
కృష్ణానదిలో ‘కేరళ’ బోటు
ఏపీ రాజధాని అమరావతిలో త్వరలో బోటు షికారు
రూ.2 కోట్లతో 90 టన్నుల భారీ బోటు తయారీ
సాక్షి, విజయవాడ బ్యూరో: కేరళ తరహాలో నీటిపై విహరిస్తూ విందువినోదాలు చేసుకునేందుకు వీలుగా ఏపీ నూతన రాజధాని అమరావతి చెంత త్వరలో ఒక భారీ బోటు అందుబాటులోకి రానుంది. కేరళకు చెందిన చాంపియన్ సంస్థ ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణా నదిలో ‘చాంపియన్ టీనా’ పేరుతో రూ. 2 కోట్లతో ఈ బోటును తీర్చిదిద్దుతోంది. 40 మందికి పైగా కార్మికులు ఆరు నెలలుగా దీని నిర్మాణంలో పాల్గొంటున్నారు. బోటు తయారీకి కేరళ, పాండిచ్చేరి, గోవా బోట్లలో ఉపయోగించే ప్రత్యేక చెక్కను వాడుతున్నారు.
కృష్ణా నది నీటి ప్రవాహానికి, పరిస్థితికి అనుగుణంగా దీన్ని మలుస్తున్నారు. నీటి హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఈ బోటు బ్యాలెన్సు చేసుకునేలా సాంకేతికతను జోడిస్తున్నారు. సుమారు 90 టన్నుల బరువు ఉండే ఈ బోటులో సుమారు 400 మంది ఏక కాలంలో పార్టీలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో మొత్తం మూడు ఏసీ బెడ్‌రూమ్‌లు కూడా తీర్చిదిద్దుతున్నారు. బోటు అడుగు భాగంలో రెండు, పైన ఒకటి బెడ్‌రూమ్ ఉంటుంది.
పెళ్లి, రిసెప్షన్, పుట్టిన రోజు తదితర వేడుకలకు ఉపయోగించుకునేలా దీన్ని నిర్మిస్తున్నారు. ఈ బోటుకు ఈ ప్రాంతంలో ఆదరణ బాగుంటే మరికొన్నింటిని తీర్చిదిద్దే యోచన కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు భవానీ ఐలాండ్ వద్ద ఉన్న చిన్నబోటులో చిన్న చిన్న పార్టీలు నిర్వహిస్తున్నారు. ఈ భారీ బోటు అందుబాటులోకి వస్తే రాజధాని ప్రాంతంలో విందు, వినోదాలతో కూడిన ఫంక్షన్‌లకు ఇదో వినూత్న తరహా వేదిక అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.