట వేసిన మట్టిని తొలగించి మొగను అభివృద్ధి చేయాలి. – పెదశింగు నాగేశ్వరరావు, బోటు డ్రైవర్, అమలాపురం
నిధులొస్తే పనులుప్రారంభిస్తాం
మొగ వద్ద ఉన్న దారుణమైన పరిస్థితులను ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. మరో నెల రోజుల్లో పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశం ఉంది. అనంతరం నిధులు విడుదల కాగానే డ్రెజ్జింగ్ పనులు ప్రారంభించి పూడిక తీత చర్యలు తీసుకుంటాం.–రాఘవరెడ్డి, డీడీ, మత్య్సశాఖ
Comments
Please login to add a commentAdd a comment