కేరళలో జరిగిన బోటు ప్రమాదం 22 మందిని పొట్టన పెట్టుకుంది. ఆదివారం సెలవు కావడంతో సంతోషంగా గడిపేందుకు వచ్చిన అనేక కుటుంబాల్లో తీరాన్ని విషాదాన్ని నింపింది. మలప్పురం జిల్లాలో డబుల్ డెక్కర్ హౌజ్ బోటు మునిగిపోవడంతో అందులోని టూరిస్టులంతా నీటిలో పడిపోయిన విషయం తెలిసిందే. తానూర్ ప్రాంతంలోని తువల్తీరం బీచ్ సమీపంలో ఆదివారం రాత్రి 7 గంటలకు ఈ ఘోరం వెలుగు చూసింది. ఈ ఘటనలో బోటు యజమానిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ప్రమాదానికి కారణాలు!
గా పడవ బోల్తా పడటానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ప్రమాద సమయంలో బోటులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే దానికిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. అయితే నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోటులో సామర్థానికి మించి ప్రయాణికులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
చదవండి: రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-21 యుద్ధవిమానం.. ఇద్దరు మహిళలు మృతి
నిబంధనల ఉల్లంఘన
బోటు మునిగిపోవడం చాలా విషాదకరమైన, దురదృష్టకర సంఘటన అని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఎమ్మెల్యే కున్హాలికుట్టి విచారం వ్యక్తం చేశారు. బోటు ప్రమాదంలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు భావిస్తున్నామని తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత హౌస్‌బోట్స్ రైడ్స్‌కు వెళ్లేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన హౌస్‌బోట్‌కు ఎలాంటి సేఫ్టీ సర్టిఫికేట్ కూడా లేదు. 40 మంది టికెట్ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే చాలామంది టికెట్ తీసుకోకుండానే పడవ ఎక్కిన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
అండర్ వాటర్ కెమెరాల సాయంతో గాలింపు
మలప్పురం బోటు దుర్ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు చిన్నారులు సహా 22 మంది మృత్యువాత పడ్డారు.వీరిలో 11 మంది ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరో ఎనిమిది మందిని కాపాడి ఆసుప్రతికి తరలించారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో విహారయాత్రకు వచ్చి వీరంతా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన వారికోసం ఘటనా స్థలంలో ఎన్‌డీఆర్‌ఎఫ్, భారత కోస్ట్‌గార్డ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అండర్ వాటర్ కెమెరాల సాయం గల్లంతైన వారికోసం గాలిస్తున్నారు.
చదవండి: షాకింగ్.. భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్తాన్ విమానం.. 10 నిమిషాల పాటు..
ప్రముఖుల సంతాపం
బోటు ప్రమాదంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేరళ సీఎం పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుంటుబాలకు పీఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రెండు లక్షల ఎక్స్‌గ్రేషియాను మోదీ ప్రకటించారు. మలప్పురంలో హౌజ్ బోటు బోల్తాపడిన వార్తతో ఆందోళన చెందానని, తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు రాహుల్ గాంధీ. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రెస్క్యూ ఆపరేషన్‌లలో అధికారులకు సహకరించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఘటనా స్థలానికి సీఎం పినరయి
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బోటు ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తక్షణమే అత్యవసర సహాయక చర్యను చేపట్టాలని మలప్పురం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సోమవారం ఆయన ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అదే విధంగా బోటు ఘటన నేపథ్యంలో కేరళ వ్యాప్తంగా నేడు సంతాపదినం ప్రకటించారు. అధికారిక కార్యక్రమాలను రద్దు చేశారు. తానూర్‌కు చెందిన స్థానికులతో పాటు పోలీసులు, అగ్నిమాపక, ఆరోగ్యశాఖ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment